అందరికీ అన్నీ ఇచ్చినం: మంత్రి హరీశ్​రావు

సాగు, సంక్షేమం, గ్రామీణాభివృద్ధికి పెద్దపీట

రాష్ట్రంలో అన్ని వర్గాలకు ప్రయోజనం కలిగించేలా సంక్షేమ బడ్జెట్​ప్రవేశపెట్టామని ఆర్థిక మంత్రి హరీశ్​రావు చెప్పారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నామన్నారు. రూ.25 వేలలోపు పంట రుణాలను నెలాఖరులోగా మాఫీ చేస్తామని.. సొంత జాగాల్లో డబుల్‌‌‌‌ బెడ్రూం ఇండ్లు కట్టుకునేందుదుకు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. ఆర్థిక మాంద్యం, గ్రోత్​ రేటు తగ్గడం, ఇతర ప్రతికూల పరిస్థితులు నెలకొన్న సమయంలో.. స్వీయ ఆదాయ వృద్ధితో లోటును పూడ్చుకుంటున్నామని వివరించారు. ఆదివారం 2020–21 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌‌‌‌ను హరీశ్‌‌‌‌ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ. లక్షా 82 వేల 914.42 కోట్ల వ్యయాన్ని ప్రతిపాదించారు. ఇందులో రెవెన్యూ ఖర్చు రూ.లక్షా38 వేల 669.82 కోట్లుగా, క్యాపిటల్‌‌‌‌ ఖర్చు రూ.22 వేల 061.18 కోట్లుగా చూపారు. రూ.33 వేల 191.25 కోట్ల ఆర్థిక లోటు ఉంటుందని పేర్కొన్నారు.

రెవెన్యూ గ్రోత్​ రేటు తగ్గింది

ఆర్థిక మాంద్యంతో పన్నులు, పన్నేతర రాబడి తగ్గిపోయిందని మంత్రి హరీశ్​ రావు చెప్పారు. రాష్ట్ర ప్రగతి కోసం వాస్తవిక బడ్జెట్​ను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంచనా వేసుకున్న దానికన్నా కేంద్రం నుంచి రూ.3,731 కోట్ల ఆదాయం తగ్గిందన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన ఐజీఎస్టీ, జీఎస్టీ పరిహారం సకాలంలో రావడం లేదన్నారు. రాష్ట్ర రెవెన్యూ అభివృద్ధి 2018–19 ఆర్థిక సంవత్సరంలో 16.1 శాతంగా ఉంటే 2019–20లో ఫిబ్రవరి చివరికల్లా 6.3 శాతానికి తగ్గిందని చెప్పారు. 15వ ఆర్థిక సంఘం నివేదిక ప్రకారం పన్నుల్లో రాష్ట్రానికి వచ్చే వాటా 2.437 శాతం నుంచి 2.133 శాతానికి తగ్గిందని.. 2020–21లో కేంద్ర నిధుల్లో రూ.2,384 కోట్ల మేర తగ్గిపోతాయని పేర్కొన్నారు.

జీఎస్డీపీ తగ్గింది

గత బడ్జెట్‌‌‌‌లో అంచనా వేసిన ప్రకారం ఈ నెలాఖరు నాటికి లక్షా 36 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని హరీశ్​ రావు చెప్పారు. కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్లలో కోతపడినా సొంత ఆదాయ వృద్ధితో ఆ లోటు పూడ్చుకున్నామన్నారు. జీఎస్డీపీ 2018–19లో 14.3 శాతంగా ఉంటే 2019–20కి వచ్చేసరికి 12.6 శాతానికి తగ్గిందని.. ఇదే సమయంలో మొత్తం దేశ జీడీపీ 11.2 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గిందని చెప్పారు. ప్రస్తుత లెక్కల ప్రకారం రాష్ట్ర జీఎస్డీపీ రూ.9 లక్షల 69 వేల 604 కోట్ల రూపాయలుగా ఉందని వివరించారు. పంటల ఉత్పత్తిలో 23.7 శాతం, పాడి రంగంలో 17.3 శాతం, చేపల పెంపకంలో 8.1 శాతం వృద్ధి సాధించామని.. సర్వీస్‌‌‌‌ సెక్టార్‌‌‌‌ లో 14.1 శాతం వృద్ధి రేటు నమోదైందని తెలిపారు. రాష్ట్ర తలసరి ఆదాయం 2 లక్షల 28 వేల 216 రూపాయలు కాగా.. దేశ తలసరి ఆదాయం లక్షా 35 వేల 50 రూపాయలు మాత్రమేనని చెప్పారు.

