వీఆర్వో వ్యవస్థ రద్దుకు కేబినెట్ ఆమోదం..రేపు అసెంబ్లీకి కొత్త యాక్ట్

  • సోమవారం పొద్దున్నే వీఆర్వోల నుంచి రికార్డుల స్వాధీనం
  • సబ్​ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్లు బంద్
  • ధరణి వెబ్​ సైట్లో మార్పులు, చేర్పులకు బ్రేక్​
  • ఒకే డిపార్ట్​మెంట్​గా రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు!
  • పట్టాదారు పాసు బుక్స్ జారీకి కొత్త విధానం

రెవెన్యూ డిపార్ట్​మెంట్​ను ప్రక్షాళన చేస్తామన్న రాష్ట్ర సర్కారు.. మొత్తంగా వీఆర్వోల వ్యవస్థనే రద్దు చేసింది. దీనితోపాటు పట్టాదారు పాస్​బుక్కుల జారీ, నాలా పన్ను వసూలునూ మార్చేస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకుంది. దీనికన్నా ముందు సోమవారం పొద్దున్నే రాష్ట్రవ్యాప్తంగా భూముల రికార్డులు, రిజిస్ట్రేషన్లకు సంబంధించిన అన్ని పనులు ఆపేసింది. వీఆర్వోల దగ్గర ఉన్న అన్ని భూముల రికార్డులు, ఫైళ్లను హడావుడిగా స్వాధీనం చేసుకుని సీజ్​ చేసింది. కొత్తగా రిజిస్ట్రేషన్లేవీ చేయకుండా మధ్యాహ్నం నుంచే సబ్​ రిజిస్ట్రార్​ ఆఫీసులను మూసేసింది. స్టాఫ్​ అందరికీ కంటిన్యుయస్​ సెలవులు ఇచ్చేసింది. అటు తహసీల్దార్లు భూముల రికార్డుల్లో మార్పులు చేయకుండా ధరణి వెబ్​సైట్​ను లాక్​ చేసేసింది. సాయంత్రం జరిగిన కేబినెట్​మీటింగ్​లో వీఆర్వోల వ్యవస్థ రద్దు, ఇతర బిల్లులను ఓకే చేసింది. బుధవారం సీఎం కేసీఆర్​ స్వయంగా కొత్త రెవెన్యూ చట్టం బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 5,088 మంది వీఆర్వోలు పనిచేస్తున్నారు. వారందరినీ అగ్రికల్చర్, పంచాయతీరాజ్​ శాఖల్లో విలీనం చేయాలని సర్కారు భావిస్తున్నట్టు సమాచారం. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 23 వేల మంది వీఆర్ఏలను ఏ శాఖ పరిధిలో కొనసాగిస్తారన్నది తేలాల్సి ఉంది.

వీఆర్వో వ్యవస్థను రద్దు చేసే బిల్లును రాష్ట్ర కేబినెట్​ సోమవారం ఓకే చేసింది. రెవెన్యూ శాఖ ప్రక్షాళన,ఇతర అంశాలకు సంబంధించిన బిల్లులకు ఆమోద ముద్ర వేసింది. రైతులకు పట్టాదారు పాస్ బుక్కుల జారీలో కొత్త విధా నాన్ని తీసుకొచ్చే బిల్లు.. గ్రామాల్లో అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కు మార్చే అధికారాన్ని పంచాయతీలకే కల్పించే సవరణ బిల్లులను ఆమోదించింది. సోమవారం ప్రగతిభవన్ లో కేసీఆర్ నేతృత్వంలో కేబినెట్ భేటీ అయింది.ఇందులో 2 కొత్త బిల్లులతోపాటు 10 సవరణ బిల్లులను ఆమోదించారు. కొత్త సెక్రటేరియట్ నిర్మాణం,పాత సెక్రటేరియట్ కూల్చి వేత ఖర్చుకు సంబంధించిన పరిపాలనా అనుమతులనూ ఓకే చేశారు. కొత్త సెక్రటేరియట్ ​కోసం గతంలో రూ.400 కోట్లు ఇవ్వగా..ఇప్పుడు మరో రూ.200 కోట్లు మంజూరు చేశారు.కొత్తగా నిర్మించే ఇంటి గ్రేటెడ్ డిస్ట్రిక్ట్స్‌‌‌‌ ఆఫీస్ కాంప్లెక్సులకు నిధుల కేటాయింపుపై పరిపాలన అనుమతులు సవరించారు. 17 కులాలను బీసీ జాబితాలో చేర్చాలంటూ బీసీ కమిషన్ చేసిన సిఫార్సు లను కేబినెట్ ఆమోదించింది. టీఎస్‌‌‌‌ బీపాస్ బిల్లును.. ఆయుష్ మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయోపరిమితిని పెంచే ఆర్డినెన్స్‌‌‌‌ను ఓకే చేసింది.

రెవెన్యూలో రెండు బిల్లులు

ఇన్నాళ్లు గ్రామస్థాయి లో భూ రికార్డుల ను పర్యవేక్షించిన వీఆర్వో వ్యవస్థ రద్దుకు రూపొందించిన ‘ది తెలంగాణ అబాలిషన్ ఆఫ్ పోస్ట్స్‌ ఆఫ్‌‌ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్‌ -2020’ బిల్లుకు కేబినెట్​ ఓకే చెప్పింది. రైతులకు పాస్ పుస్తకాల జారీలో అవినీతికి ఆస్కారం లేకుండా రూపొందించిన ‘ది తెలంగాణ రైట్స్ ఇన్ లాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్స్–2020’ బిల్లును ఆమోదించింది. గ్రామాల్లో అగ్రికల్చర్​ ల్యాండ్​ నుంచి నాన్ అగ్రికల్చర్​ ల్యాండ్​కు మార్చే అధికారాన్ని పంచాయతీలకే కల్పిస్తూ ‘పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్‌ మెంట్ – గ్రామ పంచాయత్స్– ట్రాన్స్ ఫర్ ఆఫ్ నాన్ అగ్రికల్చరల్ ప్రాపర్టీ యాక్టు – 2018’ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది.

ఊర్లలో సెలబ్రేషన్స్​ చేయండి

సర్కార్  కొత్త రెవెన్యూ యాక్ట్ తీసుకొస్తున్న సందర్భంగా ప్రజలు, పార్టీ శ్రేణులు సెలబ్రేషన్స్‌‌‌‌ చేసుకోవాలి. రెవెన్యూ శాఖకు పట్టిన అవినీతి చీడ ఈ చట్టంతో పోతుంది.
ఆ శాఖలో పెద్ద ఎత్తున పేరుకుపోయిన అవినీతి, అక్రమాలను నిర్మూలించడానికి కొత్త చట్టమే మార్గం. రెవెన్యూశాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తూ కొత్త చట్టం పొందించినం.

– కేబినెట్​ భేటీలో సీఎం కేసీఆర్

 

Latest Updates