ప్రాణాలు పోతున్నా పట్టించుకుంటలే!

కరోనా అనుమానితులను చేర్చుకోని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖాన్లు
కింగ్‌కోఠి, గాంధీ, ఉస్మానియా చుట్టూ తిప్పుతున్న స్టాఫ్
బెడ్లు ఫుల్ అయినయంటున్న ప్రైవేటు హాస్పిటళ్లు
వారంలోనలుగురుమృతి.. స్పందించని సర్కార్‌‌

హైదరాబాద్‌, వెలుగు: కరోనా అనుమానితులు, పేషెంట్లకు ప్రభుత్వ, ప్రైవేటు దవాఖాన్లు చుక్కలు చూపిస్తున్నాయి. కరోనా లక్షణాలతో వెళ్తే ట్రీట్‌మెంట్‌కు నిరాకరిస్తున్నాయి. కరోనా కోసం కేటాయించిన సర్కార్ దవాఖాన్లలోనూ ఇదే పరిస్థితి. కింగ్‌ కోఠి, గాంధీ, ఉస్మానియా, చెస్ట్ హస్పిటళ్లకు పోతే బాధితులను పట్టించుకునే వారు ఉండట్లేదు. బెడ్లుఫుల్ అయినయని, వెంటిలేటర్లు ఖాళీగా లేవని అక్కడికి ఇక్కడికి తిప్పిస్తున్నారు. గత వారం రోజుల్లోనే ఇలా దవాఖాన్ల చుట్టూ తిరుగుతూ, సకాలంలో ట్రీట్‌మెంట్ అందక నలుగురు చనిపోయారు. శుక్రవారం ఓ మహిళ కింగ్ కోఠి హాస్పిటల్‌ గేట్ వద్దే కన్నుమూయగా.. ఆదివారం ఓ యువకుడు చెస్ట్ హాస్పిటల్‌లో మరణించాడు. తననెవరూ పట్టించుకోవడంలేదని, ఆక్సిజన్ కూడా అందడం లేదని మరణానికి ముందు బాధితుడు తీసుకున్న సెల్ఫీ వీడియో సర్కార్‌ ‌దవాఖాన్ల దుస్థితికి అద్దం పడుతోంది. ఇక కరోనా లక్షణాలతో వస్తున్న పేషెంట్లను చాలా ప్రైవేట్‌ హాస్పిటళ్లు గేట్‌ కూడా దాటనీయడం లేదు. కరోనా ట్రీట్‌మెంట్
అందిస్తున్న కార్పొరేట్ దవాఖాన్లకు వెళ్తే.. బెడ్లుఫుల్ అయినయని చెబుతున్నారు.

అసలు ఏడికి పోవాలి?
కరోనా అనుమానితులు, పేషెంట్లను తొలుత గాంధీలోనే అడ్మిట్ చేసుకున్నారు. వైరస్ వ్యాప్తి పెరగడంతో గాంధీని కరోనా ట్రీట్‌మెంట్కే వాడాలని నిర్ణయించారు. లక్షణాలున్నవాళ్లు టెస్టులకు కోఠి హాస్పిటల్‌కు రావాలని చెప్పారు. దీంతో వైరస్ లక్షణాలతో చాలా మంది అక్కడికి వెళ్తున్నారు. కొంత సీరియస్‌గా ఉన్న పేషెంట్లను అక్కడ చేర్చుకోవట్లేదు. ఆక్సిజన్ బెడ్లు, వెంటి లేటర్లు లేవని గాంధీకి రిఫర్ చేస్తున్నారు. గాంధీకి వెళ్తే, పాజిటివ్ వ్యక్తులనే చేర్చుకుంటామంటున్నారు. ఈ విషయం తెలిసి కూడా పేషెంట్లను, కోఠి నుంచి గాంధీకి ఎందుకు రిఫర్ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. గాంధీకి వచ్చే అనుమానితులను అక్కడి డాక్టర్లు ఉస్మానియా లేదా చెస్ట్హాస్పిటల్‌కు రిఫర్ చేస్తున్నారు. ఉస్మానియాలో కరోనా అనుమానితుల కోసం 48 బెడ్లతో ఐసోలేషన్ వార్డు ఉంది. టెస్ట్ రిజల్ట్ వచ్చేవరకూ అనుమానితులను ఇక్కడే ఉంచుతున్నారు. అయితే సివియర్ సింప్టమ్స్‌తో ఇక్కడికి రోజూ 80 నుంచి 100 మంది వస్తున్నారని ఉస్మానియా డాక్టర్లు చెబుతున్నారు. దీంతో బెడ్లులేవని తిప్పి పంపుతున్నారు. చెస్ట్ హాస్పిటల్‌లోనూ ఇదే పరిస్థితి. ఈ దవాఖాన్ల చుట్టూ తిరిగి తిరిగి బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఏప్రిల్‌లో కోఠి, గాంధీ హాస్పిటళ్ల నడుమ తిరుగుతూ బహదూర్ అనే వృద్ధుడు నారాయణగూడలో రోడ్డు పైనే చనిపోయాడు. కోఠి, చెస్ట్ హాస్పిటల్ నడుమ తిరుగుతూ గోవింద్‌(45) అనే వ్యక్తి ఫుట్‌పాత్‌పై ప్రాణాలొదిలాడు. ఏప్రిల్‌లో గద్వాల్‌కు చెందిన ఓ గర్భిణి దవాఖాన్ల చుట్టూ తిరిగి చివరకు మరణించింది. దీనిపై సర్కారుకు హైకోర్టు మొట్టికాయలు వేసింది. రాష్ట్రంలోకి కరోనా ప్రవేశించి 4 నెలలైనా ఇప్పటికీ సరైన వ్యవస్థను సర్కారు సెట్ చేయలేదు.

