తెలంగాణకు మమతా బెనర్జీ రూ.2 కోట్ల వరద సాయం: థ్యాంక్స్ చెప్పిన సీఎం కేసీఆర్

భారీ వర్షాలతో వరదల్లో మునిగిపోయిన హైదరాబాద్ సిటీ, తెలంగాణలోని పలు జిల్లాలను ఆదుకునేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తమ వంతు సాయం ప్రకటించింది. కష్ట సమయంలో తోటి రాష్ట్రానికి అండగా ఉండేందుకు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.2 కోట్లు విరాళంగా అందిస్తున్నామని తెలుపుతూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ రాశారు. కొద్ది రోజులుగా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల గురించి తెలిసి ఎంతో తాను ఎంతో బాధపడ్డానని లేఖలో ఆమె తెలిపారు. ఈ విపత్తు సమయంలో తెలంగాణకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం కేసీఆర్‌కు ఆమె తెలిపారు. వరదలతో తెలంగాణకు తీవ్రంగా నష్టపోయిందని, భారీగా ప్రాణ నష్టం కూడా జరిగిందని, బాధితులందరికీ సానుభూతి తెలుపుతున్నామని అన్నారు మమతా బెనర్జీ. కొన్ని నెలల క్రితం తమ రాష్ట్రం కూడా అంఫాన్ తుఫాన్ వల్ల తీవ్రంగా నష్టపోయి ఇలాంటి కష్టాన్నే ఎదుర్కొందని చెప్పారామె. వరదల సమయంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విరాళం ప్రకటించడంతో సీఎం కేసీఆర్ ఆమెకు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పారు.

Latest Updates