తెలంగాణ: ఫేక్ పీహెచ్​డీలపై సర్కార్ నజర్​

    జేఎన్టీయూ పరిధిలో 2,500 వరకు పీహెచ్​డీ ఫ్యాకల్టీ

    మరోసారి వివరాలు సేకరిస్తున్న యూనివర్సిటీ

    12 వరకూ ఒరిజినల్ డిగ్రీతో పాటు వివరాలివ్వాలని ఆదేశం

నకిలీ పీహెచ్ డీ హోల్డర్లను గుర్తించే పనిలో రాష్ర్టంలోని యూనివర్సిటీలు నిమగ్నమయ్యాయి. వివిధ కాలేజీల్లో పనిచేస్తున్న పీహెచ్​డీ ఫ్యాకల్టీ వివరాలను సేకరిస్తున్నాయి. ఇప్పటికే వివిధ రాష్ర్టాల వర్సిటీల నుంచి డిగ్రీలు పొందిన ఫ్యాకల్టీ వివరాలు సేకరించిన జేఎన్​టీయూ, తాజాగా పీహెడ్ డీ హోల్డర్లందరినీ, ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు పలు వివరాలు పంపించాలని ఆదేశించింది. దీనికి ఈ నెల12 వరకు గడువు విధించింది. దీంతో నకిలీ పీహెచ్​డీ పట్టాలతో పనిచేస్తున్న సిబ్బందిలో భయం మొదలైంది.

ఫేక్ పీహెచ్ డీ ఆరోపణలపై మరోసారి విచారణ

జేఎన్టీయూహెచ్​ పరిధిలో రాష్ర్టవ్యాప్తంగా 300 వరకూ వివిధ వృత్తివిద్య కాలేజీలు ఉన్నాయి. వర్సిటీ పరిధిలో సుమారు 80వేల మంది ఫ్యాకల్టీ రిజిస్టర్ అయి ఉన్నారు. వీరిలో 50 వేల మంది వివిధ కాలేజీల్లో పని చేస్తున్నారు. ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం కాలేజీల్లో భారీ సంఖ్యలో పీహెచ్ డీ ఫ్యాకల్టీ అవసరం. కానీ వర్సిటీలు కొంత మినహాయింపు ఇవ్వడంతో తక్కువ మంది ఫ్యాకల్టీతోనే ప్రైవేటు కాలేజీలు రన్ అవుతున్నాయి. జేఎన్​టీయూ పరిధిలోని వివిధ కాలేజీల్లో సుమారు 2,500 వరకూ పీహెచ్​డీ పట్టాలు పొందిన టీచింగ్ ఫ్యాకల్టీ కొనసాగుతున్నారు. వీరిలో కొంతమంది గుర్తింపులేని ప్రైవేటు, డీమ్డ్ వర్సిటీల నుంచి పీహెచ్​డీలు పొందారనే ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి. గతంలో అలాంటి కొంతమందిని గుర్తించిన వర్సిటీ.. వారిని తొలగించింది. రెండు నెలల కిందట కూడా ప్రైవేటు, డీమ్డ్ వర్సిటీల నుంచి పట్టాలు పొందిన సుమారు 320 మంది ఫ్యాకల్టీని వర్సిటీ విచారించింది. వీరిలో 80 మంది వరకు ఫేక్​ పీహెచ్ డీ లని ప్రాథమికంగా గుర్తించారు. అధికారులు వాటిని మరోసారి విచారిస్తున్నారు.

 ఫ్యాకల్టీ సర్టిఫికెట్ల పరిశీలన

వర్సిటీ పరిధిలో పనిచేస్తున్న సుమారు 2,500 మంది పీహెడ్ డీ పట్టా ఉన్న ఫ్యాకల్టీ సర్టిఫికెట్లను పరిశీలించాలని జేఎన్టీయూ నిర్ణయించింది. దీంట్లో భాగంగా ఈ నెల 7 నుంచి 12 వరకూ పీహెచ్​డీకి సంబంధించిన 34 అంశాలను అప్​లోడ్​ చేయాలని ఫాకల్టీని ఆదేశించింది. ఫ్యాకల్టీ వ్యక్తిగత ప్రొఫైల్​లో లాగిన్​అయి, ఏ యూనివర్సిటీ నుంచి పీహెచ్ డీ పొందారు, జర్నల్స్ ఎన్ని పబ్లిష్ అయ్యాయి, థీసిస్ తోపాటు ఇతర వివరాలు ఇవ్వాలని, ఒరిజినల్ సర్టిఫికెట్లను స్కాన్ చేసి సబ్ మిట్ చేయాలని సూచించింది.

Latest Updates