
- నష్టాల పేరుతో లీజుకిచ్చేస్తున్న రాష్ట్ర సర్కార్
- ఇప్పటికే 20 హోటళ్లు ప్రైవేటుపరం
- మరో 40 హోటళ్లు, కాటేజీలు ఇచ్చేందుకు రెడీ
- రోడ్డున పడతామంటున్న హోటళ్ల సిబ్బంది
హైదరాబాద్, వెలుగు: కేంద్రం ప్రభుత్వం రూ. కోట్లు పెట్టి కట్టించిన హరిత హోటళ్లు, కాటేజీలు, డార్మెటరీలను ప్రైవేటుపరం చేసేందుకు రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ రంగం సిద్ధం చేసింది. గతంలో 20 హోటళ్లను ప్రైవేట్‌కు లీజుకిచ్చిన టూరిజం అధికారులు మరో 40 హోటళ్లు, కాటేజీలు, డార్మెటరీలను లీజుకు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఏడాది క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నా లాక్ డౌన్, కరోనా కారణంగా హోటళ్లు మూతపడటంతో తాత్కాలికంగా వాయిదా వేశారు. హోటళ్లు తెరుచుకోవడం, పర్యాటకుల రాక పెరగడంతో ప్రతిపాదనను మళ్లీ తీసుకొచ్చారు.
కట్టించింది కేంద్రం.. లీజుకిస్తోంది రాష్ట్రం
రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్ టీడీసీఎల్)ను ఏర్పాటు చేసింది. కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినా పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర సర్కారు పైసా కూడా కేటాయించలేదు. స్వదేశీ దర్శన్ స్కీమ్‌లో భాగంగా తెలంగాణ ట్రైబల్ సర్క్యూట్(ములుగు జిల్లా – రూ. 83 కోట్లు), తెలంగాణ ఎకో టూరిజం సర్క్యూట్ (మహబూబ్‌నగర్ – రూ.91 కోట్లు), తెలంగాణ హెరిటేజ్ సర్క్యూట్ (హైదరాబాద్ – రూ. 99 కోట్లు)కు కేంద్రం నిధులు కేటాయించింది. వీటితో ఆయా జిల్లాల్లో టూరిస్ట్ స్పాట్లను డెవలప్ చేశారు. కాటేజీలు, డార్మెటరీలు, హోటళ్లను కట్టారు. దీంతో పర్యాటకుల సంఖ్య కూడా పెరిగింది. ఆయా ప్రాంతాల్లో స్థానికంగా వ్యాపారాలూ ఊపందుకున్నాయి. హోటల్ బిజినెస్ మరింత పెరిగింది. హరిత హోటళ్లు, కాటేజీలు లాభాల్లో నడవాల్సి ఉండగా నష్టాల్లో కూరుకుపోతున్నాయి. ఆ పేరుతో వాటిని ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలని చూస్తున్నారు. సామాన్య టూరిస్టులకు వసతి, భోజనాలకు కేంద్రం హోటళ్లు కడితే రాష్ట్రం వాటి నిర్వహణను ప్రైవేట్‌కు అప్పగించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
మెయింటెనెన్స్ లోపమే కారణమా?
ఇన్ని రోజులు నష్టాల్లో నడిచిన హోటళ్లు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లగానే లాభాల బాట పట్టడంపై అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపమే నష్టాలకు కారణమని తెలుస్తోంది.
అన్ని హోటళ్లు ప్రైవేట్‌కు..
రాష్ట్రంలో ములుగు జిల్లాలోని రామప్ప, లక్నవరం, జంగాలపల్లి, గట్టమ్మ ఆలయం, గణపురం, మేడారం, పాకాల, తాడ్వాయి, మల్లూరు, హన్మకొండ (హరిత కాకతీయ), నాగర్ కర్నూల్ జిల్లాలోని సోమశిల, ఈగలపెంట, అలంపూర్ (జోగులాంబ గద్వాల)తో పాటు బాసర, నిజామాబాద్, వైరా, కొండగట్టు, వేములవాడ, ధర్మపురి, కడెం, జెన్నారం, భద్రాచలం, వైరా, నాగార్జున సాగర్, సూర్యాపేట, కొత్తకొండ, వికారాబాద్, ప్రజ్ఞాపూర్, కీసర, సింగూరు, ఏడుపాయల, శామీర్‌పేట, సింగోటం తదితర ప్రాంతాల్లో టూరిజం హోటళ్లు, కాటేజీలు ఉన్నాయి. హైదరాబాద్‌లోనూ గోల్కొండ (తారామతి), బేగంపేట (టూరిజం ప్లాజా), చిలుకూరు, సికింద్రాబాద్ (యాత్రి నివాస్), ట్యాంక్ బండ్, దుర్గం చెరువు, గండిపేట, నాచారంలలో టూరిజం హోటళ్లున్నాయి. వీటిలో యాత్రి నివాస్, గండిపేట హరిత రిసార్ట్ ఫైవ్ స్టార్ హోటళ్లు బీవోటీ పద్ధతిలో 33 ఏళ్ల దీర్ఘకాల లీజులో నడుస్తున్నాయి. వీటితోపాటు హైదరాబాద్ జిల్లాలో 7, సిద్దిపేట, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో రెండు హోటళ్ల చొప్పున ప్రైవేటుకు లీజుకిచ్చారు. వీటితోపాటు ములుగు జిల్లాలోని జంగాలపల్లి, తాడ్వాయి హోటళ్లు, సూర్యాపేటలోని హరిత హోటల్‌ను కూడా లీజుకిచ్చారు. త్వరలో మిగతావీ ప్రైవేటుకు ఇవ్వబోతున్నారు.