‘స్కై జంప్’లోనూ తేజస్ సక్సెస్

‘స్కై జంప్’లోనూ తేజస్ సక్సెస్

మొన్న ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై సక్సెస్ ఫుల్ గా ల్యాండ్ అయిపోయిన నావల్ తేజస్ ప్రొటోటైప్ యుద్ధ విమానం ఆదివారం ‘స్కైజంప్’లోనూ సత్తా చాటింది. విక్రమాదిత్యపై ఒకవైపు ఎత్తుగా ఉండే డెక్ పై నుంచి తేజస్ విజయవంతంగా టేకాఫ్​అయింది. ల్యాండింగ్, టేకాఫ్​ రెండూ సక్సెస్ కావడంతో నావల్ తేజస్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు తుదిదశకు చేరినట్లయింది. మన యుద్ధనౌకలపైకి ఇప్పటివరకూ అన్నీ విదేశాల నుంచి కొనుగోలు చేసిన ఫైటర్ జెట్లే దిగాయి. తాజా ఫీట్ తో మన యుద్ధనౌకపై దిగి, టేకాఫ్​ అయిన తొలి స్వదేశీ ఫైటర్ జెట్ గా తేజస్ నిలిచింది.  తేలికపాటి యుద్ధ విమానం (ఎల్ సీఏ) అయిన తేజస్–ఎన్ ప్రొటోటైప్ విమానాన్ని నేవీలో  టెక్నాలజీ డెమాన్ స్ట్రేషన్ లో భాగంగా తయారు చేశారు.

17న నింగిలోకి ‘జీశాట్–30’

ఇండియా కమ్యూనికేషన్ శాటిలైట్ల సిరీస్ లో మరో ఉపగ్రహం నింగికి చేరనుంది. ఈ నెల 17న జీశాట్–30 కమ్యూనికేషన్ శాటిలైట్ ను ఫ్రెంచ్ గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్–5 రాకెట్ ద్వారా ప్రయోగించనున్నట్లు ఇస్రో సోమవారం వెల్లడించింది. జీశాట్–30 శాటిలైట్ 3,357 కేజీల బరువు ఉందని తెలిపింది. ఇందులో మన దేశంతో పాటు మన దీవులను కవర్ చేసేందుకు కేయూ బాండ్, గల్ఫ్​ కంట్రీస్ ను కవర్ చేసేందుకు సీ బాండ్ ట్రాన్స్ పాండర్లు ఉన్నాయని పేర్కొంది. ఇది 15 ఏళ్లపాటు డీటీహెచ్, టెలివిజన్ అప్ లింక్, వీశాట్ సర్వీసులను అందించనుంది. గత ఏడాది అక్టోబరు 21న డీయాక్టివేట్ చేసిన ‘ఇన్ శాట్–4ఏ’ శాటిలైట్ స్థానంలో కమ్యూనికేషన్ సేవల కోసం ఈ జీశాట్-30 శాటిలైట్‌ను పంపనున్నారు.