రైతుకు చేయి చాపే బాధలొద్దు: రైతు బంధు 10 వేలకు పెంపు

హైదరాబాద్: పంటకాలంలో పెట్టుబడి కోసం రైతులు అక్కడా ఇక్కడా చేయి చాపడంతో అప్పుల బాధలు వస్తున్నాయని, దాన్ని తప్పించేందుకే రైతు బంధు పథకం ప్రారంభించామని కేసీఆర్ చెప్పారు. సీఎం కేసీఆర్ ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. రైతు బంధు పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడి కోసం ఏటా ఎకరానికి రూ.8 వేలు ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందన్నారు. దీన్ని మరో రెండు వేలు పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని, దాని ప్రకారం ఇకపై ఎకరానికి రూ.10 వేలు సాయం అందిస్తామని చెప్పారు. ఈ మొత్తాన్ని ఎకరానికి 5 వేల చొప్పున రెండు పంటలకు కలిపి ఏడాదికి 10 వేల రూపాయలకు పెంచుతున్నామన్నారు. ఇందుకోసం బడ్జెట్ లో రూ.12 వేల కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు.

రైతుబీమాకు రూ.650 కోట్లు

దురదృష్టవశాత్తు ఏ రైతైనా మరణిస్తే ఆ కుటుంబం వీధిన పడొద్దనే లక్ష్యంతో రైతు బీమా అమల్లోకి తెచ్చామని కేసీఆర్ చెప్పారు. రైతు ఏ కారణాల వల్ల మరణించినా, ఆ రైతు కుటుంబానికి 5 లక్షల రూపాయలను పది రోజుల్లోనే అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 5,675 మంది రైతుల కుటుంబాలకు రూ.283 కోట్లు లబ్ధిదారులకు అందించామన్నారు. ఈ బడ్జెట్లో రైతు బీమా పథకం అమలు కోసం రైతుల తరుఫున బీమా కిస్తీ కట్టడం కోసం రూ.650 కోట్లను కేటాయించామని చెప్పారు.

Latest Updates