మహిళా ఇన్నోవేషన్ కోసం తెలంగాణ-గుజరాత్ రాష్ట్రాల మధ్య అవగాహన ఒప్పందం

మహిళ ఇన్నోవేషన్ కు మరింత చేయూతనిచ్చేందుకు తెలంగాణ మరియు గుజరాత్ రాష్ట్రాలు ఒక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ మేరకు రెండు రాష్ట్రాల్లోని మహిళా స్టార్టప్ల కి చేయూతనిచ్చేందుకు తెలంగాణ ఆధ్వర్యంలోని వీ-హబ్ గుజరాత్ లోని ఐ-హబ్ లు ఈరోజు ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా ఇరు రాష్ట్రాలకు చెందిన 240 స్టార్ట్ అప్ లను  ఎంపిక చేసుకొని వాటికి అవసరమైన అన్ని రకాల చేయూతను అందించడం తో పాటు, ముఖ్యంగా ఆయా స్టార్టప్ లు మరింత మూలధనాన్ని (capital) అందుకునేలా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ అవగాహన ఒప్పంద కార్యచరణ ఉంటుంది.

తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రి కే. తారకరామారావు మరియు గుజరాత్ విద్యా శాఖ మంత్రి భూపేంద్ర సిన్హా  చుడాసమ,  విభావరి బెన్ దవే (మహిళ మరియు శిశు సంక్షేమ ప్రాథమిక విద్యా శాఖ మంత్రి)ల సమక్షంలో తెలంగాణ మరియు గుజరాత్ కు చెందిన సీనియర్ అధికారులు జయేష్ రంజన్ మరియు అంజు శర్మలు  ఈ మేరకు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.

ఈ భాగస్వామ్యం ద్వారా సుమారు 240 మంది ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ఎంచుకుంటారు. ముఖ్యంగా ఎడ్యుటెక్, మెడిటెక్, ఫిన్ టెక్ వంటి రంగాల్లోని వారిని ఎంచుకుని, మూడు నెలల పాటు ప్రి ఇంక్యుబేషన్ ద్వారా ఈ కార్యక్రమంలో శిక్షణ అందించి, తుది దశలో 20 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఎంపిక చేస్తారు. రెండు రాష్ట్రాలకు చెందిన 20 మంది మహిళా పారిశ్రామికవేత్తలకు వీ-హబ్ మరియు ఐ-హబ్ నేరుగా వారు ఎంచుకున్న రంగాల్లో అన్ని విధాల మద్దతును అందిస్తాయి. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 2021 మొదటివారంలో ప్రారంభం కానుంది. వీ-హబ్‌ ద్వారా ఇప్పటికే విమెన్‌ ఇన్నోవేషన్‌కి దేశవ్యాప్త గుర్తింపు లభించింది. ఇలాంటి భాగస్వామ్యం ద్వారా దేశంలో మహిళా ఇన్నోవేషన్‌ మరింత బలోపేతం కానుంది. ఇన్నోవేషన్‌ రంగంలో దేశానికి దిక్సూచిగా, ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Latest Updates