రాబడి తగ్గింది.. నిరర్థక ఆస్తులు అమ్ముతాం

ఐదేళ్ల కింద రాష్ట్ర సొంత రాబడి వృద్ధిరేటు 21.5 శాతంగా ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి 6.3 శాతానికి పడిపోయిందని హరీశ్​ చెప్పారు. మారిన ఆర్థిక వ్యవస్థను అంచనా వేసుకుంటూ పరిస్థితులకు తగినట్టుగా ఆర్థిక వ్యూహ రచన చేస్తున్నామన్నారు. రాజీవ్‌‌‌‌ స్వగృహతోపాటు నిరర్థకంగా పడి ఉన్న ప్రభుత్వ ఆస్తులను అమ్మి ఆదాయం సమకూర్చుకుంటామని తెలిపారు. ఇసుక, ఇతర ఖనిజాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇంకా పెంచుకోవడంపై దృష్టి పెడతామన్నారు. ఆర్టీసీ లాభాల బాట పట్టించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుందని, ఇందుకు బడ్జెట్‌‌‌‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు.

నెలాఖరులోపు ఆరు లక్షల మందికి రుణ విముక్తి!

వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు ఎక్కువగా నిధులు కేటాయించామని హరీశ్​ చెప్పారు. రైతుల రుణ మాఫీని దశల వారీగా అమలు చేస్తామన్నారు. తొలుత రూ.25 వేలలోపు రుణాలకు మాఫీ వర్తింపజేస్తామని.. మిగతా రైతులకు విడతల వారీగా ఇస్తామని ప్రకటించారు. రూ.25 వేలలోపు అప్పు తీసుకున్న రైతులు 5 లక్షల 83 వేల 916 మంది ఉన్నారని.. వారందరికీ ఈ నెలాఖరులోపే రుణ విముక్తి కల్పిస్తామని తెలిపారు. ఎమ్మెల్యేలు చెక్కుల రూపంలో నేరుగా రైతులకు ఈ సొమ్మును అందజేస్తామని తెలిపారు. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందజేస్తున్నామని.. పండ్ల తోటలు, కూరగాయల సాగుకు ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు.

సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నం

కాళేశ్వరం తరహాలో పాలమూరు– రంగారెడ్డి సహా అన్ని పెండింగ్‌‌‌‌ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తామని హరీశ్​ చెప్పారు. రాష్ట్రంలో గత ఆరేండ్లలో ఒక్కరు కూడా ఫ్లోరోసిస్‌‌‌‌ బారిన పడలేదని ఇండియన్‌‌‌‌  నేచురల్‌‌‌‌  రీసోర్సెస్‌‌‌‌ ఎకనామిక్‌‌‌‌  అండ్‌‌‌‌  మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ ఫౌండేషన్‌‌‌‌ ప్రకటించిందని తెలిపారు. పేదల కోసం రూ.40 వేల కోట్లతో వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. 57 ఏండ్లు నిండిన వారికి త్వరలోనే వృద్ధాప్య పింఛన్‌‌‌‌ ఇస్తామని, ఇందుకోసం బడ్జెట్‌‌‌‌ కేటాయింపులు కూడా పెంచామని చెప్పారు. 2018–19లో ఎస్సీ, ఎస్టీల ప్రగతి కోసం ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల వివరాలను శాసన సభ్యులందరికీ ఇస్తున్నట్టు ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరంలో 71 మైనార్టీ జూనియర్‌‌‌‌ కాలేజీలు ప్రారంభిస్తున్నామని ప్రకటించారు.

