ఆస్తులు అమ్ముతం: ఆర్థిక మంత్రి హరీశ్ రావు

57 ఏండ్లు నిండినవారికి త్వరలో ఆసరా పెన్షన్లు
సొంత స్థలమున్న వారికి ‘డబుల్’ ఇంటికి ఆర్థిక సాయం
కేంద్రం నిధులు విడుదల చేయడం లేదని ఆరోపణ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఆదాయం సమకూర్చుకునేందుకు నిరర్థక ఆస్తులను అమ్మేస్తామని ఆర్థిక మంత్రి హరీశ్ రావు తెలిపారు. బడ్జెట్ ప్రసంగం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న రెవెన్యూ భూములు, హౌసింగ్ బోర్డు భూములు, రాజీవ్ స్వగృహ కల్ప ఇండ్లు, డక్కన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్ లిమిటెడ్ కింద ఉన్న భూములను
విక్రయిస్తామని చెప్పారు.

ఆసరా, కల్యాణలక్ష్మి పద్దు పెంచినం

బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేశామని మంత్రి అన్నారు. ఆసరా, కల్యాణలక్ష్మి, రెసిడెన్సియల్ స్కూల్స్‌‌కు అధికంగా నిధులు కేటాయించామన్నారు. సీఎం అన్ని కోణాల్లో ఆలోచించి సంక్షేమానికి అధికంగా నిధులు కేటాయించారని చెప్పారు. 57 ఏండ్లు నిండిన వారికి త్వరలో పెన్షన్లు ఇస్తామని, అందుకే ఆసరా పద్దు పెరిగిందన్నారు. కల్యాణలక్ష్మికి అదనంగా రూ.700 కోట్లు కేటాయించామన్నారు. సొంత స్థలమున్న లక్ష మందికి డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించుకోడానికి సాయం చేస్తామని.. అందుకోసం రూ.10,050 కోట్లు కేటాయించామన్నారు.

కేంద్ర నిధులు రావట్లేదు..

కేంద్రం ఇవ్వాల్సిన నిధులు విడుదల చేయడం లేదని హరీశ్ తెలిపారు. జీఎస్టీ బకాయిలు రూ.933 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని ఇవ్వాలని పలుసార్లు లేఖ రాసినా స్పందన లేదన్నారు.  రాష్ట్రాలకు పన్నుల వాటా తగ్గించడం వల్ల రాష్ట్రానికి రూ.2,384 కోట్ల ఆదాయం తగ్గిందన్నారు. రూ.730 కోట్లు గ్రాంట్ ఇవ్వాలని ఆర్థిక సంఘం చేసిన సిఫార్సును కూడా కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

Latest Updates