22 నుంచి బడ్జెట్ సమావేశాలు

హైదరాబాద్ : ఈ నెల 22 నుంచి నాలుగు  రోజులపాటు  బడ్జెట్ సమావేశాలు  నిర్వహించాలని నిర్ణయించారు  సీఎం కేసీఆర్. బడ్జెట్  సమావేశాలకు  తేదీ  ఖరారుతో  పాటు .. ప్రగతిభవన్ లో బడ్జెట్ పై ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు ముఖ్యమంత్రి. ప్రజల ఆకాంక్షలు, అవసరాలు తీర్చేలా బడ్జెట్  రూపొందించాలని సూచించారు. 22న ఉదయం పదకొండున్నరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను సభలో ప్రవేశపెడతారు. ఆ మర్నాడు బడ్జెట్ పై సభలో చర్చ జరుగుతుంది. 25న ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలపనుంది.

బడ్జెట్ పద్దులపై ప్రగతిభవన్ లో సీఎస్ SK.జోషి, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు సీఎం. ప్రజలకిచ్చిన వాగ్ధానాలన్నీ నెరవేర్చేలా బడ్జెట్ రూపకల్పన ఉండాలని సూచించారు. పేదల సంక్షేమం కోసం, వ్యవసాయాభివృద్ధి కోసం అధిక నిధులు కేటాయించేలా చూడాలని సూచించారు. గత ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్ధానాలను నెరవేర్చేందుకు, ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాల కొనసాగింపు కోసం అవసరమైన నిధులు కేటాయించేలా బడ్జెట్ రూపొందించాలని చెప్పారు.

ప్రభుత్వ ప్రాధాన్యాలు, పథకాలు, వాటికయ్యే ఖర్చు వంటి అంశాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు కేసీఆర్. సీఎం సూచనల ప్రకారం బడ్జెట్ పద్దులు రూపొందించే పనిలో ఉన్నారు ఆర్థికశాఖ అధికారులు.

Latest Updates