కరోనా టెస్టులకు ఎక్కడికి పోవాలె.? ప్రభుత్వ ల్యాబ్స్ బంద్..ప్రైవేట్ లో తప్పులు!

  • ప్రభుత్వ ల్యాబ్స్​లో బంద్​ పెట్టిన్రు
  • టెస్టులు చేయించుకునేందుకు తిప్పలుపడుతున్న జనం
  • ప్రైవేట్​లో టెస్టులు బంద్ పెట్టే యోచనలో సర్కార్​
  • కేసులు పెరుగుతుండడంతో ఎత్తుగడ?
  • ఇప్పటికే ప్రైవేట్ ల్యాబ్​లు సరిగ్గా లేవంటూ రిపోర్టులు
  • లోపాలున్న ల్యాబ్​ల పేర్లు మాత్రం బయటపెట్టని ప్రభుత్వం

హైదరాబాద్‌‌, వెలుగు: కరోనా టెస్టుల విషయంలో జనాలకు రాష్ర్ట సర్కార్ చుక్కలు చూపిస్తోంది. ల్యాబ్​ల్లో శాంపిల్స్‌‌ పేరుకుపోయాయంటూ.. 3 రోజులుగా కొత్త శాంపిల్స్ తీసుకోవడం బంద్ పెట్టింది. వైరస్ లక్షణాలతో వచ్చినోళ్లను కూడా వెనక్కి తిప్పి పంపుతోంది. ఇదే టైమ్‌‌లో ప్రైవేటు ల్యాబ్​ల్లో టెస్టులు సక్కగ చేస్తలేరని, వైరస్ లేనోళ్లకు కూడా ఉన్నట్టు రిపోర్టులు ఇస్తున్నారని వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. దీంతో టెస్టుల కోసం ఎక్కడికి పోవాల్నో తెలియక జనం తలలు పట్టుకుంటున్నరు.

పది రోజుల్లోనే.. కమిటీ.. ఇన్‌‌స్పెక్షన్.. రిపోర్ట్

రెండు రోజులుగా ఆరోగ్యశాఖ చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే.. ప్రైవేటు ల్యాబ్​ల్లో కరోనా టెస్టులు బంద్ పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. సర్కార్ దవాఖాన్లలో ఉన్న అధ్వాన పరిస్థితి గురించి, డాక్టర్లు, సిబ్బంది కొరత గురించి ఎన్నడూ మాట్లాడని రాష్ర్ట ప్రభుత్వం.. ప్రైవేటు ల్యాబ్​ల్లో పూర్‌‌‌‌ హైజీన్ ఉన్నట్టు గుర్తించామంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రైవేటు ల్యాబ్​ల్లో కరోనా టెస్టులకు అనుమతి ఇచ్చి పది రోజులు మాత్రమే అయింది. ఈ పది రోజుల్లోనే ఆరోగ్య శాఖ ఓ కమిటీ వేయడం, ల్యాబులను ఆ కమిటీ ఇన్‌‌స్పెక్షన్ చేయడం జరిగిపోయాయి. ఏడాది కిందట డెంగీ, క్లినికల్‌‌ ట్రయల్స్‌‌పై వేసిన కమిటీ రిపోర్టులను ఇప్పటికీ వెల్లడించని సర్కార్‌‌.. ప్రైవేటు ల్యాబ్​ల్లో లోపాలను గుర్తిస్తూ ఎక్స్‌‌పర్ట్ కమిటీ ఇచ్చిన రిపోర్టులోని అంశాలను మాత్రం మీడియాకు విడుదల చేసింది. కరోనా టెస్టులు చేస్తున్న 18 ప్రైవేటు ల్యాబ్​లలో 16 ల్యాబ్​లను కమిటీ ఇన్‌‌స్పెక్షన్ చేసిందని, వాటిలో రూల్స్ పాటించడం లేదని పేర్కొంది. ల్యాబ్​లు నీట్‌‌గా లేవని, తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారని, ల్యాబ్ టెక్నీషియన్లకు శిక్షణ ఇవ్వలేదని, వాళ్లు పీపీఈ కిట్లు వేసుకోవడం లేదని, టెస్ట్‌‌ కోసం వచ్చే వారికి కరోనా సోకే ప్రమాదం ఉందని, టెస్టుల సంఖ్య తప్పుగా చెప్తున్నారని ఆరోపించింది. అయితే ఇన్ని లోపాలున్న ల్యాబ్​ల పేర్లు మాత్రం బయటపెట్టలేదు.

సర్కార్ ల్యాబ్​లలో పరిస్థితేంది?