మానిటరింగ్ ఏది?
ప్రైవేటు హాస్పిటళ్లలో కరోనా ట్రీట్‌మెంట్, ఇతర అంశాలను మానిటర్ చేసేందుకు కమిటీ వేస్తామని,  రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని 15రోజుల కింద సీఎస్ సోమేశ్‌కుమార్ హెచ్చరించారు. కానీ, ఇప్పుడు అనేక ఉల్లంఘనలు జరుగుతున్నా సర్కార్ యంత్రాంగం అసలు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. కరోనా ట్రీట్‌మెంట్‌కు సర్కార్ ప్రకటించిన ప్యాకేజీలను కూడా కొన్ని కార్పొరేట్ హాస్పిటళ్లులైట్ తీసుకున్నాయి. ఒక్కో పేషెంట్‌ వద్ద పీపీఈ కిట్లకే రోజుకు రూ. 5 వేల నుంచి పది వేలు వసూలు చేస్తున్నాయి. టెస్టులు, డాక్టర్ ‌‌కన్సల్టేషన్, నర్సింగ్ చార్జెస్ వంటి పేర్లతో అడ్డగోలుగా దోచుకుంటున్నాయి.

ప్రైవేటోళ్లూ బెడ్లులేవంటున్నరు
కరోనా లక్షణాలున్నాయని ట్రీట్‌మెంట్‌కు నిరాకరించొద్దన్న సర్కార్ ఆదేశాలను ప్రైవేటు ఆస్పత్రులు లెక్క చేయడం లేదు. జ్వరం, జలుబుంటే చేర్చుకోవట్లేదు. ప్రతి హాస్పిటల్‌లోని కరోనా బెడ్లలో కొన్ని ఎమర్జెన్సీకి ఉంచాలని సర్కార్ చెప్పినా పట్టించుకోవట్లేదు. బెడ్లు, వెంటి లేటర్లు లేవని సివియర్ పేషెంట్లనూ పంపించేస్తున్నారు.

లోపం ఎక్కడ?
రాష్ట్రంలో మార్చి 2న తొలి కరోనా కేసు నమోదవగా, అదే నెల 13 నుంచి నేటి వరకూ ప్రతిరోజూ కొత్తకేసులు నమోదవుతున్నాయి. వందల నుంచి వేలకు కేసుల సంఖ్య పెరిగింది. అయినా, ఇప్పటికీ కరోనా టెస్టుల కోసం ఎక్కడికి వెళ్లాలో, ట్రీట్‌మెంట్ కోసం ఎక్కడికి వెళ్లాలో అర్థంకాని పరిస్థితి. వేలల్లో బెడ్లు, వందల్లో వెంటిలేటర్లు ఉన్నాయని సర్కార్ ప్రకటిస్తుండగా.. దవాఖాన్లకు పోతేనేమో బెడ్లు, వెంటిలేటర్లు ఖాళీ లేవని తిప్పి పంపుతున్నారు. దవాఖాన్ల సూపరింటెండెంట్‌లు, డాక్టర్లు, ఆఫీసర్ల నడుమ సమన్వయం లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. సమస్యను పరిష్కరించాల్సిన ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు ఇవేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.

