కరెంట్ వాడకంలో తెలంగాణ ఆల్‌ టైమ్‌ రికార్డ్‌

  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను మించి వాడకం
  • అప్పుడు హయ్యెస్ట్‌‌  13,162 మెగావాట్లు
  • ఇప్పుడు రాష్ట్రంలో _13,168 మెగావాట్లు
  • ఆరేండ్లలో 132 శాతం పెరిగిన వినియోగం
  • ఎత్తిపోతలు,వ్యవసాయానికి పెరగడంతో..

కరెంటు డిమాండ్‌‌లో రాష్ట్రం రికార్డు సృష్టించింది. ఉమ్మడి ఏపీలోని గరిష్ట డిమాండ్‌‌ రికార్డును దాటేసింది. ఉమ్మడి రాష్ట్రంలో 2014 మార్చి 23న 13,162 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదవగా శుక్రవారం రాష్ట్రంలో 13,168 మెగావాట్ల కరెంటు అవసరమైంది. గతేడాది ఇదే రోజు రాష్ట్రంలో గరిష్ట డిమాండ్ 9,770 నమోదు కాగా ఇప్పుడు 34 శాతం ఎక్కువగా వాడకం పెరిగింది. రాష్ట్రం ఏర్పడే నాటితో పోలిస్తే ఏకంగా 132.6 శాతం డిమాండ్‌‌ పెరిగింది.  అప్పుడు 6,661 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదైంది. ఎత్తిపోతల పథకాలకు, వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంటు సరఫరాతో డిమాండ్‌‌ ఎక్కువవుతోంది.

తలసరి వాడకమూ పైపైకి

తలసరి విద్యుత్ వాడకంలోనూ దేశ సగటును రాష్ట్రం మించిపోయింది. దేశవ్యాప్తంగా సగటు తలసరి కరెంటు వాడకం 1,181 యూనిట్లు  కాగా రాష్ట్రంలో ప్రస్తుతం 1,896  యూనిట్లు. రాష్ట్రం ఏర్పడే నాటికి  తలసరి విద్యుత్ వినియోగం 1,356 యూనిట్లు కాగా ఆరేళ్లలో 39.82 శాతం పెరిగింది. మొత్తంగా రాష్ట్రంలో విద్యుత్ వాడకం పెరుగుతోంది. 2014లో 47,338 మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడగా 2018-–19లో 68,147 మిలియన్ యూనిట్లు వాడారు. గత ఆరేళ్లలో పోలిస్తే 44 శాతం ఎక్కువ విద్యుత్ వినియోగం జరిగింది.

ఇంత డిమాండ్ ఎట్ల పెరిగింది?

2014 జూన్ 2కు ముందు 2 వేల మెగావాట్లకు మించి అగ్రికల్చరల్‌‌ డిమాండ్ ఉండేది కాదు. నేడు ఎత్తిపోతలతో  ప్రాజెక్టులతో కలుపుకొని వ్యవసాయానికి 6 వేల మెగావాట్ల వరకు డిమాండ్ ఉంది. రాష్ట్రం ఏర్పడే నాటికి 19,02,754 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లుంటే ఇప్పుడు 24,31,056 అయ్యాయి.

2014లో ఎత్తిపోతల పథకాలకు 680 మెగావాట్ల డిమాండే ఉండేది. ఇప్పుడు కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల పంప్‌‌హౌస్​ల నిర్వహణకు 2,200 మెగావాట్లు అవసరమవుతున్నది. మున్ముందు ఇది మరింత పెరిగే అవకాశముంది. –

టీఎస్ ఐపాస్‌‌తో రాష్ట్రంలో పారిశ్రామిక, ఐటీ రంగాలు బాగా అభివృద్ధి చెందుతున్నాయి. కొత్త ఫ్యాక్టరీలు వెలుస్తున్నాయి. గతంలో పరిశ్రమలకు పవర్ హాలిడేలు ప్రకటిస్తే ఇప్పుడు 24 గంటలు కరెంటిస్తున్నారు.

టౌన్‌ లు పెరిగి..

టౌన్‌‌లు, సిటీలు శరవేగంగా పెరుగుతుం డటంతో వ్యాపార, వాణిజ్య కనెక్షన్లూ పెరిగాయి. రాష్ట్రం ఏర్పడే నాటికి మొత్తం కరెంటు కనెక్షన్లు కోటి 11 లక్షల 19 వేల 990 ఉంటే నేడు కోటి 54 లక్షల 14 వేల 451 ఉన్నాయి. గతంతో పోలిస్తే 38.61 శాతం కనెక్షన్లు పెరిగాయి. కనెక్షన్లు పెరగడంతో వాడకమూ ఎక్కువైంది.

మిగులు రాష్ట్రం చేస్తం

ఉమ్మడి రాష్ట్రంలో వాడకానికి మించి డిమాండ్ పెరగడం, దానికి అనుగుణంగా కరెంటు సరఫరా చేయగలగడం సంతోషాన్ని స్తోంది. విద్యుత్‌‌ ఉత్పత్తి, పంపిణీ, సరఫరా వ్యవస్థల్లో తీసుకొచ్చిన మార్పులే దీనికి కారణం. ప్రభుత్వ సహకారం వల్లే మార్పు సాధ్యమైంది. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేసి మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలనే సీఎం కేసీఆర్ కలను నిజం చేస్తాం.

                                                                                              – దేవులపల్లి ప్రభాకర్‌‌రావు,  ట్రాన్స్‌‌కో, జెన్‌‌కో సీఎండీ

Latest Updates