థాయ్‌‌లాండ్‌‌ ఓపెన్‌‌ ఇంటర్నేషనల్‌‌: తెలంగాణ బాక్సర్లకు సిల్వర్‌‌ మెడల్స్

ఆశీష్‌‌ కుమార్‌‌కు గోల్డ్‌‌

ఇండియాకు 8 మెడల్స్‌

అంతర్జాతీయ వేదికపై తెలంగాణ బాక్సర్లు నిఖత్‌‌ జరీన్‌‌, మహ్మద్‌‌ హుస్సాముద్దీన్‌‌ మరోసారి  మెరిశారు.  థాయ్‌‌లాండ్‌‌ ఓపెన్‌‌ ఇంటర్నేషనల్‌‌ బాక్సింగ్‌‌ టోర్నమెంట్‌‌లో ఈ ఇద్దరూ  రజత కాంతులు విరజిమ్మారు.  తమ పంచ్‌‌ పవర్‌‌తో ఫైనల్‌‌కు దూసుకొచ్చిన నిఖత్‌‌, హుస్సామ్‌‌ గోల్డ్‌‌ కొట్టలేకపోయారు. టైటిల్‌‌ ఫైట్‌‌లో  ఓడిన ఇద్దరూ   చెరో సిల్వర్‌‌ మెడల్‌‌ ఖాతాలో వేసుకున్నారు. ఈ టోర్నీలో ఇండియా  ఒక గోల్డ్‌‌ సహా ఎనిమిది  పతకాలు గెలిచింది.

కొంతకాలంగా నిలకడైన ఆటతీరుతో దూసుకెళ్తున్న తెలంగాణ బాక్సర్లు నిఖత్‌‌ జరీన్‌‌, మహ్మద్‌‌ హుస్సాముద్దీన్‌‌ థాయ్‌‌లాండ్‌‌ బాక్సింగ్‌‌ టోర్నీలో సిల్వర్‌‌ పంచ్‌‌ విసిరారు. ఆసియా చాంపియన్‌‌షిప్స్‌‌ రజత విజేత ఆశీష్‌‌ కుమార్‌‌ ఇండియాకు గోల్డ్‌‌ మెడల్‌‌ అందించాడు. బ్యాంకాక్‌‌  ఆతిథ్యం ఇచ్చిన ఈ టోర్నీలో ఇండియా బాక్సర్లు ఓవరాల్‌‌గా ఎనిమిది మెడల్స్‌‌తో సత్తా చాటారు. ఇండియాకు ఒక గోల్డ్‌‌, నాలుగు రజతాలు, మూడు కాంస్యాలు లభించాయి. 37 దేశాల నుంచి పలువురు వరల్డ్‌‌ బెస్ట్‌‌ బాక్సర్లు పోటీ పడ్డ ఈ టోర్నీలో ఇన్ని పతకాలు నెగ్గిందంటే ఇండియా గొప్పగా రాణించినట్టే. అయితే, ఫైనల్‌‌ చేరిన ఐదుగురిలో ఆశీష్‌‌ కుమార్‌‌ (75 కేజీ) మాత్రమే స్వర్ణాన్ని అందుకోగలిగాడు.

శనివారం జరిగిన ఫైనల్లో ఆశీష్‌‌ 5–0తో  కొరియా బాక్సర్‌‌ కింగ్‌‌ జింజాయెను చిత్తుగా ఓడించి కెరీర్‌‌లో పెద్ద మెడల్‌‌ను ఖాతాలో వేసుకున్నాడు. అయితే, భారీ అంచనాలున్న మాజీ జూనియర్‌‌ వరల్డ్‌‌ చాంపియన్‌‌ నిఖత్‌‌ జరీన్‌‌, కామన్వెల్త్‌‌ మెడలిస్ట్‌‌ హుస్సాముద్దీన్‌‌ టైటిల్‌‌ నెగ్గలేకపోయారు. మహిళల 51 కేజీ బౌట్‌‌ ఫైనల్లో  జరీన్‌‌ 0–5తో చైనా బాక్సర్‌‌ చాంగ్‌‌ యువన్‌‌ చేతిలో పరాజయం పాలైంది.  స్ట్రాన్జా కప్‌‌లో గోల్డ్‌‌ మెడల్, ఏషియన్‌‌ చాంపియన్‌‌షిప్స్‌‌, ఇండియా ఓపెన్‌‌లో కాంస్య పతకాలు గెలిచి ఫామ్‌‌లో ఉన్న నిఖత్‌‌ అదే జోరును కొనసాగించలేకపోయింది.

ఏషియన్‌‌ గేమ్స్‌‌ గోల్డ్‌‌ మెడలిస్ట్‌‌ అయిన చాంగ్‌‌.. తిరుగులేని ఆటతో, పవర్‌‌ఫుల్‌‌ పంచ్‌‌లతో  హైదరాబాద్‌‌ బాక్సర్‌‌ను ఓడించింది. గీబీ బాక్సింగ్‌‌లో సిల్వర్‌‌ నెగ్గిన హుస్సాముద్దీన్‌‌  పురుషుల 56 కేజీ టైటిల్‌‌ ఫైట్‌‌లో 0–5తో ఇండియా ఓపెన్‌‌ చాంప్‌‌  చచై డెచా బుట్డీ (థాయ్‌‌లాండ్‌‌) చేతిలో పరాజయం పాలయ్యాడు. 49కేజీ బౌట్‌‌ ఫైనల్లో ఉజ్బెకిస్థాన్‌‌కు చెందిన మిర్జాఖ్మొదెవ్‌‌  చేతిలో ఓడిన దీపక్‌‌ కూడా రజతంతో సంతృప్తిచెందాడు.  81 కేజీ ఫైనల్లో  బ్రిజేష్‌‌ యాదవ్‌‌ 1–4తో లోకల్‌‌ బాక్సర్‌‌ అనవత్‌‌ చేతిలో ఓడిపోయాడు. అంతకుముందు  స్ట్రాన్జా కప్‌‌ సిల్వర్‌‌ మెడలిస్ట్‌‌ మంజు రాణి (48కేజీ).. థాయ్‌‌లాండ్‌‌కు చెందిన రక్సత్‌‌ అడ్డు దాటలేక కాంస్యంతో సరిపెట్టుకుంది. ఆశీష్‌‌ (69కేజీ), భాగ్యబతి (75కేజీ) కూడా కాంస్యాలకే పరిమితమయ్యారు.

Latest Updates