ఆర్టీసీ సమ్మెపై కేంద్ర రవాణా మంత్రి నుంచి కేసీఆర్‌కు ఫోన్

సీఎంతో మాట్లాడడానికి 45 నిమిషాలు ట్రై చేశారు

కానీ ముఖ్యమంత్రి అందుబాటులోకి రాలేదు

పరిష్కారానికి ప్రయత్నిస్తానని గడ్కరీ హామీ ఇచ్చారు

కేంద్ర మంత్రిని కలిసిన బీజేపీ ఎంపీలు

న్యూఢిల్లీ: తెలంగాణ ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేస్తానని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని చెప్పారు. రాష్ట్ర అధికారులను పిలిచి మాట్లాడుతానని, సీఎం కేసీఆర్‌తోనూ చర్చిస్తానని ఆయన హామీ ఇచ్చారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సహా రాష్ట్ర బీజేపీ ఎంపీలు ధర్మపురి అర్వింద్, బండి సంజయ్, సోయం బాపూరావు ఇవాళ ఢిల్లీలో కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీని కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యలు, సమ్మె గురించి వివరించారు. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరారు.

షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవాలి

కేంద్రమంత్రితో భేటీ ముగిసిన తర్వాత ఎంపీలు అర్వింద్, బండి సంజయ్, బాపూరావు మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రయత్నించకుండా సీఎం కేసీఆర్ మొండిగా వ్యవహరిస్తున్నారని ఎంపీలు అన్నారు. ఇప్పటికే 25 మంది కార్మికులు ప్రాణ త్యాగం చేసినా ఆయనలో కదలిక రాకపోవడం దారుణమని చెప్పారు. కార్మికులే సమ్మె విరమణకు ముందుకొచ్చారని, జిల్లాల వారిగా ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని కోరారు. గత రెండు నెలల జీతాలు ఇవ్వాలని, చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పారు. అందరం కలిసి పోరాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, కేసీఆర్ తన దొరతనం ఆపాలని సూచించారు.

సీఎంతో మాట్లాడుతానని గడ్కరీ హామీ..

Telangana BJP MP's Meets Union Minister Nitin Gadkari Over RTC Strikeఆర్టీసీని తనకు కావాల్సిన వాళ్లకు కట్ట బెట్టాలని ముఖ్యమంత్రి చూస్తున్నారని ఆరోపించారు రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు. ఆర్టీసీలో కేంద్ర వాటా ఉందని గుర్తు చేశారు. దాదాపు 45 రోజుల పైగా సమ్మె జరుగుతోందని, ఈ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరామని చెప్పారు. రాష్ట్ర రవాణాశాఖ ఆదికారులను పిలిపించి మాట్లాడుతానని ఆయన హామీ ఇచ్చారన్నారు. తమ ఎదుటనే సీఎం కేసీఆర్‌తో మాట్లాడేందుకు ఫోన్ చేశారని వివరించారు. అయితే దాదాపు 45 నిమిషాలపాటు ప్రయత్నించినా సీఎం అందుబాటులోకి రాలేదని చెప్పారు. ఇవాళ మళ్లీ ఫోన్ చేసి కేసీఆర్‌తో మాట్లాడే ప్రయత్నం చేస్తానని, సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని గడ్కరీ హామీ ఇచ్చారని తెలిపారు. ఆర్టీసీ సమ్మెపై కేంద్రం జోక్యం చేసుకుందని, కార్మికులు విజయం సాధించారని అన్నారు బీజేపీ ఎంపీలు.

MORE NEWS: 

లోక్‌సభలో కోతులపై చర్చ.. కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్

హైదరాబాద్: సాంబార్ గిన్నెలో పడి మూడేళ్ల చిన్నారి మృతి

Latest Updates