మృతదేహాల్ని 13 వరకు భద్రపరచండి

  • ‘దిశ’ నిందితుల డెడ్​బాడీలపై హైకోర్టు ఆదేశం    
  • మూడు పిటిషన్లపై విచారణ..
  • ఎన్​కౌంటర్​లో పాల్గొన్న నిందితులపై ఎఫ్ఐఆర్ పెట్టారా?
  • పెడితే ఆధారాలివ్వండి
  • రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
  • విచారణ 12వ తేదీకి వాయిదా

హైదరాబాద్‌‌, వెలుగు:

వెటర్నరీ డాక్టర్ ‘దిశ’అత్యాచారం, హత్య కేసు నిందితుల మృతదేహాల్ని 13వ తేదీ వరకూ భద్రపరచాలని, పాలమూరు జిల్లా ఆస్పత్రిలో భద్రంగా ఉండే అవకాశాలు లేకపోతే ఏసీ వసతులున్న వాహనంలో హైదరాబాద్‌‌ గాంధీ ఆస్పత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశించింది. ‘దిశ’నిందితులను ఎన్‌‌కౌంటర్‌‌ పేరిట మట్టుబెట్టారంటూ మహిళా సంఘాలు చేసిన ఫిర్యాదును హైకోర్టు పిల్‌‌గా తీసుకుంది. ఇండియన్‌‌ అసోసియేషన్‌‌ ఆఫ్‌‌ పీపుల్స్‌‌ లాయర్స్‌‌ మెంబర్‌‌ రాఘవేంద్రప్రసాద్‌‌ వేసిన పిల్‌‌ను కూడా కలిపి సోమవారం హైకోర్టు సీజే జస్టిస్‌‌ ఆర్ఎస్‌‌ చౌహాన్, జస్టిస్‌‌ అభిషేక్‌‌రెడ్డితో కూడిన బెంచ్‌‌ విచారించింది. ‘‘సుప్రీంకోర్టు గైడ్‌‌లైన్స్‌‌కు అనుగుణంగా ఎన్‌‌కౌంటర్‌‌లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్ఐఆర్‌‌ పెట్టాలి. మహారాష్ట్ర–పీయూసీఎల్‌‌ కేసులో సుప్రీం ఇచ్చిన రూలింగ్‌‌ను ‘దిశ’నిందితుల ఎన్‌‌కౌంటర్‌‌ తర్వాత అమలు చేశారా? సుప్రీం మార్గదర్శకాల్లో అలా లేదని ప్రభుత్వం చెప్పడం కరెక్ట్​ కాదు. 12న జరిగే విచారణ టైమ్​లో పోలీసులపై ఎఫ్ఐఆర్‌‌ నమోదు చేసిందీ లేనిదీ చెప్పాలి. గైడ్‌‌లైన్స్‌‌ అమలు చేసుంటే ఆధారాలు మాకు అందజేయాలి ”అని ప్రభుత్వాన్ని బెంచ్​ఆదేశించింది. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో రెండు పిల్స్‌‌ విచారణలో ఉన్నాయని, వాటిపై విచారణ 11వ తేదీకి వాయిదా పడిందని, అందువల్ల ఈ కేసును 12వ తేదీకి వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌‌ జనరల్‌‌ బీఎస్‌‌ ప్రసాద్‌‌ చేసిన అభ్యర్థనను హైకోర్టు ఆమోదించింది. ఈ కేసులో తమకు సహరించేందుకు సీనియర్‌‌ లాయర్‌‌ డి.ప్రకాశ్‌‌రెడ్డిని ఎమికస్‌‌ క్యూరీగా నియమిస్తున్నామని ప్రకటించింది.

అవి కస్టోడియల్‌‌ డెత్‌‌లు..

