పీఆర్సీ మరింత లేటు!

వేతనాల సవరణ కోసం రెండేండ్లుగా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు మళ్లీ నిరాశే ఎదురైంది. ప్రభుత్వం ‘వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ)’ గడువును వరుసగా మూడోసారి పొడిగించింది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు కమిషన్ గడువు పెంచుతూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఉద్యోగులు, టీచర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా లేటైందని, ఈ నెల 24 నాటికే పీఆర్సీ గడువు ముగియాల్సి ఉంటే.. ఏడాది చివరివరకు పొడిగించడం ఏమిటని మండిపడుతున్నారు.

ప్రభుత్వం మోసం చేస్తోంది

పీఆర్సీ కమిషన్ గడువు పెంపును తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేస్తోంది. ఏపీ సర్కారు ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇచ్చింది, ఇక్కడ అది కూడా ఇవ్వలేదు. పీఆర్సీ నివేదిక రెడీ అయిందని తమకు సమాచారముందని, ప్రభుత్వం వెంటనే తెప్పించుకుని, వేతన సవరణను త్వరగా ప్రకటించాలి.

– ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

కనీసం మధ్యంతర భృతి (ఐఆర్) అయినా ఇవ్వకుండా ఇలా పెంచుకుంటూ పోవడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్​ ఒకటి నుంచిగానీ, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటి నుంచిగానీ కొత్త పీఆర్సీ అమల్లోకి వస్తుందని ఆశించామని, సర్కారు తీరు సరికాదని
వాపోతున్నారు.

ఏడాదిన్నర కింద కమిటీ ఏర్పాటు చేసినా..

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్ల వేతన సవరణ కోసం 2018 మేలో తెలంగాణ తొలి పీఆర్సీని సర్కారు ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సీఆర్ బిశ్వాల్  చైర్మన్ గా మరో ఇద్దరు సభ్యులను నియమించింది. ఆ కమిషన్​ ఆరు నెలల్లోనే నివేదికను ఇవ్వాలి. కానీ వరుసగా వాయిదా పడుతూ వస్తోంది. చివరిసారిగా పెంచిన గడువు ఈ నెల 24తో ముగియాల్సి ఉంది. కానీ సర్కారు ఏకంగా ఈ ఏడాది చివరి వరకు పొడిగించింది. ప్రభుత్వం పీఆర్సీ కమిటీకి వేతన సవరణతోపాటు అన్ని శాఖల్లో ఉద్యోగుల వివరాలు, సర్వీస్ రూల్స్, ఉద్యోగుల ఖాళీలు సహా 11 అంశాల బాధ్యతలను కూడా అప్పగించింది. దీనివల్లే పీఆర్సీ పని ఆలస్యమవుతోందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

ఉమ్మడి రాష్ట్ర పీఆర్సీనే..

ఉమ్మడి రాష్ట్రంలో వేసిన పీఆర్సీని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 2015 ఫిబ్రవరి 5న సీఎం కేసీఆర్​ ఆమోదించారు. ఏకంగా 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చారు. రూల్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2018 జులై 1 నుంచి కొత్త పీఆర్సీ ఇవ్వాల్సి ఉంది. గడువులోగానే పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసినా.. సర్కారు నివేదిక తీసుకోలేదు. దీంతో ఉద్యోగులు, టీచర్లు సుమారు రెండేండ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. పీఆర్సీ విషయంగా పలుమార్లు సీఎం కేసీఆర్​ను కలిసేందుకు వారు ప్రయత్నించినా అపాయింట్​మెంట్​ ఇవ్వలేదు. ఇటీవలి ఆర్టీసీ సమ్మె సమయంలో మాత్రం సీఎం కేసీఆర్​ టీఎన్జీవో, టీజీవో నేతలను ప్రగతిభవన్ కు పిలిపించుకున్నారు. వారితో కలిసి లంచ్ చేశారు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక ముగియగానే సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పది పన్నెండు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలంటూ నవంబర్ 9న సర్కారు నుంచి కమిషన్ కు ఆదేశాలు వెళ్లడంతో ఉద్యోగుల్లో ఆశలు చిగురించాయి. కానీ అదేమీ అమల్లోకి రాలేదు.

