ఉద్యోగ సంఘాలతో కేసీఆర్ భేటీ: సమస్యలపై చర్చిద్దామంటూ ఫోన్

పీఆర్సీ, డీఏ పెంపుపై ఏడాదిగా డిమాండ్

ఇన్నాళ్లుగా దొరకని అపాయింట్ మెంట్

సడన్ గా సీఎంవో నుంచి ఫోన్ కాల్

ఆర్టీసీ కార్మికులకు మద్దతు దొరక్కుండా చేసే వ్యూహం!

ఆర్టీసీ కార్మికుల సమ్మెతో సీఎం కేసీఆర్ అప్రమత్తమయ్యారు. వ్యూహాత్మకంగా ముందు జాగ్రత్త చర్యల్లోకి దిగారు. ఆర్టీసీ జేఏసీకి ఇతర ఉద్యోగ సంఘాల మద్దతు దొరక్కుండా ఒంటరి చేసే ప్రయత్నాలు షురూ చేశారు. తెలంగాణ గజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగ సంఘాలు (టీఎన్జీవో, టీజీవో) ఏడాదిగా అపాయింట్ మెంట్ కోరుతున్నా ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచి స్పందన లేదు. అలాంటిది ఇవాళ మధ్యాహ్నం సడన్ గా ఫోన్లు చేసి మరీ ఉద్యోగ సంఘాల నాయకులను పిలిచి భేటీ అయ్యారు కేసీఆర్.

మరో గంటలో సమ్మెకు మద్దతుపై భేటీ ఉందనగా..

పీఆర్సీ, డీఏ పెంపుపై ఏడాదిగా టీఎన్జీవో, టీజీవో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. కానీ సీఎం కేసీఆర్ పట్టీపట్టనట్టుగా ఉన్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వానికి విన్నవించేందుకు ఎన్ని సార్లు అపాయింట్ మెంట్ కోరినా కనికరించలేదు. కానీ ఆర్టీసీ సమ్మె జరుగుతున్న తరుణంలో ఇవాళ సడన్ గా వారిపై ప్రభుత్వానికి ప్రేమ పుట్టుకొచ్చింది. మరో గంటలో ఆర్టీసీ జేఏసీతో భేటీ ఉందనగా, రండి.. సమస్యలపై చర్చిద్దామంటూ టీఎన్జీవో నేతలకు ఫోన్లు వెళ్లాయి.

దీని వెనుక అసలు కారనం వేరే ఉందని తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీతో టీఎన్జీవో, గజిటెడ్ అధికార సంఘాల భేటీ ఉండడమేనని గట్టిగా వినిపిస్తోంది. తమ సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరేందుకు ఆర్టీసీ కార్మికులు వారితో కలవాలని నిర్ణయించుకున్నాయి. ఇందుకోసం ఆయా సంఘాలతో మాట్లాడి టైం ఫిక్స్ చేసుకున్నాయి. సకల జనుల సమ్మెలా మరోసారి అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి సమ్మెకు దిగేలా ప్లాన్ చేసుకున్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. వారితో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు.

ఆర్టీసీ జేఏసీతో భేటీకి బ్రేక్

ఆర్టీసీ కార్మిక సంఘాలతో ఇతర ఉద్యోగ సంఘాల భేటీ జరిగితే ఎక్కడ వారి సమస్యలపై కూడా చర్చ జరిగి, సమ్మెకు దిగుతారని  ప్రభుత్వానికి భయం పట్టుకుంది. పోలీసులు, టీచర్లు సహా అన్ని ఉద్యోగ సంఘాలు చాలా కాలం నుంచి అసంతృప్తితో ఉండడంతో మరోసారి సకల జనుల సమ్మె తరహా ఉద్యమం వస్తుందన్న అనుమానంతో, దానికి బ్రేక్ వేసేందుకు చకచకా పావులు కదిపింది కేసీఆర్ సర్కారు. ఆర్టీసీ జేఏసీతో మరో గంటలో భేటీ ఉందనగా.. ఉద్యోగ సంఘాలకు సీఎంవో నుంచి ఫోన్లు వెళ్లడంతో వారు ప్రగతి భవన్ పయనమై వెళ్లారు. దీంతో ఆర్టీసీ సంఘాలతో భేటీ ఆగిపోయింది. ఈ సమయంలో టీఎన్జీవోలకు పిలుపు రావడం.. తమకు మద్దతు దొరక్కుండా చేయాలన్న కేసీఆర్ కుట్రను బయటపెడుతోందని ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు.

Latest Updates