ఆర్టీసీలో వద్దన్నరు..  సింగరేణిలో సై అన్నరు

లేబర్ యూనియన్లపై టీఆర్ఎస్ ద్వంద వైఖరి

హైదరాబాద్, వెలుగు: లేబర్ యూనియన్లపై టీఆర్ఎస్​ అనుసరిస్తున్న తీరు చర్చనీయాంశమవుతోంది. అవసరం ఉన్నప్పుడు ఒక రకంగా, అవసరం లేనప్పుడు మరో రకంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొన్నటివరకు ఆర్టీసీ విషయంలో ఒక తీరుగా, ఇప్పుడు సింగరేణి విషయంలో మరో తీరుగా నడుచుకుంటోందన్న చర్చ కార్మిక సంఘాల్లో కొనసాగుతోంది. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా జులై 2న టీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం.. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఒకరోజు సమ్మె చేసింది. అంతకు ముందు దిష్టిబొమ్మలతో నిరసనలు తెలిపింది. అయితే.. 8 నెలల కింద ఆర్టీసీ కార్మిక సంఘాల విషయంలో మాత్రం టీఆర్​ఎస్​ హైకమాండ్​ కఠినంగా వ్యవహరించింది. ‘‘అప్పుడు ఆర్టీసీలో సంఘాలు వద్దన్నరు. యూనియన్ల నుంచి బయటికి వచ్చేలా ఒత్తిడి చేయమన్నరు. అట్లనే చేసి డ్రైవర్లు,కండక్టర్లను ఒప్పించినం. ఇప్పుడు సింగరేణిలో సమ్మె చేయాలని ఫోన్లు వచ్చినయ్. అందుకే కార్మికులతో సమ్మె చేయించినం’’ అని సింగరేణి బెల్ట్ లోని టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే ఒకరు అన్నారు.

యూనియన్లు లేని ఆర్టీసీ
8 నెలల కింద ఆర్టీసీ కార్మికులు 52 రోజుల పాటు సమ్మె చేశారు. సమ్మె చట్ట వ్యతిరేకమని, యూనియన్ల వల్లే సంస్థ నష్టాల ఊబిలోకి వెళ్లిందని అప్పట్లో సీఎం కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. యూనియన్లు లేని ఆర్టీసీ ఉండాలని ఆశించారు. ఆయన కోరినట్టుగానే ఆర్టీసీలో యూనియన్లు లేకుండా సంస్థ యాజమాన్యం వ్యవహరించింది. సుదీర్ఘంగా కార్మికులు సమ్మె చేసినా డిమాండ్లకు ఒప్పుకోలేదు. సమ్మె విరమించి డ్యూటీలో చేరుతామనేలా పరిస్థితిని కల్పించింది. యూనియన్లు లేని ఆర్టీసీ ఉండాలన్ని వ్యూహాన్ని అమలు చేసింది. యూనియన్ల నుంచి సభ్యత్వం రద్దు చేసుకుంటున్నట్టు లేఖలు ఇచ్చిన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్ లను డ్యూటీలో చేర్చుకుంది. దీంతో ఆర్టీసీలో యూనియన్లు లేకుండా పోయాయి. అప్పటివరకు గుర్తింపు సంఘంగా ఉన్న తెలంగాణ మజ్దూర్ సంఘం ఆఫీస్​ను ఆర్టీసీ స్వాధీనం చేసుకుంది.

కలవరపెడుతున్న బీఎంఎస్

సింగరేణి బెల్ట్ లో టీఆర్​ఎస్​ను బీఎంఎస్ (భారతీయ మజ్దూర్ సంఘ్) కలవరపెడుతోంది. సింగరేణి ఏరియాల్లో మంచిపట్టున్న నాయకుడు కెంగర్ల మల్లయ్య కొన్ని నెలల క్రితం టీబీజీకేఎస్​కు రాజీనామా చేసి బీఎంఎస్ లో చేరారు. దీంతో చాలా మంది నేతలు కూడా టీబీజీకేఎస్​ను వీడారు. అప్పట్లో కార్మిక సంఘం ఎలక్షన్ దగ్గర్లో లేకపోవడంతో టీఆర్​ఎస్​ సీరియస్ గా తీసుకోలేదు. త్వరలో గుర్తింపు సంఘం కోసం ఎలక్షన్ నిర్వహించే చాన్స్​ ఉంది. అందుకే సీఎం కేసీఆర్ మళ్లీ సింగరేణిపై ఫోకస్ పెట్టారని ఓ సీనియర్ నేత చెప్పారు. ‘‘ఈ సారి ఎలక్షన్ లో టఫ్​ ఫైట్​ ఉండొచ్చు. అధికారంలో ఉండి అనుబంధ కార్మిక సంఘం ఓడిపోకుండా టీఆర్​ఎస్​ హైకమాండ్​ ప్లాన్​ చేస్తున్నది. అందుకే మాజీ ఎంపీ కవితకు మళ్లీ టీబీజీకేఎస్​ బాధ్యతలు అప్పగించారు’’ అని ఆ నేత వివరించారు.

For More News..

గేట్లెత్తితే పోయేదానికి ఎత్తిపోస్తున్నరు

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

‘పూజిస్తం.. అవసరమైతే శిక్షిస్తం’

Latest Updates