తహసీల్దార్లు గీత దాటితే వేటే

హైదరాబాద్, వెలుగు: తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్ అధికారాలు కల్పించిన సర్కారు.. తప్పు చేస్తే ఉద్యోగం నుంచి తొలగించే క్లాజ్​ను పొందుపరిచింది. భూముల రికార్డులను అక్రమంగా దిద్దినా, మోసానికి పాల్పడినా, అక్రమంగా పాస్​బుక్స్​ జారీ చేసినా.. క్రిమినల్​ కేసులు పెట్టడంతోపాటు సర్వీస్​ నుంచి తొలగిస్తారు. ఇక ప్రభుత్వ భూములకు అక్రమంగా పట్టాదారు పాస్​బుక్ జారీ అయినట్లు ఫిర్యాదులు అందితే.. కలెక్టర్​ విచారణ జరిపి ఆ హక్కుపత్రాలను రద్దు చేయాలి. బాధ్యుడైన తహసీల్దార్​ను డిస్మిస్​ చేయాలి. భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని, బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలి.

కౌలుదారు లేనట్టేనా?

కొత్తగా ప్రవేశపెట్టిన ‘తెలంగాణ రైట్స్​ ఇన్​ ల్యాండ్​ అండ్ పట్టాదార్​ పాస్ బుక్స్–2020’ బిల్లులో కౌలుదారు (టెనెంట్) అనే పదాన్ని తొలగించారు. పహాణీలో కాస్తుదారు కాలమ్  తొలగించిన నేపథ్యంలోనే సర్కారు ఈ పదాన్ని తీసేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత అడాప్ట్​ చేసుకున్న 1971 నాటి ‘ది తెలంగాణ రైట్స్​ ఇన్​ ల్యాండ్​ అండ్​ పట్టాదార్​ పాస్ బుక్స్​యాక్ట్’లో కౌలుదారు అనే పదానికి ‘లీజ్​ అగ్రిమెంట్ ప్రకారం కౌలుదారు’ అనే నిర్వచనం కూడా ఇచ్చారు. కానీ బుధవారం పెట్టిన బిల్లులో ఈ పదాన్ని పూర్తిగా తీసేశారు.

బిల్లులో కొత్త పదాలివే..

1971 నాటి యాక్ట్​తో పోలిస్తే తాజా బిల్లులో ‘ధరణి, స్పెషల్ ట్రిబ్యునల్, రిజిస్ట్రార్’ పదాలను చేర్చారు. రికార్డ్స్​ఆఫ్​ రైట్స్ నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన డిజిటల్​ ప్లాట్​ఫామ్​నే ‘ధరణి’ అని.. పెండింగ్​ భూవివాదాలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసే ట్రిబ్యునల్స్​ను స్పెషల్​ ట్రిబ్యునల్స్ గా పేర్కొన్నారు.

Latest Updates