
- పదేండ్లలో బీఆర్ఎస్ చేసింది రూ.11 వేల కోట్లే
- ఈనెల 30 లోపు రైతు భరోసా నిధులు వేస్తం
- రుణమాఫీపై చర్చలో వ్యవసాయ మంత్రి తుమ్మల వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రైతులకు తమ ప్రభుత్వం ఒకేసారి రూ.20 వేల కోట్ల రుణమాఫీ చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది రూ.11 వేల కోట్లేనని, అదికూడా విడతల వారీగా చేశారని ఆయన గుర్తుచేశారు. రైతు రుణమాఫీపై అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య సోమవారం చర్చ కొనసాగింది.
బడ్జెట్ పద్దుల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడారు. ‘‘రూ.20 వేల కోట్ల రుణమాఫీ చేశామని అంటున్నారు. అర్హత కలిగిన రైతులు ఇంకా ఉన్నారు. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలి” అని పేర్కొన్నారు. మంత్రి తుమ్మల స్పందిస్తూ.. రాష్ట్రంలో ఏకకాలంలో రూ.20 వేల కోట్లు రుణమాఫీ చేశామన్నారు.
అలాగే, ఈనెల 30 లోపు రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమచేస్తామని తెలిపారు. ఇందు కోసం రూ.33 వేల కోట్లు సిద్ధం చేశామని వెల్లడించారు. ‘‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల రుణమాఫీ ఎగ్గొడితే .. మేం పూర్తి చేశాం. రైతులను దగాచేసిన వాళ్లు, ముంచిన వాళ్లు రుణమాఫీ గురించి మాట్లాడితే ప్రజలు అసహ్యించుకుంటరు. ప్రజల్లో అపహాస్యం పాలవుతారు” అని తుమ్మల పేర్కొన్నారు.
అప్పుల ఊచిలో రాష్ట్రం: పాయల్ శంకర్
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా గత బీఆర్ఎస్ హయాంలో సీఎంవోలో పనిచేసిన అధికారులు 200 కి.మీ దూరం కూడా హెలిక్యాప్టర్ లో వెళ్లారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ దుయ్యబట్టారు. ‘‘రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో సంక్షేమ పథకాలు ఎట్లా ఇస్తరు? పాలకులు రాష్ట్ర సంపద పెంచాలి.
భూములు అమ్మడానికి పాలకులు అక్కర్లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉంటే సరిపోతుంది” అని శంకర్ అన్నారు. దీనికి మంత్రి శ్రీధర్ బాబు కలగజేసుకుని కేంద్రం అన్ని రంగాలను ప్రైవేటీకరించాలని చూస్తున్నదని, ఇప్పటికే ఎల్ఐసీని ప్రైవేటుపరం చేసిందన్నారు. కేంద్రం చేస్తే కరెక్ట్, రాష్ట్రం చేస్తే తప్పు అనే ధోరణి సరికాదన్నారు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామని కౌంటర్ ఇచ్చారు.
బీసీలను మోసం చేస్తే ఏ ప్రభుత్వమూ మనగడ సాధించదు
తొమ్మిదేండ్లుగా బీసీ కార్పొరేషన్లు మూతపడ్డాయని, బీసీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించిన చెక్కులు చెల్లలేదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఫెడరేషన్లు, కార్పొరేషన్ల పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ బీసీలను మోసం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. బీసీలను మోసం చేసిన ఏ ప్రభుత్వమూ మనుగడ సాధించలేదని హెచ్చరించారు.
బీసీలు నడుపుతున్న కాలేజీలకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వాలని కోరారు. మైనారిటీ కాలేజీలకు నిధులు విడుదల చేశారని, ఆ వివరాలు తన వద్ద ఉన్నాయన్నారు. మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ.. గతేడాది కూడా అన్ని కాలేజీలకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చామని చెప్పారు.
కాగా.. ఆదిలాబాద్ లో ఎయిర్స్ ఫోర్స్ స్టేషన్ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాస్తే స్పందించలేదని, కాంగ్రెస్ సర్కారు సహకరించాలని పాయల్ కోరారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కలగజేసుకుని ‘‘గతంలో కేసీఆర్ ప్రధానిని కలవకపోవడంతో నిధులు విడుదల చేయలేదు. ఇప్పుడు మేం ఇన్నిసార్లు కలిసినా కేంద్రం నుంచి నిధులు రావడం లేదు. మీరు (బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు) కేంద్రంతో కొట్లాడి నిధులు తీసుకురండి” అని కౌంటర్ ఇచ్చారు.