రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే అధికారం : ప్రధాని మోడీ

న్యూఢిల్లీ, వెలుగు:

దేశంలో కుటుంబ పార్టీలకు కాలం చెల్లిందని, జనంతో మమేకమయ్యే పార్టీలకే పట్టం కడతారని ప్రధాని మోడీ తెలంగాణ బీజేపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రజల్లో రోజురోజుకు బీజేపీపై విశ్వాసం పెరుగుతోందని, వచ్చే ఎలక్షన్లలో అధికారం బీజేపీదేనని చెప్పారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల ముగింపు సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపురావు, గరికపాటి మోహన్ రావు ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. దేశంలో కుటుంబ పార్టీల పాలన ముగిసిందని, కష్టపడి పనిచేస్తే తెలంగాణలోనూ టీఆర్ఎస్  పాలనకు చెక్ పడుతుందని ప్రధాని మోడీ అన్నట్టు తెలిసింది. క్షేత్రస్థాయిలో జనం ఆలోచనా విధానం మారుతోందని, రోజురోజుకు బీజేపీపై విశ్వాసం పెరుగుతోందని చెప్పినట్టు సమాచారం. ప్రజల సమస్యలతో పోరాడుతూ, బీజేపీ వారికి అండగా ఉంటుందన్న ధైర్యం నింపాలని సూచించినట్టు తెలిసింది.

ఈ సందర్భంగా ఎంపీలు రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను ప్రధానికి వివరించారు. కేంద్ర పథకాలను అమలు చేయడంలో రాష్ట్ర సర్కారు అలసత్వం ప్రదర్శిస్తోందని ప్రధాని ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్​ సర్కారు ప్రజావ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతోందని ఆరోపించారు.

మోడీకి మేడారం ప్రసాదం

భేటీ సందర్భంగా ఎంపీ సోయం బాపురావు మేడారం సమ్మక్క సారక్క ప్రసాదాన్ని ప్రధాని మోడీకి అందజేశారు. చెట్టు కింద వన దేవతలుగా దర్శనమిచ్చే సమ్మక్క–సారక్క జాతర దేశంలోనే పెద్ద పండుగల్లో ఒకటని, ‘గిరిజన కుంభమేళా’గా పిలుస్తారని ప్రధానికి వివరించారు. ఎంపీలు శుక్రవారం ప్రధానితోపాటు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ను కలిశారు. రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలని కోరారు. తర్వాత ఢిల్లీలోని తెలంగాణ భవన్​లో మీడియాతో మాట్లాడారు.

జనం బీజేపీ వైపు చూస్తున్నరు

రాష్ట్రానికి సంబంధించి కీలక అంశాలపై ప్రధాని మోడీతో చర్చించామని ఎంపీ అర్వింద్  చెప్పారు. ‘‘తెలంగాణలో బీజేపీకి ఉజ్వల భవిష్యత్ ఉందని మోడీ అన్నారు. వచ్చేది బీజేపీ సర్కారేనని చెప్పారు. గ్రౌండ్  లెవల్ నుంచి ఎదిగిన మోడీ.. గాలి మాటలు చెప్పే వ్యక్తి కాదు. క్షేత్రస్థాయి సమాచారమేదీ లేకుండా మాట్లాడరు. మోడీ వ్యాఖ్యలకు తగ్గట్టుగానే తెలంగాణ జనం బీజేపీని కోరుకుంటున్నారు.” అని పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకమైన ఐఐఎం, ఐఐఎస్సార్ విద్యా సంస్థలను రాష్ట్రానికి కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ఈ మేరకు తమ విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి రమేశ్ సానుకూలంగా స్పందించారని అర్వింద్​ చెప్పారు.

పసుపు రైతులకు జనవరిలో శుభవార్త

పసుపు రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా జనవరిలో శుభవార్త వింటారని ఎంపీ అర్వింద్  అన్నారు. పసుపు బోర్డును మించిన ప్రయోజనాలు కల్పించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని చెప్పారు. నిజామాబాద్​లో పసుపుబోర్డు ఏర్పాటు కోసం 30 ఏండ్లుగా డిమాండ్  ఉందని.. ఇప్పుడు వారు ఆశించిన దానికన్నా మెరుగైన వ్యవస్థను పొందబోతున్నారని తెలిపారు. అంటే పసుపు బోర్డు లేదన్నట్టేనా అని మీడియా ప్రశ్నించగా.. మారిన కాలానికి అనుగుణంగా రైతులకు మరింత ఎక్కువ ప్రయోజనం కల్పించే వ్యవస్థను తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. ఇప్పటికే నిజామాబాద్, జగిత్యాల జిల్లాలు పసుపు క్లస్టర్ ప్రాంతాలుగా గుర్తించబడ్డాయని చెప్పారు. మన పంటలు, మన నిర్ణయాలు, మన వ్యవస్థలు అనే విధంగా నూతన విధానం వస్తోందని, పసుపు దిగుమతులను నిలిపేయాలని కేంద్రం నిర్ణయం తీసుకోనుందని తెలిపారు. పసుపు జాతీయస్థాయి పంట కాదని, దానికి మద్దతు ధర కల్పించాలంటే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రతిపాదనలు రావాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కేంద్రానికి ఒక్క ప్రతిపాదన కూడా పంపలేదన్నారు.

 

Latest Updates