తెలంగాణ, ఏపీ నీళ్ల డ్రామా.. బోర్డుల మీటింగ్స్​లో రెండు రాష్ట్రాలదీ ఒకే పాట

 • పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరం లిఫ్టును ఎజెండాలో చేర్చని తెలంగాణ
 • కృష్ణా బోర్డు మీటింగ్​కు 2 గంటల ముందు దాకా ఎజెండా సీక్రెట్​
 • రాజకీయంగా సెల్ఫ్‌‌‌‌ ప్రొటెక్షన్‌‌‌‌ కోసమే ప్రభుత్వాల నీళ్ల లొల్లి
 • డీపీఆర్‌‌‌‌లకు ఓకే అంటూనే సర్కారు అనుమతి పేరిట మెలిక

‘నువ్వు కొట్టినట్లు చెయ్​.. నేను ఏడ్చినట్లు చేస్త’ అన్న తీరుగా  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వాలు నీళ్ల డ్రామా ఆడుతున్నాయి. పైకి కుస్తీ పడుతూనే.. లోలోపల దోస్తీ ఎజెండాను అమలు చేస్తున్నాయి. కృష్ణా, గోదావరి బోర్డుల మీటింగ్స్​లో ఈ విషయం బట్టబయలైంది. రాష్ట్రమంతా గగ్గోలు పెడుతున్న పోతిరెడ్డిపాడు గండి, సంగమేశ్వరం లిఫ్ట్ పై తెలంగాణ ప్రభుత్వం మరోసారి చేతులెత్తేసింది. కృష్ణా బోర్డుకు ఇచ్చిన ఎజెండాలో ఈ రెండు ప్రాజెక్టుల మాటెత్తనే లేదు. దీంతో ఏపీ కట్టే ప్రాజెక్టులకు ఇండైరెక్ట్​గా జై కొట్టింది.  తెలంగాణ ప్రజల ప్రయోజనాలను ప్రశ్నార్థకం చేసింది. జగన్​ సర్కారుతో ఉన్న దోస్తీకే కేసీఆర్  సర్కార్​ పెద్దపీట వేసిందని ఇటు రాజకీయ నేతలు, అటు ఇరిగేషన్​ ఎక్స్​పర్ట్స్​ ఆరోపిస్తున్నారు.

హైదరాబాద్‌‌‌‌, వెలుగువరుసగా రెండు రోజులు జరిగిన కృష్ణా, గోదావరి బోర్డుల మీటింగుల్లో వివాదాస్పద అంశాలను తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు సైడ్​ ట్రాక్​ పట్టించాయి. ముందస్తు అవగాహనతో కుదుర్చుకున్న కలగాపులగం ఎజెండానే పక్కాగా అమలు చేశాయి. మన రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పోతిరెడ్డిపాడు కెపాసిటీ డబుల్ చేయడం, సంగమేశ్వరం నుంచి నీటిని లిఫ్ట్ చేసే ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం తన ఎజెండాలో అసలు ప్రస్తావించలేదు.

ఈ నెల 4న జరిగిన కృష్ణా రివర్​ బోర్డు మీటింగ్​కు రెండు గంటల ముందు వరకు తన ఎజెండా ఇవ్వకుండా సీక్రెట్​గా ఉంచటం, తీరా ఇచ్చిన ఎజెండాలో ఏపీని ఇరుకున పెట్టే అంశాలేవీ లేకపోవటం విమర్శలకు తావిస్తున్నది. మరోవైపు బోర్డు పరిధిలో లేని టాపిక్​లపై మీటింగ్​లో ఎక్కువ చర్చ జరిపేందుకు రెండు రాష్ట్రాల ఇంజనీర్లు పోటీ పడ్డారు. వివాదాస్పద ప్రాజెక్టులపై చర్చను దారి మళ్లించే ప్లాన్​లో భాగంగానే ఇలాంటి టాపిక్​లపై ఎక్కువ ఫోకస్​ పెట్టినట్లు  ఆరోపణలు వస్తున్నాయి. రెండు ప్రభుత్వాలు రాజకీయంగా తమ సెల్ఫ్‌‌ ప్రొటెక్షన్‌‌ కోసమే ఆఫీసర్లను ముందస్తుగా ప్రిపేర్‌‌ చేసి మీటింగ్‌‌కు పంపినట్టుగా విమర్శలు వినిపిస్తున్నాయి.

