3 నెలలుగా తిండి పెట్టట్లే..వేధింపులపై లాలూ కోడలు

పాట్నా:  ఆర్జేడీ చీఫ్​ లాలూ ప్రసాద్​ యాదవ్ ఇంటి వద్ద ఆదివారం హైడ్రామా నెలకొంది. లాలూ పెద్ద కొడుకు తేజ్​ప్రతాప్​ యాదవ్​ భార్య ఐశ్యర్యా రాయ్​ మొదటిసారి అత్తింటి వేధింపులపై నోరువిప్పారు. తనను తీవ్రంగా వేధిస్తున్నారంటూ ఆమె మహిళా హెల్ప్​ లైన్​కు ఫోన్​ చేయడంతో పోలీసులు రంగంలోకిదిగారు. తండ్రి చంద్రికా రాయ్​తోకలిసి లాలూ ఇంటి వరండాలో ధర్నాకు దిగిన ఐశ్వర్య మీడియాతో మాట్లాడారు. ‘‘విడాకులపై కోర్టు తీర్పు వచ్చేదాకా భర్త(తేజ్​ ప్రతాప్​ యాదవ్​)తోనే కలిసుండాలనుకున్నా. అత్త(రబ్రీదేవి), ఆడపడుచు(మీసా భారతి)కి నేనంటే మొదటి నుంచీ ఇష్టం లేదు. ఇంత పెద్ద ఇంట్లో మూడు నెలలుగా(జూన్​ నుంచి) నాకు తిండి పెట్టట్లేదు. కిచెన్​ తాళాలు వేసుకుని, కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వట్లేదు. ఇంట్లో నా పరిస్థితిపై వీడియో తీస్తుంటే, రబ్రీదేవి బాడీ గార్డొచ్చి మొబైల్​ లాక్కొనే ప్రయత్నం చేశాడు. అంతా కలిసి నన్ను బయటికి గెంటేశారు. ఇంట్లో నాకు సెక్యూరిటీ లేదు. అందుకే పోలీసులకు ఫోన్  చేశా’’అని ఐశ్వర్య ఏడుస్తూ చెప్పారు. మహిళా హెల్ప్​ లైన్​ ఆఫీసర్​ పరిమళ మీడియాతో మాట్లాడుతూ.. కోడలు(ఐశ్వర్య) వల్ల తనకు కూడా డేంజర్​ ఉందని అత్త(రబ్రీదేవి) ఆరోపిస్తున్నారని, ఈ పరిస్థితుల్లో ఐశ్వర్యను ఇక్కడే ఉండనివ్వలేమని, తండ్రి ఇంటికి పంపుతామని చెప్పారు. ఈ గొడవ జరుగుతున్నంత సేపు లాలూ కుటుంబీకులెవరూ బయటికి రాలేదు. ఉప ఎన్నికల ప్రచారం కోసం తేజ్​ ప్రతాప్​, తేజస్వీ ఉదయమే బయటికెళ్లారు. వ్యక్తిగతంగా భర్త(తేజ్​ ప్రతాప్​), మరిది(తేజస్వీ) ఇబ్బంది పెట్టలేదన్న ఐశ్వర్య.. ఆడపడుచు మీసాభారతి వల్లే సమస్య పెద్దదైందని చెప్పారు. మూడు నెలలుగా పుట్టింటివాళ్లు పంపే భోజనంతోనే కడుపునింపుకుంటున్నానని తెలిపారు. కాపురం నిలబెట్టడానికి తాము ప్రయత్నిస్తుంటే, అటునుంచి వేధింపులు ఎక్కువయ్యాయని ఐశ్వర్య తండ్రి, బీహార్​ మాజీ ఎమ్మెల్యే చంద్రికా రాయ్ అన్నారు.

Latest Updates