ప్రైవేటు ల్యాబ్​ల్లో టెక్నీషియన్లకు ట్రైనింగ్ ఇవ్వలేదని ఆరోగ్యశాఖ చెబుతోంది. అసలు ప్రభుత్వ ల్యాబ్​ల్లో పరిస్థితి ఏంటని సర్కారు ల్యాబ్ టెక్నీషియన్లు ప్రశ్నిస్తున్నారు. తమతో రోజుకు 12 గంటలు డ్యూటీ చేయిస్తూ, పని భారం మోపుతున్నారని ఆరోపిస్తున్నారు. సర్కార్ దవాఖాన్లలో 1,060 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులుంటే.. 562 ఖాళీగానే ఉన్నాయి. 498 మంది పనిచేస్తుండగా, ఇందులో 290 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులే. ఇప్పటికే టెక్నీషియన్లు లేక చాలా దవాఖాన్లలో డయాగ్నసిస్ యంత్రాలు మూలకుపడ్డాయి. ఇప్పుడు కరోనా వ్యవహారంతో ల్యాబ్ టెక్నీషియన్లపై మరింత భారం పెరిగింది. ఒక్కొక్కరికి 12 గంటల డ్యూటీ వేస్తున్నారు. శాంపిల్స్‌‌ సేకరించడానికి కూడా వీళ్లనే వినియోగించుకుంటున్నారు. ఇందుకోసం తమకు కూడా ట్రైనింగ్ ఇవ్వలేదని వాళ్లు చెబుతున్నారు.
ఇదంతా చూస్తుంటే ప్రైవేటు ల్యాబుల్లో టెస్టులు బంద్ పెట్టే ఆలోచన సర్కార్ చేస్తున్నట్టు అనిపిస్తోందని వైద్యారోగ్యశాఖ సిబ్బందే చెబుతున్నారు. మరి ఇన్ని లోపాలు ఉంటే సర్కార్ దవాఖాన్లలో సేకరించిన శాంపిళ్లను, ప్రైవేటు ల్యాబ్​లకు పంపి టెస్టులు ఎట్ల చేయిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

కేసులు పెరుగుతుండటం వల్లే..

కరోనా టెస్టుల విషయంలో రాష్ర్ట ప్రభుత్వానిది మొదటి నుంచి ఒంటెద్దు పోకడే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఐసీఎంఆర్ వంటి సంస్థలు వీలైనన్ని ఎక్కువ టెస్టులు చేస్తేనే వైరస్‌‌ను కట్టడి చేయగలమని చెబుతుంటే.. రాష్ర్టంలో మాత్రం టెస్టుల సంఖ్య తగ్గిస్తూ వచ్చారు. అన్ని రాష్ర్టాల్లో టెస్టుల కోసం ముందే ప్రైవేటు ల్యాబ్​లకు పర్మిషన్ ఇస్తే.. ఇక్కడ ఇవ్వలేదు. ప్రభుత్వ ల్యాబ్​లలో మాత్రమే టెస్టులు చేస్తూ వచ్చారు. పది రోజుల కిందటి దాకా రోజుకు సగటున కనీసం ఐదొందల టెస్టులు కూడా చేయలేదు. దీంతో కరోనా కేసుల సంఖ్య 100, 150 దాటలేదు. ఈ లోపల వైరస్ రాష్ర్టమంతటా వ్యాపించింది. టెస్టుల కోసం అన్ని వర్గాల నుంచి ఒత్తిడి పెరిగింది. టెస్టుల సంఖ్య పెంచాలంటూ కేంద్రం కూడా లెటర్లు రాసింది. దీంతో టెస్టుల సంఖ్య పెంచాలని పది రోజుల కిందట సీఎం నిర్ణయించారు. గ్రేటర్ చుట్టుపక్కల 30 నియోజకవర్గాల్లో పది రోజుల్లో 50 వేల టెస్టులు చేయాలని ఆదేశించారు. ప్రైవేటు ల్యాబ్​లలోనూ టెస్టులకు పర్మిషన్ ఇచ్చారు. అప్పటినుంచి కేసుల సంఖ్య పెరిగింది. టెస్టులు చేయించుకుంటున్న ప్రతి నలుగురైదుగురిలో ఒకరికి పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ర్టంలో కరోనా వ్యాప్తి తక్కువే అంటూ వచ్చిన ప్రభుత్వ పెద్దల మాటల్లోని డొల్లాతనం బయటపడింది.

టెస్టులు తగ్గించేందుకేనా?

ప్రభుత్వం అనుమతి ఇవ్వకముందు నుంచే కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్‌‌కు అనుబంధంగా ఉన్న ల్యాబ్​లలో కరోనా టెస్టులు చేశారు. ఈ విషయం తెలిసినా సప్పుడు చేయని సర్కార్.. ఇప్పుడు ఉన్నట్టుండి ప్రైవేటు ల్యాబ్​లలో టెస్టింగ్ బాగోలేదని ప్రకటిస్తుండటం అనుమానాలకు దారి తీస్తోంది. ఒకవేళ ఏదైనా ల్యాబ్​లో రూల్స్ ఉల్లంఘిస్తే.. సదరు ల్యాబ్ పై చర్యలు తీసుకోవచ్చు. కానీ అలా చేయకుండా అన్ని ల్యాబ్​లలోనూ తప్పులు జరుగుతున్నాయనే అర్థం వచ్చేలా ప్రకటన విడుదల చేసింది. తప్పు చేసిన ల్యాబ్ పేరు ప్రకటిస్తే ప్రజలు జాగ్రత్త పడేవారు. కరోనాకు సంబంధించి ప్రతి విషయాన్ని వీలైనంతగా దాచిపెట్టే సర్కార్‌‌‌‌.. ప్రైవేటు ల్యాబ్​ల విషయంలో అనుసరిస్తున్న వైఖరి అనేక అనుమానాలకు దారితీస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. టెస్టుల కట్టడి కోసమే సర్కార్ ఇదంతా చేస్తున్నదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా కోటి కరోనా కేసులు

 

Latest Updates