రేపే కేబినెట్ విస్తరణ

కేబినెట్ విస్తరణకు ముహుర్తం ఖరారైంది. రేపు ఉదయం పదకొండున్నర గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు కొత్త మంత్రులు. రాజ్ భవన్ దర్బార్ హల్ ముందున్న గ్రౌండ్  లో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేబినెట్ లో ఎవరెవరికి చాన్సుంటుందనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రస్తుతానికి 8 లేదా 9 మంది ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు కొందరినే మంత్రివర్గంలోకి తీసుకుని…లోక్ సభ ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి కేబినెట్ ఏర్పాటు చేయొచ్చనే ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.

శాసనసభ ఎన్నికల్లో 88 సీట్లు గెలుచుకుంది టీఆర్ఎస్. ఇద్దరు ఇండిపెండెంట్లు పార్టీలో చేరారు. దీంతో అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుని మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారని నేతలు భావిస్తున్నారు. ఆదిలాబాద్ నుంచి జోగు రామన్నను పక్కనపెట్టి…. మాజీమంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి మరోసారి అవకాశం ఇవ్వొచ్చని తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్ గా ఎన్నికయ్యారు. దీంతో ఇక్కడి నుంచి మిషన్ భగీరథ మాజీ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరుగుతోంది.

వరంగల్ జిల్లా నుంచి పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు కేబినెట్ రేసులో ముందున్నట్టు సమాచారం. ఆయన కారెక్కిన తర్వాత… మిగతా టీడీపీ ఎమ్మెల్యేలను గులాబీ బాట పట్టించడంలో కృషి చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి వనపర్తి ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ లను మంత్రివర్గంలోకి తీసుకోవచ్చంటున్నారు. హైదరాబాద్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కేబినెట్లోకి తీసుకుని.. పద్మరావు గౌడ్ ను డిప్యూటీ స్పీకర్ చేస్తారనే ఊహాగానాలు విన్పిస్తున్నాయి.

ఉమ్మడి కరీంనగర్ నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను తీసుకుంటారా అనే విషయంపై క్లారిటీ రాలేదు. ఇక్కడి నుంచి ఎస్సీ కోటాలో సీనియర్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బీసీలకు ఇస్తే గంగుల కమలాకర్ కు ఇవ్వొచ్చంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి మరోసారి జగదీశ్ రెడ్డికి పదవి ఖాయమంటున్నాయి పార్టీ వర్గాలు. పార్లమెంటు ఎన్నికల తర్వాతే గుత్తా సుఖేందర్ రెడ్డి విషయంలో క్లారిటీ రావచ్చని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇక ఖమ్మం నుంచి ఈ దఫాలో ఎవరికీ పదవి దక్కే అవకాశం లేదంటున్నారు. గిరిజనుల కోటాలో రేఖానాయక్, రెడ్యానాయక్ లలో ఒకరికి బెర్త్ ఖాయమనే ప్రచారం జరుగుతోంది.

పార్లమెంటు ఎన్నికలు ఉండటంతో.. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు ఈసారి కేబినెట్ లో అవకాశం దక్కకపోవచ్చని నేతలు చర్చించుకుంటున్నారు. ఎంపీ ఎన్నికల తర్వాతి విస్తరణలో అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు కావడంతో హైదరాబాద్ లో మకాం వేసిన గులాబీ ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇప్పటికే కొందరు పేర్లు ప్రచారంలో ఉన్నా.. అధికారికంగా ఇంకా సమాచారం రాకపోవడంతో నేతల్లో టెన్షన్ కనబడుతోంది.

 

Latest Updates