నేడు జిల్లా కేంద్రాల్లో నిరసనలు

పీఆర్సీ కమిషన్ గడువు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదంటూ ఆందోళన చేపట్టాలని టీచర్​ సంఘాలు నిర్ణయించాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, వెంటనే పీఆర్సీ ప్రకటించాలని టీచర్​ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) యూఎస్ పీసీ డిమాండ్​ చేసింది. దీనిపై బుధవారం నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీచర్లకు పిలుపునిచ్చింది. రెండు మూడు రోజుల్లో టీచర్లు, పెన్షనర్ల సంఘం సమావేశమై భవిష్యత్ కార్యాచరణ
ప్రకటిస్తామని తెలిపింది.

40 శాతం ఐఆర్ ప్రకటించాలె..

‘‘పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా ఆలస్యం చేస్తూ.. స్వయంగా సీఎం ప్రకటించిన తేదీలకు భిన్నంగా వ్యవహరిస్తోంది. కమిషన్ పూర్తిగా విఫలమైంది. ఉద్యోగులు, టీచర్లు, కార్మికులు నిరాశలో మునిగిపోయారు. సర్కారు వెంటనే 40 శాతం ఐఆర్ ప్రకటించాలి..’’

మధుసూదన్ రెడ్డి, ఇంటర్ జేఏసీ చైర్మన్

వెంటనే పీఆర్సీ ఇవ్వాలే..

‘‘రాష్ట్ర ఏర్పాటు తర్వాత గడువులోగా పీఆర్సీ ఇస్తామని చెప్పారు. కమిషన్ ఏర్పాటు చేశారు. కానీ నిర్లక్ష్యం చేస్తున్నారు. సీఎం కేసీఆర్​ త్వరలోనే ఉద్యోగ సంఘాలను పిలిచి పీఆర్సీ ఇస్తారని ఆశిస్తున్నం. గడువు ముగిసిన తర్వాత పీఆర్సీ ఇవ్వడం వల్ల నష్టపోతున్నాం’’

– పద్మాచారి, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు

ఇంత ఆలస్యం ఎందుకు?

‘‘గడువు దాటి 20 నెలలు అయినా పీఆర్సీ ఇవ్వలేదు. మళ్లీ కమిషన్ గడువు పెంపును ఖండిస్తున్నం. ఇంతకాలం నివేదిక రెడీ చేయకుండా కమిషన్  ఏం చేసింది. కనీసం 27 శాతం ఐఆర్ అయినా ప్రకటించాలి’’

– పీఆర్టీయూ నేతలు శ్రీపాల్ రెడ్డి, కమలాకర్ రావు

గడువు పెంచడం అన్యాయం 

‘‘2018 జులై నుంచే అమలు కావాల్సిన పీఆర్సీని వాయిదా వేస్తూ పోవడం అన్యాయం. ప్రభుత్వం వెంటనే 45 శాతం ఫిట్​మెంట్ తో పీఆర్సీ ప్రకటించాలి. ఇప్పటికైనా అన్ని ఉద్యోగ, టీచర్,​ పెన్షనర్ల సంఘాలు ఒక్కటై ఉద్యమించాలి. న్యాయమైన పీఆర్సీ, సీఎం ఇచ్చిన ఇతర హామీలను నెరవేర్చుకునేందుకు పోరాడాలి”

– టీఎస్ యుటీఎఫ్ లీడర్లు జంగయ్య, చావ రవి

ఇట్లయితే ఎట్లా?

పీఆర్సీ కమిషన్ గడువు పెంపుపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో నాలుగు నెలలైతే రెండేండ్లు దాటిపోతుందని చెప్తున్నారు. పీఆర్సీ ఆలస్యం అవుతున్నందుకు కనీసం ఐఆర్ ఇవ్వాలని కోరుతున్నా సర్కారు పట్టించుకోవడం లేదని.. పైగా కమిషన్​ గడువును పెంచడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులు మంగళవారం ఉదయం నుంచి తమకు గ్యాప్ లేకుండా ఫోన్లు చేస్తున్నారని, సమాధానాలు చెప్పలేకపోతున్నామని ఉద్యోగ, టీచర్​ సంఘాల నేతలకు వాపోయారు. గడువు పెంచింది నివేదిక కోసం కాదని, కమిషన్ కు అప్పగించిన ఇతర పనుల కోసమని చెప్పినా ఉద్యోగులు నమ్మడం లేదని చెప్పారు. తమపై తీవ్ర ఒత్తిడి ఉందని, ఎంతో ఓపిక పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.

Latest Updates