లిక్కర్​తోనే ఖజానాకు కిక్కు!

telangana-government-focus-to-increase-state-revenue-with-liquor
  • ఆదాయం పెంచేందుకు సర్కారు ఫోకస్
  • అక్టోబర్ 1 నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ 
  • దరఖాస్తు ధరలు, లైసెన్స్ ఫీజు పెంచే చాన్స్
  • కొత్తగా 250 వైన్షాపులకు అనుమతిచ్చే అవకాశం
  • వచ్చే వారంలో తుది నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: లిక్కర్ అమ్మకాల ద్వారా వీలైనంత ఆదాయం రాబట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. అప్పులతో డీలాపడ్డ రాష్ట్ర ఖజానాకు కిక్కెక్కించేందుకు అదొక్కటే మార్గమని భావిస్తోంది. ప్రభుత్వానికి జీఎస్టీ తర్వాత మద్యం అమ్మకాల ద్వారానే అత్యధిక రాబడి సమకూరుతోంది. ఎక్సైజ్​ శాఖ నుంచి ప్రస్తుతం ఏడాదికి దాదాపు రూ. 20 వేల కోట్ల ఆదాయం వస్తోంది. ఈ రాబడిని వీలైనంత మేరకు పెంచే దిశగా సర్కార్​ కసరత్తు చేస్తోంది. రెండేండ్లకొకసారి ఎక్సెజ్​ పాలసీ అమల్లోకి వస్తుంది. ఇప్పుడు అమల్లో ఉన్న పాలసీ గడువు సెప్టెంబర్​ 30తో ముగుస్తుంది. అక్టోబర్​ 1 నుంచి కొత్త పాలసీ  అమల్లోకి వస్తుంది. కొత్త పాలసీ ఎలా ఉండాలనే దానిపై సీఎం కేసీఆర్​ ఇప్పటికే  ఉన్నతాధికారులకు గైడ్ లైన్స్​ ఇచ్చినట్లు తెలిసింది. వీటికి అనుగుణంగా రాష్ట్ర ఆదాయం మరింత పెంచేందుకు ఎక్సైజ్​ శాఖ ప్లాన్​ చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎక్సైజ్ ఆదాయం వ్యాట్ తో కలిపి  రూ. 21 వేల కోట్లకు చేరనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ఆదాయం మరింత పెరిగేలా కొత్త పాలసీ ఉంటుందని సీనియర్​ అధికారి ఒకరు తెలిపారు. కొత్త మద్యం షాపులకు అనుమతి ఇవ్వడం, దరఖాస్తు ధరతోపాటు, లైసెన్స్ ఫీజును పెంచటం ద్వారా  ఆదాయం పెంచుకునే మార్గాలున్నాయి. అదే కోణంలో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. త్వరలో సీఎంతో జరిగే సమీక్షలో తీసుకునే  నిర్ణయాల మేరకు ఆదాయం పెంపొందించేలా పాత పాలసీకి మెరుగులు దిద్దుతామని వారు చెబుతున్నారు.

సాధారణంగా పాలసీ గడవు 15 రోజుల్లో ముగిసేటప్పుడు కొత్త పాలసీకి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు కనీసం వారం సమయం ఇవ్వాలి. ఆన్ లైన్ దరఖాస్తు చేసుకున్నాక షాపుల కేటాయింపు లాటరీ ద్వారా చేస్తారు. షాపులను దక్కించుకున్నవారు అక్టోబర్​ 1 నుంచి కొత్త షాపులను నడుపుకుంటారు. సోమవారం నుంచి బడ్జెట్​ సమావేశాలు ప్రారంభమవుతుండటంతో.. ఇదే వ్యవధిలో న్యూ ఎక్సైజ్ పాలసీ ప్రకటించే అవకాశాలున్నాయి.

కొత్తగా 250  వైన్ షాపులు?