బోర్డుల మీటింగ్స్​లో ఒకే పాట

 • ఏపీ ప్రభుత్వం తలపెట్టిన కొత్త ప్రాజెక్టుల విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం తన ఎజెండాలో  ప్రస్తావించలేదు.  గతంలో బోర్డుకు ఇచ్చిన ఫిర్యాదు తప్ప సీడబ్ల్యూసీకి, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయలేదు.
 • రెండు రాష్ట్రాల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టుల డీపీఆర్‌‌లు ఇవ్వాలనే అంశాన్నే కృష్ణా, గోదావరి బోర్డులు ప్రధానంగా పేర్కొనగా.. రెండు రాష్ట్రాలు ఓకే అంటూనే ప్రభుత్వ అనుమతి అనే మెలిక పెట్టి తప్పించుకున్నాయి. బోర్డులకు డీపీఆర్‌‌లు ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టుగా రెండు రాష్ట్రాల ఆఫీసర్లు మీటింగ్‌‌ తర్వాత మాట్లాడటంతో ఇద్దరి అండర్‌‌ స్టాండింగ్‌‌ బట్టబయలైందన్న విమర్శలు వస్తున్నాయి.
 • తెలంగాణ ఎజెండా సైడ్​ ట్రాక్​ అయింది. పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు డైవర్ట్‌‌ చేసే గోదావరి నీళ్లకు బదులుగా ఎగువన కృష్ణాలో 45 టీఎంసీలను తెలంగాణకు కేటాయించాలని, తాగునీటి కేటాయింపుల్లో 20 శాతం మాత్రమే వాడకంగా గుర్తించాలని, గత ఏడాది ఉపయోగించుకోలేకపోయిన 50 టీఎంసీల నీటిని ఈ వాటర్‌‌ ఇయర్‌‌కు క్యారీ ఫార్వర్డ్‌‌ చేయాలనే డిమాండ్ నే ప్రధానంగా వినిపించింది.
 • పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు వచ్చిన వెంటనే 80 టీఎంసీల కృష్ణా నీటిని నాగార్జునసాగర్‌‌కు ఎగువన ఉన్న రాష్ట్రాలు ఉపయోగించుకోవచ్చని బచావత్‌‌ అవార్డులో ఉంది. ఈ నీళ్లలో 45 టీఎంసీలు తమకే దక్కుతాయని తెలంగాణ రాష్ట్రం వాదిస్తున్నది. ఈ అంశం బోర్డు పరిధిలో తేలేది కాదు. అయినా దీని చుట్టే తెలంగాణ ప్రభుత్వం ఎజెండాను రూపొందించింది.
 • కృష్ణా బేసిన్ కు గోదావరి నీళ్లను తరలించే విషయంలో కృష్ణా నీటి బదలాయింపులు తేల్చాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని ఏపీ వాదిస్తున్నది. కాళేశ్వరం, సీతారామ లిఫ్ట్‌‌ స్కీముల ద్వారా గోదావరి నీళ్లను కృష్ణా బేసిన్‌‌కు తెలంగాణ మళ్లిస్తున్నదనే వాదనను కూడా ఏపీ లేవనెత్తింది. దీంతో  తెలంగాణ కోరుతున్న 45 టీఎంసీల కోటాకు ఎసరు పెట్టే ప్లాన్​ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.  తెలంగాణ కూడా అదే విషయంపై పట్టుబట్టడం..  కృష్ణా నీళ్ల లొల్లిని సజీవంగా ఉంచేందుకు రెండు రాష్ట్రాలు ఉమ్మడి ఎజెండాగా దీన్ని ఎంచుకున్నాయనే విమర్శలున్నాయి.
 • పోతిరెడ్డిపాడు హెడ్‌‌ రెగ్యులేటర్‌‌ కెపాసిటీని 44 వేల క్యూసెక్కులకు పెంచే టైంలో పాత గేట్లను మూసి వేస్తామని అప్పటి సీఎం వైఎస్‌‌ అసెంబ్లీలో ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరేండ్లయినా ఇప్పటికీ  పాత గేట్లను మూసి వేయించడంపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్‌‌ పెట్ట లేదు. ఇప్పుడు అదే గండిని డబుల్​ చేస్తామని, 80 వేల క్యూసెక్కులకు పెంచుతామని ఏపీ తెగేసి చెబుతున్నది. పాత గేట్లను మూసేయాలనే అంశాన్ని బోర్డు దృష్టికి తెలంగాణ ప్రభుత్వం తీసుకెళ్లలేదు.
 • తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలి రెండేండ్లు కృష్ణా నీళ్లలో తెలంగాణ వాటా 37 శాతం.  ఆ నీటిని తీసుకునేంత ప్రాజెక్టులు, కెపాసిటీ లేకపోవటంతో వరుసగా రెండేండ్లు కోటా మేరకు నీటిని తీసుకోలేదు. ఏపీ ఆ రెండేండ్లు కేటాయింపులకు మించి నీటిని తీసుకుంది. దీంతో  నీటి పంపకాలు పారదర్శకంగా ఉండాలంటూ బోర్డు తెలంగాణ కోటాలో 3 శాతం కోత పెట్టింది. అప్పటి నుంచి కోటాకు కోత పడినట్లయింది. ఈసారి బోర్డు ఎజెండాలో నీటి వాటాల నిర్ధారణ విషయం ఉన్నప్పటికీ.. నీళ్ల కోటా పెంచాలని తెలంగాణ తన  ఎజెండాలో పెట్టనే లేదు.
 • ఏపీ అధికారులు రెండు బోర్డులను ముందు పెట్టి టెక్నికల్‌‌గా మున్ముందు ఇబ్బందులు రాకుండా చూసుకునే ప్రయత్నం చేయగా.. తెలంగాణ మాత్రం మనవన్నీ పాత ప్రాజెక్టులే అనే డిఫెన్స్ ధోరణి  ప్రదర్శించింది. భవిష్యత్‌‌లో ఎదురయ్యే పరిణామాలపై ప్రాపర్‌‌ ప్రిపరేషన్ కొరవడినట్టుగా ఇరిగేషన్ వర్గాల్లోనే చర్చ సాగుతున్నది.

తెలంగాణలో ఒక్కరోజే 206 కరోనా కేసులు

Latest Updates