డ్యూటీలకు ఎగ్గొట్టిన ఫలితం: 79 మంది డాక్టర్లను తీసేశారు

చెప్పకుండా తరచూ డ్యూటీలకు ఎగ్గొట్టిన ఫలితం

సమాచారమివ్వకుండా తరచూ డ్యూటీలకు రాని 79 మంది స్పెషలిస్ట్‌‌ డాక్టర్లపై వేటు పడింది. వారందర్నీ జాబుల్లోంచి తీసేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులిచ్చింది. డుమ్మాలు కొడుతున్నారనే కారణంతో ఇంత మందిని ఒకేసారి ఉద్యోగాల్లోంచి తీసేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే ఫస్ట్‌‌టైం. రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌‌ పరిధి హాస్పటల్స్‌‌ పన్జేస్తూ చెప్పకుండా డ్యూటీలకు రాని 134 మంది డాక్టర్లకు జూన్‌‌లో ప్రభుత్వం నోటీసులిచ్చింది. వీటికి స్పందించని 91 మంది డాక్టర్ల పేర్లు, గైర్హాజరు వివరాలతో 12న అధికారులు గెజిట్ రిలీజ్‌‌ చేశారు. అదేరోజు రెండోసారి నోటీసులిచ్చి19 వరకు వివరణకు టైమిచ్చారు. అయితే 79 మంది నుంచి స్పందన రాలేదు. దీంతో వాళ్లను జాబుల్లోంచి తీసేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

దూర ప్రాంతాల్లో పోస్టింగ్స్‌‌ వల్లే..

గతేడాది ఉమ్మడి మహబూబ్‌‌నగర్‌‌‌‌, కరీంనగర్‌‌‌‌, ఆదిలాబాద్‌‌, నిజామాబాద్‌‌, మెదక్‌‌, ఖమ్మం జిల్లాల్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రుల్లో వీరికి పోస్టింగ్ ఇచ్చారు. అయితే, కౌన్సిలింగ్ చేపట్టకుండా, సొంత జిల్లాలకు కాకుండా సుదూర ప్రాంతాల్లో పోస్టింగ్స్‌‌ ఇచ్చారన్న ఆరోపణలున్నాయి. వీరిలో కొందరు డాక్టర్లు ట్రాన్స్‌‌ఫర్ల కోసం ఉన్నతాధికారుల చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదు. దీంతో కుటుంబాలకు దూరంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండలేక కొందరు, సీహెచ్‌‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో సదుపాయాల్లేక మరికొందరు డ్యూటీలకు వెళ్లడం లేదు. స్పెషలైజేషన్ చేసిన తమను కేవలం ఓపీ, షిఫ్ట్ డ్యూటీలకు పరిమితం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తూ ఇంకొందరు డ్యూటీలకు బంద్‌‌ పెట్టారు. వీరిపైనే ప్రభుత్వం ఇప్పుడు చర్యలు తీసుకుంది.

త్వరలో మరో లిస్ట్‌‌

డాక్టర్ల తొలగింపు ఇంతటితో ముగియలేదని టీవీవీపీ అధికారులు చెబుతున్నారు. రోజుల తరబడి డ్యూటీలకు డుమ్మా కొడుతున్న మరికొందరు డాక్టర్లను సైతం గుర్తించామని వీరికి కూడా త్వరలోనే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామన్నారు.

Latest Updates