తెలంగాణ వచ్చాక కొత్త మద్యం షాపులకు అనుమతి ఇవ్వలేదు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2,216 వైన్ షాపులు ఉన్నాయి. చాలా ప్రాంతాల నుంచి కొత్త షాపులు కావాలంటూ నాయకులు, వ్యాపారవేత్తల నుంచి డిమాండ్ ఉంది. అదే సమయంలో రాష్ట్రంలో కొత్త మండలాలు ఏర్పడ్డాయి. మున్సిపాలిటీల పరిధి కూడా పెరిగింది. దీంతో కొత్త షాపులకు ఈసారి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం మండలానికి ఒక వైన్ షాపు మాత్రమే అనుమతి ఉంది. కొన్ని మండలాల్లో రెండు వైన్ షాపులు కావాలనే డిమాండ్ కూడా వస్తోంది. అయితే  కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో రాష్ట్రవ్యాప్తంగా  కొత్తగా 129 మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్కో కొత్త మండలానికి ఒక్కో వైన్ షాపు అనుమతి ఇచ్చినా  కొత్తగా 129  వైన్ షాపులు రానున్నాయి. కొత్తగా మున్సిపాలిటీలు వచ్చాయి. చాలా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధి పెరిగింది. అక్కడ కూడా కొత్త షాపులకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ ఉంది. హెచ్ఎండీఏ పరిధిలో కొత్తగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పడ్డాయి. కార్పొరేషన్ల పరిధితోపాటు జీహెచ్ఎంసీ పరిధి కలుపుకొని మరో వందకుపైగా కొత్త షాపులకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని బట్టి చూస్తే కొత్తగా సుమారు 250 వరకు కొత్త వైన్​షాపులకు అనుమతి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

లైసెన్స్, దరఖాస్తు ఫీజు పెంపు?

ఎక్సైజ్ ఆదాయం పెంచుకునేందుకు షాపుల లైసెన్స్ ఫీజును పెంచే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం నాలుగు శ్లాబుల విధానం అమల్లో ఉంది. మొదటి శ్లాబుకు రూ. 45 లక్షలు, రెండో శ్లాబుకు రూ. 50 లక్షలు, మూడో శ్లాబుకు రూ. 85 లక్షలు, నాలుగో శ్లాబుకు రూ. కోటీ 20 లక్షలు ఉంది. అన్ని శ్లాబుల ధరలను  పెంచే అవకాశం కనిపిస్తోంది. ఒక్కో శ్లాబు ఫీజును  15 నుంచి 30 శాతం వరకు వరకు పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అయితే మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని షాపులపై సర్కార్​  ఎక్కువగా దృష్టి పెట్టింది. అక్కడ కొత్త షాపులు ఇవ్వడంతోపాటు లైసెన్స్ ఫీజును కూడా పెంచే యోచన చేస్తోంది. ఇక షాపు దక్కించుకోడానికి చేసే దరఖాస్తు ధర కూడా పెంచనున్నారు. 2015–17లో  దరఖాస్తుకు రూ. 50 వేల ఫీజు ఉండగా..  గత పాలసీ సమయంలో ప్రభుత్వం ఈ ఫీజును డబుల్​ చేసింది. ఒక్కో దరఖాస్తుకు రూ. లక్ష చొప్పున వసూలు చేసింది. దీంతో అనూహ్యంగా దరఖాస్తుల ద్వారానే సర్కార్​కు రూ. 411 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి కూడా దరఖాస్తుల ఫీజును పెంచటం ద్వారా రెట్టింపు ఆదాయం వస్తుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

ఏపీలో మద్య నిషేధం అమలైతే.. మనకు లాభం!

పక్క రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో దశలవారీగా మద్య నిషేధం అమలు జరిగితే.. అంతమేరకు తెలంగాణ ఎక్సైజ్ ఆదాయం పెరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోంది. రెండు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల్లో ఏపీకి చెందిన వ్యాపారులే మద్యం వ్యాపారం సాగిస్తున్నారు. కొందరు ఇక్కడి పార్టనర్లతో వ్యాపారం చేస్తుండగా.. కొందరు ఇక్కడి వారి పేర్ల మీద షాపులు నడుపుతున్నారు. వారి వల్లనే సరిహద్దు జిల్లాల్లో ఎక్కువ మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఏపీ మద్య నిషేధం అమలు చేస్తే సరిహద్దు జిల్లాల వైన్ షాపులకు మరింత డిమాండ్ పెరుగుతుందని అధికారులు అంటున్నారు. ఏపీ వ్యాపారులు ఈసారి తెలంగాణలో ఎక్కువ షాపులను చేజిక్కించుకునేందుకు పోటీ పడుతారని వారు అభిప్రాయ పడుతున్నారు.

Telangana government focus to increase State revenue with Liquor

Latest Updates