ఏపీ పంపిస్తామన్నా.. తెలంగాణ తీసుకెళ్లట్లేదు..

సారూ మమ్మల్ని తీసుకెళ్లండి

ఏపీలోని తెలంగాణ ఉద్యోగుల వినతి
అన్ని కేడర్లలో మొత్తం 1500 మంది

ఆరేళ్లు గడిచినా పెండింగ్​లోనే ఫైల్
పంపించేందుకు రెడీ.. ఏపీ సర్కారు
వేతన భారంపై టీ సర్కారు మథనం

హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకురావాలన్న డిమాండ్‌కు ఆరేళ్లు.. అయినా ఇప్పటికీ ఈ సమస్య పరిష్కారం కాలేదు. మన ఉద్యోగులను పంపించేందుకు ఏపీ సర్కారు సిద్ధంగా ఉన్నా మన ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవడంలేదు. వారిని తీసుకొస్తే వేతనాల రూపంలో రూ.150 కోట్ల అదనపు భారం పడుతుందని ఆర్థిక శాఖ అధికారుల అంచనా. ఇక్కడ ఖాళీలు లేకపోవడం, వాళ్ల రాకతో ఇక్కడి వారికి ప్రమోషన్లు లేట్ అవుతాయని, దీనిపై ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని అధికారులు చెబుతున్నరు. ఏపీలో గెజిటెడ్, నాన్ గెజిటెడ్, క్లాస్ 4 ఉద్యోగులు మొత్తం 1500 మంది పైనే పనిచేస్తున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. క్యాడర్, శాఖల వారీగా వివరాలు తీయాలని ఉద్యోగ సంఘాల నేతలు సీఎస్‌లు రాజీవ్ శర్మ, ఎస్కే జోషి, సోమేశ్ కుమార్‌లకు వినతి పత్రాలు అందజేశారు. ఈ లెక్క తేల్చే పనిలో జీఏడీ అధికారులు నిమగ్నమయినట్లు తెలుస్తోంది.

సీఎంల భేటీతో ఆశలు
ఏపీలో జగన్ సీఎం అయ్యాక ఇరు రాష్ట్రాల సీఎస్‌లు ఇప్పటికే 10 సార్లకు పైనే భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో ఇరిగేషన్ అంశాలు, విభజన చట్టం అంశాలపైనే అధికంగా చర్చించారు. వాళ్ల నోట్‌లో ఏపీ ఉద్యోగులను తెలంగాణకు తీసుకరావటం అంశం కూడా ఉందని టీఎన్జీవో నేత తెలిపారు.‘‘ప్రభుత్వానికిచ్చిన ప్రతి వినతి పత్రంలోనూ ఏపీ ఉద్యోగులను తెలంగాణకు తీసుకరావటం అనే అంశం ఉంది. త్వరలో ఈ సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకం ఉంది’’ అని టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజేందర్ తెలిపారు. తెలంగాణ ఉద్యోగులను పంపించేందుకు ఏపీ సిద్ధంగా ఉందని, ఇందుకు గత, ప్రస్తుత సీఎంలు చంద్రబాబు, జగన్‌లు అంగీకరించారని ఏపీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి తెలిపారు.

ఏపీ ఉద్యోగులు ఫుల్ హ్యాపీ
రాష్ట్ర ఆవిర్భావం తరువాత తెలంగాణ ఉద్యోగులతో పోలిస్తే ఏపీ ఉద్యోగులు ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్నో ప్రయోజనాలు పొందారు. వీటిలో రిటైర్మెంట్ ఏజ్ 60 ఏళ్లకు పెంపు, వారానికి 5 రోజుల పని, హైదరాబాద్‌లో ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.10లక్షల లోన్, అమరావతిలో ఉద్యోగులకు స్థలాల కేటాయింపు, మధ్యంతర భృతి(ఐఆర్ 27శాతం) మంజూరు, రెగ్యులర్ పదోన్నతులు పొందారని తెలంగాణ ఉద్యోగులు గుర్తుచేస్తున్నారు. ఇక్కడ మాత్రం రెండేళ్లు కావొస్తున్నా పీఆర్సీ ఇవ్వలేదని, కనీసం ఐఆర్ కూడా ఇవ్వలేదని చెబుతున్నారు. స్వరాష్ట్రానికి తీసుకరావటం ఆలస్యం కావటం వాళ్లకు కలిసివచ్చిందని తెలంగాణ సెక్రటేరియెట్‌కు చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు.

For More News..

ఇయర్ ఫోన్స్ కొంటే.. కారు గెలిచారని ఫోన్

ఈసారైనా ఫీజులు తగ్గేనా?

రేవంత్ పోరాటంతో కాంగ్రెస్‌కు సంబంధం లేదు

కేటీఆర్ క్లాస్ తీసుకోలేదు: ఎమ్మెల్యే హరిప్రియ

Latest Updates