రేపు కాంగ్రెస్ ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ ​పోరాటం

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్​ మీడియాలో పోరాటం చేయాలని కాంగ్రెస్​ నేతలు, కార్యకర్తలకు పీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్​కుమార్​రెడ్డి పిలుపునిచ్చారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు గురువారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్​లో కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు స్వయంగా వీడియోలు చేసి పోస్ట్ చేయాలని సూచించారు. ఏఐసీసీ చీఫ్ సోనియాగాంధీ, పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు వలస కూలీలు పడుతున్న కష్టాలు, ఇబ్బందులను కేంద్రం దృష్టికి తేవాలన్నారు. మంగళవారం ఉత్తమ్​ఫేస్ బుక్ లైవ్ లో రాష్ట్రంలోని పార్టీ నాయకులతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా 50 లక్షల మంది ఈ ఆన్​లైన్​ పోరాటంలో పాల్గొంటున్నారని, రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 10 వేల మంది కార్యకర్తలు సోషల్​మీడియాలో వీడియోలు పోస్ట్ చేయాలని కోరారు. లాక్​డౌన్​లో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను కేంద్రం దృష్టికి తెచ్చేలా తమ పోరాటం ఉంటుందని చెప్పారు. ఆదాయపు పన్ను పరిధిలో లేని పేదలకు నేరుగా రూ.10 వేలు అందించాలని, రోజు కూలీతో పని చేసే వారిని, చిరు వ్యాపారులను ఆర్థికంగా ఆదుకోవాలని, వలస కూలీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కేంద్రాన్ని డిమాండ్​ చేశారు. కూలీలు కాలినడకన వందల కిలోమీటర్లు నడుస్తున్నారని.. ట్రక్కులు, లారీల్లో ఊర్లకు పోతున్నారని, వాళ్లకు సాయం చేసేందుకు తమ పార్టీ చర్యలు తీసుకుంటుందని ఉత్తమ్​ తెలిపారు.

Latest Updates