సీఏఏలో ఈ రెండు మార్పులు చేస్తే ఓకే: అసెంబ్లీ తీర్మానం పూర్తి కాపీ ఇదే

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరుల రిజస్టర్ (ఎన్నార్సీ), జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీఆర్)లకు వ్యతిరేకంగా సోమవారం నాడు తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. దేశ వ్యాప్తంగా ఎన్నార్సీ చేపట్టే ప్రయత్నంలో భాగమే సీఏఏ అని సభ అభిప్రాయపడింది. ‘భారత దేశం కుల మతాలకు అతీతమైన లౌకిక రాజ్యం. చట్టం ముందు అందరూ సమానమన్నది మన రాజ్యాంగంలోని మౌలిక సూత్రం. కానీ దీనికి భంగం కలిగించేలా పౌరసత్వానికి మతంతో ముడిపెడుతూ కేంద్రం పౌరసత్వ చట్టాన్ని సవరించింది. ఈ చర్య భారత దేశ మూల సూత్రాన్ని, రాజ్యాంగ నిర్మాతలను అవమానపరచడమే’ అని తీర్మానంలో రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. మన పౌరసత్వంలోని లౌకక వాదాన్ని ఉల్లంఘించడం ద్వారా దేశాన్ని మతరాజ్యంగా మార్చే ప్రయత్నం జరుగుతోందని, దీనిని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని పేర్కొంది. సీఏఏలో మతం, విదేశాలకు సంబంధించి ఉన్న నిబంధనలను తీసేస్తూ ఈ చట్టాన్ని మళ్లీ సవరిస్తే అందరికీ ఆమోదయోగ్యమని అభిప్రాయపడింది.

ఆ రెండింటినీ కలిపి చూడాలి

సీఏఏ, ఎన్పీఆర్‌లను కలిపి చూడాలని, దేశంలోని ప్రజలంతా జనాభా రిజిస్టర్‌లో నమోదు సందర్భంగా తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోందని ఆందోళన వ్యక్తం చేసింది తెలంగాణ సర్కారు. దేశంలోని ప్రజలు ప్రూప్స్ చూపించకపోతే పౌరసత్వాన్ని కోల్పోతామన్న భయందోళనలో ఉన్నారని, దేశ వ్యాప్తంగా, తెలంగాణలోనూ దీనికి వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు తెలియజేస్తున్నారని పేర్కొంది. ‘జాతీయ పౌరుల రిజిస్టర్ రూపొందించేందుకు ఎన్పీఆర్ తొలి అడుగని కేంద్ర హోం శాఖ గత ఏడాదిలోనే చెప్పింది. ఎన్నార్సీ అమలు వల్ల అస్సాం సహా దేశ వ్యాప్తంగా తమ పౌరసత్వం కోల్పోయే ముస్లిమేతరులకు మళ్లీ సీఏఏ ద్వారా ఆశ్రయం కల్పించాల్సి వస్తుంది. అందువల్ల మతంతో సంబంధం లేని భారత పౌరసత్వ స్వభావాన్ని ప్రాథమికంగా మార్చి బహీనపరిచే ప్రయత్నంగానే దీన్ని చూడాలి. అలాగే ఎన్పీఆర్ కోసం భారత ప్రజలే తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి తలెత్తుతోంది. దీని వల్ల ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రజల భయాన్ని తొలగించేందుకు మతం, విదేశాలకు సంబంధించిన నిబంధనలను తీసేస్తూ సీఏఏను మరోసారి సవరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం’ అంటూ తెలంగాణ ప్రభుత్వం తీర్మానంలో పేర్కొంది.

అలాగే ప్రజల పౌరసత్వ రిజిస్టర్ నుంచి తొలగించే ఎన్పీఆర్, ఎన్నార్సీల నుంచి తెలంగాణ ప్రజలను కాపాడటానికి అవసరమైన చర్యలను తీసుకోవాల్సిందిగా సభ ప్రభుత్వాన్ని కోరింది.

ఈ తీర్మానానికి సంబంధించిన పూర్తి కాపీ…

Latest Updates