సూర్యాపేట జిల్లాలో ఇంకో పవర్ ప్లాంట్!

రూ.2,160 కోట్ల అంచనా వ్యయం

హైదరాబాద్‌‌, వెలుగు: సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం వెల్లటూరులో 300 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని మెక్వెల్ కంపెనీ ప్రతిపాదించింది. ఒక్కొక్కటి 150 మెగావాట్లతో రెండు యూనిట్లు నిర్మించేందుకు ఈ కంపెనీ రెడీ అయింది. ఇప్పటికే డీపీఆర్ కూడా సిద్ధం చేసింది. 332 ఎకరాల్లో రూ.2,160 కోట్ల అంచనా వ్యయంతో ప్లాంట్​ను నిర్మించేందుకు ప్రపోజల్ పెట్టింది. డీపీఆర్ ను రాష్ట్రస్థాయి పర్యావరణ ప్రభావ మదింపు అథారిటీకి సమర్పించింది. దీన్ని తర్వాత పర్యావరణ క్లియరెన్స్‌‌ కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు. ఈ థర్మల్ ప్లాంట్​లో ఉత్పత్తి అయిన కరెంట్ మొత్తం తెలంగాణ రాష్ట్ర అవసరాల కోసమే వాడుకోనున్నారు. పులిచింతల హైడల్ డ్యామ్ ప్రాజెక్టు వద్ద

ఉన్న 220 కేవీ సబ్‌‌స్టేషన్‌‌ ద్వారా ఈ పవర్​ను రాష్ట్ర అవసరాల కోసం ఉపయోగిస్తారు. అనుమతులు వచ్చిన 27 నెలల్లోనే మొదటి దశ ప్రాజెక్టును పూర్తి చేస్తారు. తర్వాత మూడు నెలల వ్యవధిలో రెండో దశ ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గును సింగరేణి కాలరీస్, ఇతర సంస్థల ఏడాదికి 2.01 మిలియన్ టన్నులను కొనాలని ప్రతిపాదించారు. బొగ్గు రవాణాకు సింగరేణి నుంచి మేళ్లచెర్వు రైల్వేస్టేషన్ ద్వారా ప్రత్యేకంగా లైన్ వేయాల్సి ఉంటుంది.

Latest Updates