కరెంట్‌ శాఖ కాకి లెక్కలు: 34,808 ఉద్యోగాలు ఇచ్చారట..!

    నియామకాల్లో తామే నంబర్‌‌‌‌ వన్‌‌‌‌ అంటూ ప్రకటన

    34,808 ఉద్యోగాలు ఇచ్చామంటూ విద్యుత్​ శాఖ నోట్

    అందులో 22,637 ఆర్టిజన్‌‌‌‌లే

   వీరి రెగ్యులరైజేషన్​ పూర్తి కాలే

ఉద్యోగ నియామకాలపై రాష్ట్ర విద్యుత్​ శాఖ కాకిలెక్కలు చెబుతోంది. నియామకాల్లో తాము నంబర్​ వన్​ అంటూ ప్రకటించుకుంది. వాస్తవానికి విద్యుత్​ శాఖ కల్పించామని చెబుతున్న 34,808 ఉద్యోగాల్లో 22,637 ఆర్టిజన్​ కార్మికుల పోస్టులే. ఆర్టిజన్​ కార్మికుల రెగ్యులరైజేషన్​ పూర్తి కాకుండానే ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పుకోవడం విమర్శలకు తావిస్తోంది. ఆర్టిజన్‌‌‌‌ కార్మికుల సర్వీసు రూల్స్​ను హైకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందిస్తున్నామని స్వయంగా ట్రాన్స్​కో, జెన్​కో సీఎండీనే చెబుతున్నారు.

రెగ్యులరైజ్‌‌‌‌ ప్రక్రియ పూర్తి కాకుండానే

విద్యుత్‌‌‌‌ సంస్థలు డైరెక్ట్‌‌‌‌ రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ ద్వారా 12,171 పోస్టులే భర్తీ చేశాయి. 22,637 మంది ఆర్టిజన్‌‌‌‌ కార్మికులకు గత కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి విద్యుత్‌‌‌‌ సంస్థలే నేరుగా జీతాలు ఇస్తున్నాయి. ఇప్పటి వరకు వారిని రెగ్యూలరైజ్‌‌‌‌ చేయలేదు. ఏపీఎస్‌‌‌‌ఈబీ ఉద్యోగులకు అమలు చేస్తున్న నిబంధనలను తమకు అమలు చేయాలని ఆర్టిజన్‌‌‌‌ కార్మికులు డిమాండ్​ చేస్తున్నారు. విద్యుత్‌‌‌‌ సంస్థలు ప్రైవేటు ఉద్యోగులకు అమలయ్యే విధానాలనే అనుసరిస్తామని చెబుతున్నాయి. దీంతో ఆర్టిజన్​ కార్మికులు ఆందోళన బాట పట్టారు.

తప్పుపడుతున్న ఇతర శాఖలు

రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటి వరకు 1,17,177 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 34,808 ఉద్యోగాల భర్తీతో విద్యుత్ శాఖ టాప్​లో ఉందని ట్రాన్స్​కో, జెన్​కో ప్రకటనలో పేర్కొనడంపై ఇతర శాఖలు మండిపడుతున్నాయి. పోలీసు శాఖ 17,276 ఉద్యోగాలతో రెండో స్థానం, గురుకులాలు 11,935 ఉద్యోగాలతో మూడో స్థానం, 10,500 ఉద్యోగాలతో సింగరేణి నాలుగో స్థానం, 9,495 ఉద్యోగాలతో పంచాయితీరాజ్‌‌‌‌ శాఖ ఐదో స్థానంలో నిలిచాయని విద్యుత్​ శాఖ పేర్కొంది. చివరి స్థానంలో టీఎస్పీఎస్సీ ఉందనేలా నోట్ రిలీజ్ చేసింది. దీంతో ఇతర శాఖలు గుర్రుగా ఉన్నాయి. సొంత డబ్బా కొట్టుకునేందుకు రాజ్యాంగ సంస్థను అవమానపరిచారని కమిషన్ వర్గాలు అంటున్నాయి. ఇది ప్రతిపక్షాలకు అస్త్రాన్ని ఇచ్చినట్టేనని ఓ అధికారి అన్నారు. నియామకాల్లో టీఎస్పీఎస్సీ ఆలస్యం చేస్తోందని విమర్శలు ఉన్నాయని, ఇలాంటి టైమ్‌లో విద్యుత్ సంస్థల నోట్ కమిషన్ ను ఇరుకున పెట్టేలా ఉందని తెలిపారు.

34,808 ఉద్యోగాలు కల్పించాం… ట్రాన్స్‌‌‌‌కో, జెన్‌‌‌‌కో సీఎండీ ప్రభాకర్‌‌‌‌రావు ప్రకటన

హైదరాబాద్, వెలుగు: 2014 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు జెన్ కో, ట్రాన్స్ కో, డిస్కమ్ ల ద్వారా 22,637 మంది ఆర్టిజన్‌‌‌‌ కార్మికులతో కలిపి 34,808 మందికి ఉద్యోగాలు కల్పించామని ట్రాన్స్‌‌‌‌కో, జెన్‌‌‌‌కో సీఎండీ ప్రభాకర్‌‌‌‌రావు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని శాఖలతో పోలిస్తే విద్యుత్ శాఖలో ఎక్కువ నియామకాలు జరిగాయని, త్వరలోనే మరో 2 వేల ఉద్యోగాలు లభించే అవకాశం ఉందన్నారు. కాంట్రాక్టుపై పనిచేస్తున్న ఆర్టిజన్‌‌‌‌ కార్మికులను సంస్థల్లో విలీనం చేశామని, వారి సర్వీస్​ రూల్స్​ను హైకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందిస్తున్నామని చెప్పారు. విద్యుత్‌‌‌‌ ఉద్యోగుల ఆందోళనల నేపథ్యంలో శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఔట్‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌ ఉగ్యోగులను విలీనం చేయాలనే నిర్ణయం సీఎం కేసీఆర్‌‌‌‌ మానవతా ధృక్ఫథంతో తీసుకున్నదేనన్నారు. 24 గంటల సరఫరాతో విద్యుత్ డిమాండ్ పెరిగిందని, ఫలితంగా విద్యుత్ సంస్థల్లో భారీగా నియామకాలు చేపట్టాల్సి వచ్చిందని చెప్పారు.

వెలుగు మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Updates