మేడారంలో.. ఒక్క పనీ మొదలు కాలే!

  • మూడున్నర నెలల్లో మహా జాతర
  • దెబ్బతిన్న ప్రధాన రహదారులు
  • సీఎం వద్దే రూ.184 కోట్ల ప్రతిపాదనల ఫైల్‌‌

సమ్మక్క సారలమ్మ జాతర విజయవంతం కావాలంటే రోడ్లే ప్రధానం. రోడ్ల విస్తరణ సంగతి అటుంచితే గతంలో వేసిన రోడ్లే పూర్తిగా దెబ్బతిన్నాయి. తాడ్వాయి‒మేడారం, నార్లాపూర్‌‌‒మేడారం ప్రధాన రహదారులు గుంతలు పడ్డాయి. వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది.  ఆర్‌‌అండ్‌‌బీ శాఖ ఆధ్వర్యంలో రోడ్ల అభివృద్ధికి  రూ.14.20 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చిన్నబోయిన పల్లి నుంచి కొండాయి రోడ్డు విస్తరణకు రూ.8.40 కోట్లు, జీడీ వాగు నుంచి చిన్నబోయినపల్లి వరకు బీటీ రోడ్డుకు రూ.4.50 కోట్లు, ఇతర రోడ్లకు రూ.12.95 కోట్లతో ప్రతిపాదనలు పంపించినా ఒక్క పైసా విడుదల కాలేదు.

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు: మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు సమయం దగ్గర పడుతోంది. ఇంకా మూడున్నర నెలల గడువు మాత్రమే ఉంది. నాలుగు రోజుల జాతరకు దేశవ్యాప్తంగా కోటి మంది భక్తులు హాజరవుతారని అధికారుల అంచనా. మరోవైపు మేడారం పరిసరాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. అయినా ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క పనీ మొదలుపెట్టలేదు. రూపాయి నిధులు కూడా ఇవ్వలేదు.

జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు తాగునీరందించడానికి ప్రతి జాతరలో ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేస్తోంది. తాత్కాలిక సేవలు అందిస్తోంది. ట్యాంకర్ల ద్వారా లేదా చేతి పంపులు వేయడం, 2, 5 వేల లీటర్ల ప్లాస్టిక్‌‌ట్యాంక్‌‌లు ఏర్పాటు చేయడం వటి పనులు చేసేవాళ్లు. జాతర అయిపోగానే వాటిని తొలగించేవాళ్లు. ఈసారి జాతరలో పర్మినెంట్‌‌గా వాటర్ ట్యాంక్‌‌లు నిర్మించి భక్తులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని ఆర్‌‌డబ్ల్యుఎస్‌ ‌ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. చిలుకల గుట్ట సమీపంలోని ఎదురుకోళ్లు, తాడిచెట్లు, పోలీస్‌‌క్యాంప్‌‌ ఆఫీస్‌‌, రెడ్డి గూడెం, ఊరట్టం, భాషగూడెం, కన్నెపల్లి స్తూపం, శివరాంసాగర్‌‌, వనం రోడ్డు, కన్నెపల్లి, తిరుమల హాస్పిటల్‌‌, కొంగలమడుగు, నార్లాపూర్‌‌, చింతల్‌‌క్రాస్‌‌రోడ్డు వద్ద 500 కిలో లీటర్ల సామర్థ్యం గల 14 వాటర్‌‌ట్యాంక్‌‌లు, మేడారం జాతర పరిసరాలు మొత్తం కలిపి 16,400 మీటర్ల పైప్‌‌లైన్‌ ‌నిర్మాణానికి రూ.20.20 కోట్లతో ప్రతిపాదనలు పంపించింది. నిధులు మాత్రం రాలేదు.

అటకెక్కిన అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ

మేడారంలో శాశ్వత మరుగుదొడ్లు కొరవడ్డాయి. ఓ వైపు జాతర జరుగుతుంటే మరోవైపు అప్పటికప్పుడు భూమిలో గుంతలు తవ్వి బేసిన్లు వేసి తడకలు కట్టి అవే మరుగుదొడ్లుగా చూపించేవారు. జాతర అయిపోయాక తడకలు తీసేసి బేసిన్లపైనే  మట్టి పోసి పూడ్చేసి మమ అనిపించేవారు. ఈ సారి రూ.8.80 కోట్లతో 1,320 శాశ్వత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడానికి ఆర్‌‌డబ్ల్యుఎస్‌ ‌శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అయినా ఇప్పటి వరకు నయాపైసా మంజూరు కాలేదు. జంపన్నవాగు వద్ద మాత్రమే ఒక శాశ్వత మరుగుదొడ్డి కట్టించారు. లక్షలాది మంది భక్తులకు ఈ ఒక్కటి ఎలా సరిపోతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. మేడారంలో డ్రైనేజీ వ్యవస్థ సైతం సరిగా లేదు. భక్తులు ఉపయోగించిన నీరంతా రోడ్లపైనే పారుతుంది. జాతర ప్రాంగణంలో అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు గిరిజన సంక్షేమ శాఖ రూ. 6 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

ఈసారీ హడావుడి పనులేనా!

