కేసీఆర్ కు బర్త్ డే విషెస్ చెప్తూ వేల మొక్కలు నాటిన్రు

హైదరాబాద్, వెలుగుసీఎం కేసీఆర్ బర్త్​డే సందర్భంగా సోమవారం మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు  మొక్కలు నాటి ఘనంగా జరుపుకున్నారు. అధికారులు కూడా పలుచోట్ల మొక్కలు నాటారు. అసెంబ్లీ, కౌన్సిల్​లో జరిగిన పలు కార్యక్రమాల్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్​రెడ్డి దంపతులు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దంపతులు, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. మొదట అసెంబ్లీ ఆవరణలో స్పీకర్​ 66 మొక్కలను నాటారు. స్పీకర్ చాంబర్ లో కేక్ కట్ చేశారు. అసెంబ్లీ, కౌన్సిల్​లో విధులు నిర్వహిస్తున్న 280 మంది నాల్గో తరగతి ఉద్యోగులకు స్పీకర్ పోచారం, ఆయన భార్య పుష్ప, మండలి చైర్మన్ గుత్తా, ఆయన భార్య అరుంధతి బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి  మాట్లాడుతూ కేసీఆర్​ పుట్టినరోజును పేదలు తమ ఇంటి పెద్ద కొడుకు పుట్టినరోజు అనుకుని పండుగలా జరుపుకుంటున్నారన్నారు. అనంతరం తెలంగాణ అసెంబ్లీ డైరీ–2020, శాసనసభ్యుల బయోడేటా బుక్ లను తన చాంబర్లో స్పీకర్ విడుదల చేశారు. అంతకు ముందు అసెంబ్లీ ఆవరణలో కొత్తగా ఏర్పాటు చేసిన జిమ్ ను ప్రారంభించారు. అనంతరం మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, కమిషన్లు, అకాడమీల చైర్మన్లు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, వివిధ సంఘాల నాయకులు ముఖ్యమంత్రిని ప్రగతిభవన్​లో కలిసి శుభాకాంక్షలు చెప్పారు.  ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, క్రాంతి కిరణ్, హర్షవర్ధన్ రెడ్డి, బాల్క సుమన్ సినీనటులతో క్రికెట్ ఆడారు.

మొక్కలు నాటిన మంత్రులు

ఖైరతాబాద్​లోని  రంగారెడ్డి జెడ్పీ కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మొక్కలు నాటారు. అలాగే ముషీరాబాద్​లోని వీఎస్టీలో  పేదలకు టిఫిన్​తో పాటు పండ్లు,  పాలు పంపిణీ చేశారు.  ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులు, ఉద్యోగులతో కలిసి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మొక్కలు నాటారు.

సంజీవయ్య పార్క్ లో మొక్కలు నాటిన ఐఏఎస్​లు

సీఎం జన్మదినాన్ని పురస్కరించుకుని సంజీవయ్య పార్క్ లో హెచ్ఎండీఏ ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో సీఎస్ సోమేశ్ కుమార్, పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు పాల్గొని మొక్కలను నాటారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ , మున్సిపల్ శాఖ కమిషనర్ సత్యనారాయణ, వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, ముఖ్యకార్యదర్శులు రజత్ కుమార్, వికాస్ రాజ్, సునీల్ శర్మ, జగదీశ్వర్, జీఎచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్  పలువురు ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు. అలాగే మినిస్టర్స్ క్వార్టర్స్ లోని తన నివాసం, ఎర్రమంజిల్ లోని ఆర్ & బీ ఈఎన్సీ కార్యాలయంలో మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి మొక్కలు నాటారు.

57 వేల మొక్కలు నాటికి పోలీస్ డిపార్ట్​మెంట్

పాతబస్తీ పేట్ల బురుజులోని సిటీ ఆర్మ్​డ్​ హెడ్ క్వార్టర్స్ లో హోంమంత్రి మహమూద్ అలీ ..డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ అంజనీకుమార్ తో కలిసి మొక్కలు నాటారు. సోమవారం ఒక్క రోజే 56,872 మొక్కలను పోలీస్​ డిపార్ట్​మెంట్​ నాటింది. డీజీపీ కార్యాలయంలో డీజీపీ మహేందర్ రెడ్డి, అడిషనల్ డీజీలు సంతోష్ మెహ్రా, శివధర్ రెడ్డి, జితేందర్, గోవింద్ సింగ్, స్వాతీ లక్రా, ఐజీలు బాల నాగదేవి, సంజయ్ కుమార్ జైన్, పలువురు పోలీసు అధికారులు మొక్కలు నాటారు.

Latest Updates