మా రాష్ట్రానికి రావొద్దు

ఏపీ రిలీవ్‌‌ చేసిన ఉద్యోగులను అడ్డుకున్న తెలంగాణ విద్యుత్‌‌ ఉద్యోగుల జేఏసీ
విద్యుత్‌‌సౌధ, ఎస్‌‌పీడీసీఎల్‌‌ ఆఫీస్‌‌ల వద్ద టెన్షన్‌‌
రెండు రాష్ట్రాల విద్యుత్‌‌ ఉద్యోగుల మధ్య కోల్డ్‌‌ వార్‌‌

తెలుగు రాష్ట్రాల విద్యుత్‌‌ ఉద్యోగుల మధ్య కోల్డ్‌‌ వార్‌‌ మళ్లీ మొదలైంది. సోమవారం వందలాది మంది తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు తరలి వచ్చి ఏపీ ఉద్యోగులను అడ్డుకొని.. ఆందోళన చేపట్టారు. దీంతో విద్యుత్‌‌సౌధ, ఎస్‌‌పీడీసీఎల్‌‌ కార్పొరేట్‌‌ ఆఫీస్‌‌ వద్ద టెన్షన్‌‌ నెలకొంది. జస్టిస్‌‌ ధర్మాధికారి కమిటీ ఇటీవల ఇచ్చిన ఆర్డర్స్‌‌తో ఏపీ విద్యుత్‌‌ సంస్థల నుంచి రిలీవ్‌‌ అయిన ఆంధ్రా విద్యుత్‌‌ ఉద్యోగులు తెలంగాణలో డ్యూటీలో చేరేందుకు సోమవారం ప్రయత్నించారు. దాదాపు 60 మంది రిలీవ్‌‌ ఆర్డర్లతో తెలంగాణ విద్యుత్‌‌ సంస్థల్లో చేరేందుకు ప్రయత్నించగా తెలంగాణ ఉద్యోగులు ప్రతిఘటించారు. దీంతో ఖైరతాబాద్‌‌ మింట్‌‌కాంపౌండ్‌‌లో టెన్షన్‌‌ నెలకొంది.

టీఎస్‌‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్‌‌ జేఏసీ, టీఎస్‌‌ పవర్‌‌ ఎంప్లాయిస్‌‌ జేఏసీలు వేర్వేరుగా విద్యుత్‌‌సౌధ, టీఎస్‌‌ ఎస్పీడీసీఎల్‌‌ ఆఫీస్‌‌ల గేట్లు మూసేసి గేట్ల వద్దే నల్లబాడ్జీలు ధరించి ఆందోళనలు నిర్వహించారు. విద్యుత్‌‌ సంస్థల్లో ప్రవేశిస్తున్న వారి ఐడీకార్డులను పరిశీలించి లోనికి పంపించారు. గొడవలు జరగకుండా పంజాగుట్ట పోలీసులు వారిని ఆదుపులోకి తీసుకుని గోషామహల్‌‌ స్టేడియానికి తరలించారు.

జస్టిస్‌‌ ధర్మాధికారి రిపోర్టుకు వక్రబాష్యం చెబుతూ సర్వీసు రికార్డుల్లో తెలంగాణ హోమ్‌‌ డిస్ట్రిక్ట్‌‌ లేని 584 మంది ఏపీ ఉద్యోగులను కుట్రపూరితంగా తెలంగాణ విద్యుత్‌‌ సంస్థలపై రుద్దుతూ ఆంధ్ర విద్యుత్‌‌ సంస్థలు రిలీవింగ్‌‌ ఆర్డర్స్‌‌ ఇచ్చాయని తెలంగాణ విద్యుత్‌‌ జేఏసీల నేతలు ఆరోపించారు. ఈ నెల 31వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా నిరవధిక ఉద్యమాలు కొనసాగుతాయని జేఏసీ నేతలు ప్రకటించారు.

ఏ ఒక్కరిని చేర్చుకోనివ్వం

ఏపీ విద్యుత్‌‌ సంస్థలు రిలీవ్‌‌ చేసిన ఏ ఒక్క ఉద్యోగిని విధుల్లో చేర్చుకోనివ్వమని టీఎస్‌‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్‌‌ జేఏసీ నేతలు హెచ్చరించారు. టీఈఈఏ శివాజీ, అకౌంట్స్‌‌ ఆఫీసర్స్‌‌ అసొసియేషన్‌‌ ప్రధాన కార్యదర్శి అంజయ్యలు మాట్లాడుతూ సొంత జిల్లా కాని వారు, ఆప్షన్లు ఇవ్వని 584 మంది ఆంధ్రా ఉద్యోగులను రిలీవ్‌‌ చేశారని, ఇది ఆంధ్రా దురహంకారానికి, పెత్తనానికి నిదర్శనమని విమర్శించారు. మా ఉద్యోగాలకు అడ్డొస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించమని, ఎవరైనా ఆందోళనలను ఖాతరు చేయకుండా, విధుల్లో చేరడానికి వస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. విద్యుత్‌‌ ఉద్యోగుల విభజనను జఠిలం చేయడానికే కుట్రలు పన్నుతున్నారన్నారు. రిలీవ్‌‌ అయిన వారిలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులే అధికంగా ఉన్నారని, ఏపీలో ఎస్సీ, ఎస్టీలు పనిచేసేందుకు అర్హులు కాదా అని ప్రశ్నించారు. ఈ నెల 31 వరకు నిరవధిక ఆందోళనలు కొనసాగుతాయని వారు ప్రకటించారు.

మీ జన్మభూమి రుణం తీర్చుకోండి

విద్యుత్‌‌ ఉద్యోగుల విభజన స్థానికత ఆధారంగానే జరగాలని, ఏ రాష్ట్ర ఉద్యోగులు ఆ రాష్ట్రంలోనే పనిచేయాలని తెలంగాణ పవర్‌‌ ఎంప్లాయిస్‌‌ జేఏసీ నేతలు పి. రత్నాకర్‌‌రావు, పి. సదానందం కోరారు. తెలంగాణ విద్యుత్‌‌ సంస్థల మేనేజ్‌‌మెంట్లు ఆంధ్రా ఉద్యోగులను ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకోరాదని విజ్ఞప్తి చేశారు. ‘తాము ఎంత వద్దన్న తెలంగాణ ఎందుకు వస్తున్నారు. మీ రాష్ట్రంలో పనిచేసి మీ జన్మభూమి రుణం తీర్చుకోవాలని, మీ రాష్ట్రాన్ని ప్రేమించి, మా రాష్ట్రాన్ని  వదిలివెళ్లండని’ (లవ్‌‌ యువర్‌‌ స్టేట్‌‌.. లీవ్‌‌ అవర్‌‌ స్టేట్‌‌) ఆంధ్రా ఉద్యోగులకు సూచించారు. దీనిపై తెలంగాణ విద్యుత్‌‌ సంస్థలు సుప్రీంకోర్టులో పోరాటం చేసి, తెలంగాణకు న్యాయం చేసేందుకు ప్రయత్నించాలన్నారు.

Latest Updates