ముగిసిన ప్రచారం… మైకులు బంద్

రాష్ట్రమంతటా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. డిసెంబర్ ఐదు బుధవారం సాయంత్రం ఐదు గంటలకు రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం బంద్ అయింది. దాదాపు నెలరోజులుగా అన్ని నియోజకవర్గాల్లో హోరెత్తించిన మైకులు సైలెంట్ అయ్యాయి. అంతటా వైన్ షాపులు బంద్ అయ్యాయి. అన్ని పోలింగ్ కేంద్రాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర సౌకర్యాలు కల్పిస్తున్నారు.

శుక్రవారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. సాధారణ ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఐదింటి వరకు పోలింగ్ జరుగుతుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఉదయం ఏడింటి నుంచి సాయంత్రం నాలుగింటి వరకు ఓటింగ్ నిర్వహిస్తారు. రాష్ట్రమంతటా మొత్తం 18వందల 21 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.

సాయంత్రం నాలుగు గంటలకే రాష్ట్రంలోని 13 నియోజకవర్గాల్లో ప్రచారం ముగిసింది. సమస్యాత్మక ప్రాంతాలున్న నియోజకవర్గాలైన సిర్పూర్ , చెన్నూర్,  బెల్లంపల్లి,  మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక,  ఇల్లెందు, కొత్తగూడెం , అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో ముందే మైకులు బంద్ అయ్యాయి. మిగతా 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం చేశారు పార్టీల నాయకులు.

గతంలో 68.5 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి ఎక్కువ పోలింగ్ నమోదయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 32 వేల 815 పోలింగ్ కేంద్రాలను పెట్టారు. 1లక్ష 60వేల 500 మంది పోలింగ్ విధులు నిర్వర్తిస్తున్నారు. 279 ప్లటూన్ల కేంద్రబలగాలు రాష్ట్రానికి చేరుకున్నాయి. రాష్ట్ర పోలీసులు 30వేల మంది.. ఏపీ కాకుండా మిగతా రాష్ట్రాలనుంచి వచ్చిన పోలీసులతో మొత్తం 60 వేల మంది బందోబస్తులో పాల్గొంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates