విద్యుత్‌ ఉద్యోగుల విభజన: కూసోవెట్టి జీతాలు!

రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు కొంత మందికి కూర్చొబెట్టి జీతాలిస్తున్నాయి. ఒక్కో ఉద్యోగి ఏ పనీ చేయకుండా నెల నాడు సంతకం పెట్టి శాలరీ తీసుకుంటున్నారు. ఒక్కనెలా రెండు నెలలు కాదు.. ఏకంగా నాలుగేళ్లుగా ఇది కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాలు విడిపోయి ఐదేళ్లైంది. ఇప్పటికీ విద్యుత్‌ ఉద్యోగుల విభజన కొలిక్కి రాలేదు. 2015 జూన్‌ 10న ఆంధ్రా స్థానికత ఉన్న 1,274 మంది విద్యుత్‌ ఉద్యోగులను తెలంగాణ విద్యుత్‌ సంస్థలు (ఎస్‌పీడీసీఎల్‌, ఎన్‌పీడీసీఎల్‌, ట్రాన్స్ కో, జెన్‌కో) రిలీవ్‌ చేశాయి. వీరిని తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు రాలేదు. దీంతో వీరంతా హైకోర్టును ఆశ్రయించారు. విషయం తేలేవరకు వీరి శాలరీలను తెలంగాణ ప్రభుత్వమే భరించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. 1274 మందిలో రిటైర్మెంట్స్‌, వివిధ కారణాలతో జాబ్‌కు దూరమైన వారు పోను 1,157 మంది మిగిలారు. అప్పటి నుంచి వీరిందరికీ తెలంగాణ విద్యుత్‌ సంస్థలే జీతాలిస్తున్నాయి. గత 47 నెలలుగా వీరంతా ఇలా సంతకంపెట్టి అలా లక్షలాది రూపాయల జీతం తీసుకుంటున్నారు.

ఒక్క దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలో పరిధిలోనే ఇలాంటి ఉద్యోగులు 302 మంది ఉన్నారు.  వీరిలో ఏఈలు 140 మంది, ఏడీఈలు 72, డీఈలు 33,  సీజీఎంలు ముగ్గురు ఉన్నారు. ఒక్కో అధికారి జీతం లక్షన్నర నుంచి 3 లక్షల వరకు ఉంది. ఇలా 1,157 మందికి శాలరీల రూపంలో చెల్లించింది వెయ్యికోట్లపైనే ఉంటుందని అంచనా.

పరోక్షంగా రూ. 5వేల కోట్ల నష్టం
ఒక ఉద్యోగి నెలకు రూ.10,000 వేతనం తీసుకుంటున్నాడంటే దానికి కనీసం ఐదు రెట్లు.. రూ.50 వేల విలువైన ఉత్పత్తిని లేదా ఆదాయాన్ని సంస్థకు అందించాలని వేతన కమిటీ రూల్స్‌ చెబుతున్నాయి. ఏపీ స్థానికత ఉన్న  ఉద్యోగులకు తెలంగాణ విద్యుత్‌ సంస్థలు నెలకు రూ.18 కోట్లకుపైగా శాలరీలు చెల్లిస్తున్నాయి. అంటే దానికి  సంస్థ రూ.90 కోట్లు ఆదాయం పొందాలి. అంటే వేతనాలు, ఆదాయం కలుపుకుంటే విద్యుత్‌ సంస్థలకు నెలకు రూ.108 కోట్లు నష్టమనే చెప్పాలి. ఇది 47 నెలలకు లెక్కిస్తే రూ.5000 కోట్ల ఆదాయాన్ని విద్యుత్‌ సంస్థలు కోల్పోయినట్లవుతోందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.

ఇక్కడే పీటముడి
ఏపీ స్థానికత ఉద్యోగులకు తెలంగాణ విద్యుత్‌ సంస్థలు నెలనెలా జీతాలిస్తున్నప్పటికీ పోస్టింగ్స్‌ ఇవ్వలేదు. దీంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టు జస్టిస్‌ ధర్మాధికారి అధ్యక్షతన ఏకసభ్య కమిటీ వేసి ఆరు నెలల్లో సమస్య పరిష్కరించాలని సూచించింది. పలు దఫాలుగా రెండు రాష్ట్రాల సంస్థల అధికారులతో ఈ కమిటీ విచారణ జరిపి ఏ రాష్ట్రంలో పనిచేస్తారో ఆ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాలని ఉద్యోగులందరికీ ఆఫ్షన్‌ ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు 1,157 మంది ఉద్యోగులకే పరిమితం చేసిందని, ఇప్పుడు అందరికీ ఆఫ్షన్‌ ఇవ్వడమేంటని తెలంగాణ విద్యుత్‌ సంస్థలు, ఉద్యోగ సంఘాలు అభ్యంతరం చెబుతున్నాయి. దీనిపై తెలంగాణ విద్యుత్‌ సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది.  మే 26న ధర్మాధికారి మరోమారు సమావేశం కానున్నారు.

ఏపీ నిర్వాకం వల్లే..
– శివాజీ, అధ్యక్షుడు, తెలంగాణ విద్యుత్‌ ఇంజినీర్ల సంఘం

Latest Updates