రైతు బంధు పతకంపై రైతుల ఆందోళన..

రైతు బంధుపతకం పై రైతులు ఆందోళన చెందుతున్నారు. రాను రాను  రైతుబంధుకు  పుల్ స్టాప్  పడనుందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  రైతులకు  ఇంత చేస్తున్నాం… అంత చేస్తున్నాం.. అంటూ  పదేపదే  చెప్పకునే  రాష్ట్ర ప్రభుత్వం.. రైతులను నిర్లక్ష్యం చేస్తోందా….? అంటే  అవుననే అంటున్నారు రైతు సంఘాల  నేతలు.  పాస్ పుస్తకాలు  లేవని కొందరికి,  ఉన్నా వివిధ రకాల  సాకులతో  మరికొందరికి   రైతుబందు  ఇవ్వడం లేదంటున్నారు.

ప్రభుత్వం వివిధ రకాల కారణాలతో రైతు బంధు సహాయానికి కోతలు పెడ్తుండడంతో ఈ పథకం కొనసాగడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రైతు సంఘాల నేతలు. రాష్ట్రంలో 58 లక్షల మంది రైతులుంటే, 41 లక్షల మందికే రైతుబంధు కింద ఆర్థిక సహాయం అందిస్తున్నారు. మొదట్లో పాస్ బుక్ లున్న 41 లక్షల మందికి ఖరీఫ్, రబీ సీజన్ లో డబ్బులు  ఇచ్చారు. ఆ తర్వాత ఖరీఫ్ లో కొంత ఆలస్యంగా ఖాతాల్లో నగదు వేశారు. రబీకి మరింత ఆలస్యం చేశారు. రైతుబంధు ఇస్తారో లేదోనని రైతులు అయోమయంలో ఉండగా రబీ సీజన్ ముగింపులో డబ్బులు వేశారు. అది కూడా కొంత మందికే వేశారు. పది ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులను హోల్డ్ లో పెట్టారు. వాళ్లకి ఇస్తారో ఇవ్వరో క్లారిటీ లేదు.

గతంలో రైతు బంధు తీసుకున్న వారిలో మరణించిన వాళ్లను, భూములను ఇతరులకు అమ్మిన వాళ్లకు దాదాపు లక్షన్నర మంది రైతులకు రైతు బంధు కోత పడింది. వివిధ కారణాలతో ఆలస్యంగా పాస్ బుక్ లు ఇచ్చిన రైతులకు అసలు రైతుబంధు వర్తిస్తుందో లేదో కూడా క్లారిటీ లేదు. అధికారుల తప్పిదంతో పాస్ పుస్తకాలు ఆలస్యంగా వచ్చినా, నష్టం రైతులకే జరుగుతుందంటున్నారు రైతు సంఘాల నేతలు. లేటుగా పాస్ బుక్ లు వచ్చిన వారిలో చాలా మంది ఐదు ఎకరాల లోపేనంటున్నారు. ఇప్పటి వరకు రైతుబంధు సహాయం దక్కిన వారిలో ఎక్కువ మంది బడా రైతులే ఉన్నారని చెబుతున్నారు. రైతు బంధుకు అర్హత ఉన్నా, సవాలక్ష రూల్స్ తో చాలా మందిని అనర్హులుగా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు రైతు సంఘాల నేతలు.

రైతు బంధుపై బడ్జెట్ సమావేశాల వరకు ఎదురు చూస్తామంటున్నారు రైతు సంఘాల నేతలు. బడ్జెట్ లో సరిపడా నిధులు కేటాయించి పథకాన్ని కొనసాగించాలని కోరుతున్నారు. రైతు బంధును ఆపివేసినా, కోత పెట్టినా ఆందోళన తప్పదని హెచ్చరిస్తున్నారు.

Latest Updates