ప్రతి మహా జాతరకు రెండు, మూడు నెలల ముందు నిధులు కేటాయించడం.. హడావుడిగా పనులు చేయడం ప్రభుత్వానికి రివాజుగా మారింది. హడావుడి కారణంగా పనులు నాసిగా జరుగుతున్నట్లు ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ఇదివరకే నివేదించారు. జాతరకు కనీసం 6 నెలల ముందు నిధులు మంజూరు చేస్తేనే నిబంధనల ప్రకారం పనులు జరిగేలా చూడవచ్చని వివరించినా పట్టించుకునేవారే కరువయ్యారు.

సీఎం వద్దే  ఫైల్‌‌ పెండింగ్‌‌

మేడారంలో పలు శాశ్వత అభివృద్ధి పనుల కోసం వివిధ ప్రభుత్వ శాఖలు రూ.184 కోట్లతో ప్రతిపాదనలు పంపించాయి. ఇది జరిగి ఏడాదిన్నర అవుతోంది. అయినా సీఎం కేసీఆర్‌‌ నిధులు విడుదల చేయలేదు.

ఏడాదికే కొట్టుకుపోయిన రూ.4 కోట్ల చెక్‌‌డ్యాం

మేడారం జాతరలో జంపన్నవాగుకు ప్రత్యేక స్థానం ఉంది. జాతరకు వచ్చే ప్రతి భక్తుడు ఈ వాగులో స్నానం చేసి అమ్మవార్లను దర్శించుకోవడానికి వెళతారు. జాతర సమయంలో మోకాలు లోతు నీటిని నిల్వ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జంపన్నవాగులో మూడు చోట్ల రూ.12 కోట్లతో 3 చెక్‌‌ డ్యాంలు నిర్మించింది. ఇవి పూర్తయ్యి ఇంకా ఏడాది కూడా కాలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు రూ.4 కోట్ల విలువ చేసే చెక్‌‌ డ్యాం ఒకటి కొట్టుకుపోయింది. ఒక వైపు సీసీ చేసి రెండో వైపు సీసీకి బదులు మట్టితో కట్టడంతో చెక్‌‌డ్యాం కొట్టుకుపోయినట్లు రైతులు చెబుతున్నారు. రైతులకు సంబంధించిన 3 ఎకరాల భూములు కూడా పూర్తిగా దెబ్బతిని రూ.20 లక్షల నష్టం వాటిల్లింది.

భూ సేకరణకు నిధులేవీ?

మేడారం జాతరలో జంపన్నవాగు, నార్లాపూర్‌‌, ఊరట్టం వద్ద 553.35 ఎకరాల స్థల సేకరణకు రూ.43.78 కోట్లు, ఆర్‌‌డబ్ల్యూఎస్‌‌, పంచాయతీరాజ్‌‌, దేవాదాయ, విద్యుత్‌‌, శానిటేషన్‌‌విభాగాలకు అవసరమైన భూసేకరణకోసం రూ.2 కోట్లు అవసరమని రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు పంపించింది. ఇటీవల హైదరాబాద్‌‌లో జరిగిన రివ్యూ మీటింగ్‌‌లో భూసేకరణ కోసం రూ.10 కోట్లు విడుదల చేస్తామని రాష్ట్ర మంత్రులు దయాకర్‌‌రావు, ఇంద్రకరణ్‌‌రెడ్డి అధికారులకు తెలిపారు. ఆ నిధులు ఇంకా విడుదల కాకపోవడంతో భూసేకరణ కూడా పెండింగ్‌‌లో పడింది.

పాడైపోయిన ఊరట్టం కాజ్‌‌వే వంతెన

మహారాష్ట్ర, చత్తీస్‌‌గఢ్‌‌రాష్ట్రాల నుంచి మేడారానికి భక్తులు చేరుకోవడానికి దశాబ్దం క్రితం జంపన్నవాగులో ఊరట్టం దగ్గర కాజ్‌‌వే వంతెన నిర్మించారు. జాతర సమయంలో వాహనాలన్నీ ఈ రోడ్డు వెంటే మేడారం చేరుకుంటాయి. ఆరేళ్ల క్రితం 30  మీటర్ల దూరం కాజ్‌‌వే దెబ్బతింది. నీటిలో కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు ఆగిపోయాయి. ఈ కాజ్‌‌వే దాటితే కేవలం కి.మీ. ప్రయాణిస్తే మేడారం చేరుకుంటారు. అలాంటిది భక్తులు ఇప్పుడు 10 కి.మీ. దూరం చుట్టూ తిరిగి రావాల్సి వస్తోంది. సంవత్సరాలు గడుస్తున్నా దీన్ని రిపేర్‌‌ చేద్దామనే ధ్యాస ప్రభుత్వానికి లేకుండా పోయింది.

Latest Updates