ఏం చేయాలి?
బాధితులకు, దవాఖాన్లలో పనిచేసే స్టాఫ్‌కు సరైన సమాచారం తెలియకపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయి. కరోనా ట్రీట్‌మెంట్ అందిస్తున్న ప్రైవేటు, ప్రభుత్వ దవాఖాన్లను, వాటిల్లోని ఐసోలేషన్‌ బెడ్లు, ఐసీయూబెడ్లు, వెంటిలేటర్‌‌ బెడ్ల సంఖ్యను పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఎప్పటికప్పుడు వాటిల్లో పేషెంట్ల సంఖ్య, ఖాళీగా ఉన్న బెడ్ల సంఖ్య వంటి వివరాలను రియల్‌ టైమ్‌ బేసిస్‌పై వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. టెస్టింగ్ సెంటర్లు, శాంప్లింగ్ సెంటర్ల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఎమర్జెన్సీ టైంలో ప్రజలకు ఎక్కడికి వెళ్లాలో తెలిసే అవకాశం ఉంటుంది.

తిరిగి తిరిగి.. ప్రాణాలు విడిచారు
ఈ నెల 18న అత్తాపూర్‌‌కు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి, శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్న తన భార్యను తీసుకుని హైదరాబాద్లో ప్రభుత్వ, ప్రైవేటు దవాఖాన్లు అన్నీ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. గాంధీ హాస్పిటల్ కు వెళ్తే, కింగ్‌కోఠికి వెళ్లాలని.. అక్కడి వాళ్లు ఉస్మానియాకు వెళ్లాలని ఇలా అటూ ఇటూ తిప్పారు. చివరికి ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. తన భార్యను కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నింటినీ ఆ వ్యక్తి వీడియోల రూపంలో విడుదల చేశారు. అయినా రాష్ట్ర సర్కార్ పట్టించుకోలేదు.

హైదరాబాద్‌లోని దమ్మాయిగూడలో నివాసం ఉండే మహిళకు జ్వరం రావడంతో ఈ నెల 25న కుటుంబ సభ్యులు గాంధీ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. గేట్‌ వద్దే ఆపిన పోలీసులు.. కింగ్‌కోఠికి వెళ్లాలని చెప్పారు. కింగ్‌కోఠిలో డాక్టర్లు గాంధీ హాస్పిటల్ కి రిఫర్ చేశారు. ఆ రిఫరల్ కాగితం పట్టుకుని గాంధీ హాస్పిటల్ కు పోతే, ఉస్మానియాకు రిఫర్ చేశారు. ఉస్మానియాకు పోతే బెడ్లు, వెంటిలేటర్లు ఖాళీగా లేవన్నారు. అక్కడి నుంచి ఇంకో రెండు దవాఖాన్లకు వెళ్నాలి.. ఇదే సమాధానం వచ్చింది. మరుసటి రోజు ఉదయం మళ్లీ గాంధీ హాస్పిటల్ కు, అక్కడి నుంచి కింగ్‌కోఠికి తీసుకెళ్లారు. గంటన్నర పాటు హాస్పిటల్‌ గేట్ వద్దే నిరీక్షించి, అంబులెన్స్‌లోనే ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. కనీసం చనిపోయాక కూడా ఆమెకు టెస్ట్ చేయలేదు.

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ఓ గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో స్థానికంగా ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్ల సూచనతో కరీంనగర్‌‌లోని గవర్నమెంట్‌ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కడుపులోనే బిడ్డచనిపోయిందని, మెరుగైన వైద్యం కోసం హన్మకొండ ప్రసూతి దవాఖానకు తీసుకెళ్లాలని డాక్టర్లు రిఫర్ చేశారు. ఈ నెల 26న ఆమెను హన్మకొండకు తీసుకొచ్చారు. ఆ మహిళ ఆయాస పడుతుండడాన్ని గమనించిన డాక్టర్లు, కరోనా అనుమానంతో టెస్టుల కోసం శాంపిల్స్‌ తీసి పంపించారు. టెస్ట్ రిజల్ట్ వచ్చాక ట్రీట్మెంట్ చేస్తామన్నరు. 12 గంటలైనా టెస్ట్ రిజల్ట్‌ రాలేదు. ఈలోపల ఆ మహిళ ప్రాణాలు వదిలింది.

For More News..

ఖమ్మంలో పాజిటివ్.. గాంధీలో నెగెటివ్

ఆన్ లైన్ క్లాసులపై నో క్లారిటీ.. అయినా ఆపమంటున్న ప్రైవేట్ సంస్థలు

డాడీ.. ఊపిరి ఆడుతలేదు.. ఆక్సిజన్‌‌ తీసేసిన్రు.. ఇక సచ్చిపోతున్న బై..