‘దిశ’కేసులో నిందితులది ఎన్‌‌కౌంటర్‌‌ కాదని, ఇవి కస్టోడియల్‌‌ డెత్‌‌లని వివిధ ప్రజా, మహిళా సంఘాలు హైకోర్టుకు చేసిన ఫిర్యాదులో ఆరోపించాయి. పథకం ప్రకారం ఎన్‌‌కౌంటర్‌‌ చేశారని, కస్టోడియల్‌‌ డెత్‌‌లుగా మీడియాలో కథనాలు కూడా వస్తున్నాయని తెలిపాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన చేస్తున్నందునే పోలీసులు ‘ఆత్మరక్షణ’పేరుతో ఎన్‌‌కౌంటర్‌‌ చేశారని, ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరాయి. ఎన్‌‌కౌంటర్‌‌లో పాల్గొన్న పోలీసులను అరెస్ట్​ చేసి.. వారిపై హత్యానేరం కింద కేసులు నమోదు చేయాలన్నాయి. నిందితులు నిరాయుధులని, వారికి సంకెళ్లు కూడా వేస్తారని, తెల్లవారు జామున 3 గంటలకు నేరం జరిగిన చోటుకు 50 మంది పోలీసులు కూడా వెళ్లారని, అంతమంది ఉన్నా నిందితులు ఎదురుతిరిగారని, ఆయుధాలు లాక్కున్నారని కథ అల్లారని ఆరోపించాయి. న్యాయ వ్యవస్థను పక్కనపెట్టి ఏదో ఒక న్యాయం పేరిట హతమార్చారన్నాయి. సుప్రీం మార్గదర్శకాల ప్రకారం హైకోర్టు పర్యవేక్షణలో ఎన్‌‌కౌంటర్‌‌పై నెలకొన్న అనుమానాలను న్యాయబద్ధంగా నివృత్తి చేయాలని కోరాయి. ఎన్‌‌కౌంటర్‌‌ ఎఫ్ఐఆర్, జనరల్‌‌ డైరీ, సంబంధిత పీఎస్‌‌ వైర్‌‌లెస్‌‌ లాగ్‌‌బుక్, పోలీసులు ఉపయోగించిన వాహనాల లాగ్‌‌బుక్‌‌లు, ఫోన్‌‌ కాల్‌‌ డేటాలను పరిశీలించేందుకు స్వతంత్ర కమిటీ ఏర్పాటుకు ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశాయి. పోలీసులపై హత్యానేరం కేసులు పెట్టాలని, ఎన్​కౌంటర్​పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని, ఎన్‌‌కౌంటర్‌‌ మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని అని రాఘవేంద్ర ప్రసాద్‌‌ పిల్‌‌లో కోర్టును కోరారు. ఇందులో రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సైబరాబాద్‌‌ పోలీస్‌‌ కమిషనర్, మహబూబ్‌‌నగర్‌‌ ఎస్పీలను ప్రతివాదులుగా చేశారు. సర్కార్‌‌ తరఫున ఏజీ వాదనలు వినిపిస్తూ.. సుప్రీం గైడ్‌‌లైన్స్‌‌లో ఎక్కడా ఎన్‌‌కౌంటర్‌‌లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్ఐఆర్‌‌ పెట్టాలని లేదన్నారు. ఎన్‌‌కౌంటర్‌‌ విధి నిర్వహణలో జరిగిందని, పోలీసులపై హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలని పిటిషనర్లు కోరడం చట్టవ్యతిరేకం అని చెప్పారు. అయితే ఈ వాదనతో హైకోర్టు ఏకీభవించలేదు. సుప్రీంకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చిందని, వాటి ప్రకారం ఎన్‌‌కౌంటర్‌‌లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్ఐఆర్‌‌ పెట్టాలని చెప్పింది.

‘దిశ’నిందితుల ఎన్​కౌంటర్​పై సుప్రీం విచారణ

న్యూఢిల్లీ, వెలుగు: ‘దిశ’నిందితుల ఎన్ కౌంటర్ పై విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు ప్రకటించింది. నిందితులను పోలీసులు బూటకపు ఎన్ కౌంటర్ చేశారని, దీనిపై అత్యవసర విచారణ జరపాలంటూ జీఎస్ మణి దాఖలు చేసిన పిటిషన్​సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్​డే నేతృత్వంలోని బెంచ్​ ముందు వచ్చింది. పిటిషనర్​ తరపు లాయర్​ వాదనలు విన్న కోర్టు.. ఈ పిటిషన్ పై బుధవారం విచారణ చేపడతామని ప్రకటించింది.

గాంధీ ఆస్పత్రికి డెడ్​బాడీలు

హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ‘దిశ’ నిందితుల డెడ్​బాడీలను హైదరాబాద్​ గాంధీ ఆస్పత్రికి తరలించారు. మహబూబ్​నగర్​ మెడికల్​ కాలేజీలో ఉన్న డెడ్​బాడీలను ఫార్మలిటిస్​ అన్నీ కంప్లిట్​ చేసి భారీ భద్రత నడుమ సోమవారం రాత్రి ఏడు గంటల తర్వాత ప్రత్యేక అంబులెన్స్​లో హైదరాబాద్​ తీసుకువచ్చారు. డెడ్​బాడీల అప్పగింత ఆలస్యం అవుతుండటం, అంత్యక్రియలు పూర్తికాక పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Telangana HC orders cops to preserve accused's dead bodies till December 13

Latest Updates