క‌రోనా క‌ట్ట‌డిలో స‌ర్కార్ చేతులెత్తేసింది: దిల్‌సుఖ్‌న‌గ‌ర్ వ‌స్త్ర‌ వ్యాపారులు

  • సెల్ఫ్ లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన దిల్‌సుఖ్ న‌గ‌ర్ వెంకటాద్రి మార్కెట్ వస్త్ర వ్యాపారులు

క‌రోనా వైర‌స్ వ్యాప్తి కట్ట‌డిలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింద‌ని, ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేసి చేతులెత్తిసిందని దిల్‌సుఖ్‌న‌గ‌ర్ వెంకటాద్రి మార్కెట్ అసోసియేషన్ వస్త్ర వ్యాపారులు ఆరోపించారు. స్వీయ నియంత్ర‌ణ పాటించ‌డం ద్వారానే మ‌న‌ల్ని మ‌నం కాపాడుకోగ‌లుగుతామ‌ని చెప్పారు. సిటీలో వైర‌స్ వ్యాప్తి తీవ్ర‌మ‌వుతున్న నేప‌థ్యంలో సోమ‌వారం నుంచి సెల్ఫ్ లాక్‌డౌన్ పాటించాల‌ని నిర్ణ‌యించామ‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా మార్కెట్‌లోని వ‌స్త్ర దుకాణాల‌ను మూసేసిన వ్యాపారులు.. మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తున్న నేప‌థ్యంలో కస్టమర్లు, తమ కుటుంబాల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాపారం భారీగా న‌ష్ట‌పోతామ‌ని తెలిసీ సెల్ఫ్ లాక్‌డౌన్ పాటించాల‌ని నిర్ణ‌యించుకున్నామ‌ని తెలిపారు. రాష్ట్రంలో కరోనా కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టక పోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం కరోనా టెస్టులు పెంచ‌డంలో, మెరుగైన వైద్యం అందించ‌డంలో అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని అన్నారు. చెస్ట్ హాస్పిటల్‌లో క‌రోనాతో మ‌ర‌ణించే ముందు యువ‌కుడు తీసిన సెల్ఫీ వీడియోనే ప్ర‌భుత్వ నిర్లక్ష్యానికి నిద‌ర్శ‌న‌మ‌ని వారు చెప్పారు. హైదరాబాద్‌లో అన్ని వ్యాపార వర్గాలు సెల్ఫ్ లాక్ డౌన్‌కు వెళుతున్నా.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పరంగా లాక్ డౌన్ విధించక పోవడం ఏమిటని ప్రశ్నించారు.
ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని, అనవసరంగా రోడ్లపైకి వచ్చి క‌రోనా బారిన పడొద్దని సూచించారు. రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ ఇప్ప‌టికైనా మేలుకుని గ‌చ్చిబౌలిలోని టిమ్స్‌లో క‌రోనా చికిత్స‌క‌కు వైద్య బృందాన్ని నియ‌మించి, బాధితుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని కోరారు.