నిన్న కర్నూలు.. నేడు హైదరాబాద్: సాంబార్ గిన్నెలో పడి మూడేళ్ల చిన్నారి మృతి

  • తీవ్రంగా గాయాలవడంతో ఉస్మానియాలో చికిత్స
  • కొద్ది గంటల్లోనే ప్రాణాలొదిలిని చిన్నారి

సాంబార్ గిన్నెలు పసిపిల్లల ప్రాణాలను మింగేస్తున్న ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. ఇటీవలే కర్నూలులో ఓ చిన్నారి సాంబారు గిన్నెలో పడి మరణించిన ఘటన మరవక ముందే హైదరాబాద్ శివారులో ఇదే తరహా విషాదం జరింగింది. ఫంక్షన్ హాల్‌లో ఆడుకుంటూ తిరుగుతున్న చిన్నారి మరుగుతున్న సాంబార్ గిన్నెలో పడి మూడేళ్ల చిన్నారి ప్రాణాలు వదిలాడు. సైబరాబాద్ పరిధిలోని షాబాద్‌లో ఈ ఘటన గురువారం జరిగింది.

సురేశ్ అనే వ్యక్తి తన మూడేళ్ల కొడుకుతో కలిసి షాబాద్ ప్రాంతంలో ఓ ఫంక్షన్‌కు వెళ్లాడు. అక్కడ ఆటుకుంటున్న పిల్లాడు కనిపించకుండా పోయాడు. కొద్దిసేపటికి వేడిగా ఉన్న సాంబార్ గిన్నెలో పడి ఉండడం గమనించి, వెంటనే షాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్లారు. ఆ చిన్నారికి తీవ్రంగా గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా హాస్పిటల్‌కు పంపారు వైద్యులు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి కన్నుమూశాడు.

అయితే తన కొడుకు మృతిపై సురేశ్ షాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాంబార్ గిన్నెలో ఎలా పడ్డాడనే దానిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. దీంతో పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

కర్నూలు ప్రైవేటు స్కూల్‌లో యూకేజీ విద్యార్థి

కర్నూలు జిల్లా పాణ్యంలో నవంబరు 13న వేడిగా ఉన్న సాంబారు గిన్నెలో పడి ఓ ఆరేళ్ల బాలుడు మరణించాడు. ఓర్వకల్లు మండలం తిప్పాయపాలెంకు చెందిన పురుషోత్తమ్ రెడ్డి అనే విద్యార్ధి.. పాణ్యంలోని విజయ నికేతన్ అనే  ప్రైవేటు స్కూల్ లో ఎల్‌కేజీ చదువుతున్నాడు. మధ్యాహ్నం భోజన సమయంలో ప్రమాదవశాత్తు వేడి సాంబారు గిన్నెలో పడి తీవ్ర గాయాల పాలయ్యాడు. దీంతో ఆ బాలుడిని వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమించి విద్యార్థి  మృతి చెందాడు. బాలుడి మరణంతో  బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సంఘాలు విజయనికేతన్ స్కూల్ యాజమాన్యంపై మండిపడ్డాయి. మేనేజ్ మెంట్ పై క్రిమినల్ కేసులు నమోదు చేసి,స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశాయి.

Latest Updates