హైదరాబాద్​ను మరింత​ అభివృద్ధి చేస్తం

గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌ ను మరింత అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామని హరీశ్​ తెలిపారు. పాత బస్తీలో మెట్రో రైలు వస్తుందని, రాయదుర్గం నుంచి శంషాబాద్‌‌‌‌కు, బీహెచ్‌‌‌‌ఈఎల్‌‌‌‌ నుంచి లక్డీకాపూల్‌‌‌‌కు కొత్త మెట్రో లైన్లు వేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఎడ్యుకేషన్‌‌‌‌కు బడ్జెట్‌‌‌‌లో ప్రాధాన్యం ఇచ్చామని.. సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యంగా ఈచ్‌‌‌‌ వన్‌‌‌‌ టీచ్‌‌‌‌ వన్‌‌‌‌ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. అత్యుత్తమ వైద్య సేవల్లో తెలంగాణ దేశంలోనే మూడో ప్లేస్​ లో ఉందని నీతి ఆయోగ్‌‌‌‌ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో కరోనా ప్రబలే అవకాశం లేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.

తొలి బడ్జెట్.. గంట సేపు స్పీచ్

ఆర్థిక మంత్రి హరీశ్‌‌‌‌ రావు అసెంబ్లీలో తొలిసారిగా ఆదివారం బడ్జెట్‌‌‌‌ ప్రవేశపెట్టారు. అంతకుముందు సీఎం చాంబర్‌‌‌‌లో బడ్జెట్‌‌‌‌ ప్రతులను కేసీఆర్‌‌‌‌ కు అందజేసి, ఆశీర్వాదం తీసుకున్నారు. ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీ సమావేశం కాగానే స్పీకర్‌‌‌‌ పోచారం శ్రీనివాస్‌‌‌‌ రెడ్డి అనుమతితో బడ్జెట్‌‌‌‌ ప్రవేశపెట్టారు. 62 పేజీల బడ్జెట్‌‌‌‌  స్పీచ్‌‌‌‌ను గంటా రెండు నిమిషాల్లో చదివారు. ప్రసంగించినంత సేపు హరీశ్‌‌‌‌ గంభీరంగా కనిపించారు. ఎలాంటి చెణుకులు, చురకలు లేకుండా సాదాసీదాగా ప్రసంగం సాగిపోయింది. తొలిసారి బడ్జెట్‌‌‌‌ ప్రవేశపెట్టిన హరీశ్‌‌‌‌ను సీఎం కేసీఆర్‌‌‌‌, మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందించారు.

గత రెండేళ్ల లెక్కలివీ..

2018–19 ఆర్థిక సంవత్సరం తుది లెక్కల ప్రకారం రూ.లక్షా 57 వేల 150 కోట్లు ఖర్చు చేశామని.. రెవెన్యూ మిగులు రూ.4,337 కోట్లు, ఆర్థిక లోటు రూ.26 వేల 943 కోట్లు అని హరీశ్​ చెప్పారు.

2019–20 సంవత్సరానికి సంబంధించి రూ. లక్షా 46 వేల 492 కోట్లతో బడ్జెట్‌‌‌‌ ను ప్రతిపాదించగా.. తాజాగా రూ.లక్షా 42 వేల 152 కోట్లకు సవరిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.లక్షా 10 వేల 824 కోట్లు, క్యాపిటల్‌‌‌‌ వ్యయం రూ.13 వేల 165.72 కోట్లు అని చెప్పారు. రెవెన్యూ మిగులు రూ.103.55 కోట్లు అని వివరించారు.

 

గ్రామాల్లో అన్ని సౌకర్యాలు

కుల వృత్తులపై ఆధారపడ్డ బీసీల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టామని హరీశ్​చెప్పారు. బీసీల ఆత్మగౌరవ భవనాలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గ్రామీణాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని.. పంచాయతీరాజ్‌‌‌‌ శాఖలో డీపీవో నుంచి జూనియర్‌‌‌‌ పంచాయతీ సెక్రెటరీ వరకు అన్ని ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. ప్రతి గ్రామంలో ట్రాక్టర్‌‌‌‌, నర్సరీ, శ్మశానవాటిక, డంప్‌‌‌‌ యార్డులు ఉండేలా చర్యలు తీసుకున్నామని.. దేశంలో ఇవన్నీ వసతులున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు.

Latest Updates