ఏపీ సర్కార్ కు ఫైన్ వేయండి

  • చెన్నైకి తాగునీటి సరఫరాలో బోర్డు ఆదేశాలను ధిక్కరిస్తోంది
  • కేఆర్ఎంబీ మీటింగ్ లో తెలంగాణ ప్రతిపాదన

హైదరాబాద్, వెలుగు: చెన్నైకి తాగునీటి సరఫరా విషయంలో కృష్ణా బోర్డు ఆదేశాలను ధిక్కరిస్తున్న ఏపీ సర్కార్కు ఫైన్ వేయాలని తెలంగాణ కోరింది. చెన్నైకి ఇవ్వాల్సిన నీటిని రాయలసీమ సాగునీటి అవసరాలు తీరాకే ఇస్తోందని తెలిపింది. చెన్నైకి తాగునీటి సరఫరాపై కేఆర్ఎంబీ నాలుగో మీటింగ్ బోర్డు చైర్మన్ పరమేశం అధ్యక్షతన బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. సీడబ్ల్యూసీ, ఏపీ, తెలంగాణ, తమిళనాడు ఇంజనీర్లు అందులో పాల్గొన్నారు. తమిళనాడు ఈఎన్సీ రాజారాం మాట్లాడుతూ.. బచావత్ అవార్డు చెన్నై తాగునీటికి 15 టీఎంసీలు కేటాయించిందని, ఆలస్యంగా నీటిని విడుదల చేస్తుండటంతో ఆ నీరు చెన్నైకి చేరడంలేదని తెలిపారు. జూన్ నుంచి అక్టోబర్ మధ్యనే నీటిని విడుదల చేయాలని కోరారు. ఏపీ తలపెట్టిన రాయలసీమ (సంగమేశ్వరం) లిఫ్ట్ స్కీం పూర్తయితే చెన్నైకి తాగునీటి ఇబ్బందులు తీరి సకాలంలో నీళ్లు చేరతాయని తెలిపారు. ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి సహకరించాలని బోర్డును కోరారు.

నవంబర్‌లో తప్ప నీళ్లు ఇవ్వలేం: ఏపీ

కృష్ణానదిలో జులై ఆఖరి వారం, ఆగస్టు మొదటి వారంలో వరద మొదలవుతుందని, శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగులకు చేరితేనే పోతిరెడ్డిపాడు నుంచి తెలుగు గంగకు నీటిని విడుదల చేయడం సాధ్యమవుతుందని ఏపీ సీఈ మురళీనాథ్‌రెడ్డి తెలిపారు. వెలుగోడులో 15 టీఎంసీల నీటిని నిల్వ చేస్తేనే తెలుగు గంగ కాల్వలకు నీటిని విడుదల చేయగలమని, సోమశిలలో 23, కండలేరులో 10 టీఎంసీలు నిల్వ ఉన్నప్పుడే చెన్నైకి నీటిని విడుదల చేయడం సాధ్యమవుతుందని వివరించారు.
మొత్తంగా 48 టీఎంసీల నీళ్లునిల్వ చేస్తేగానీ చెన్నైకి నీటిని ఇవ్వలేమని, ఇది నవంబర్ లో తప్ప అంతకుముందు సాధ్యంకాదని తేల్చిచెప్పారు. తమిళనాడు ప్రభుత్వం తమకు బకాయి పడిన రూ.350 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు. తెలంగాణ సీఈ కోటేశ్వర్ రావు జోక్యం చేసుకుంటూ చెన్నై తాగునీటి సరఫరా విషయంలో ఏపీ ప్రతిసారి బోర్డు ఆదేశాలను ధిక్కరిస్తోందని, ఫైన్ వేస్తేగానీ ఆ రాష్ట్ర వైఖరి మారదని అన్నారు.

ఈ దశలో ఏపీ సీఈ జోక్యం చేసుకుని తాము క్రమశిక్షణతో బోర్డు ఆదేశాలను పాటిస్తున్నామని, తెలంగాణనే బోర్డు ఆదేశాలను ధిక్కరించి శ్రీశైలంలో నీటిమట్టం పెరగకుండా కిందికి నీటిని వదులుతోందని అన్నారు. రాయలసీమ ప్రాజెక్టులకు, చెన్నై తాగునీటికి నీరందకుండా తెలంగాణనే చేస్తోందని ఆరోపించారు. ఈ దశలో తమిళనాడు ఈఎన్సీ స్పందిస్తూ కండలేరులో నిల్వ ఉన్న నీటిని చెన్నైకి తాగునీటి కోసం కేటాయించాలని కోరారు. దీనికి ఏపీ సీఈ బదులిస్తూ ఏపీ, తమిళనాడు అధికారులతో ఏర్పాటైన హైపవర్ కమిటీ దీనిపై చర్చించి నిర్ణ‌యం తీసుకుంటుందని తెలిపారు. ఏపీ ప్రతిపాదనను ఆమోదిస్తున్నట్టుగా బోర్డు ప్రకటించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం

Latest Updates