దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై నేడు హైకోర్టులో విచారణ

హైదరాబాద్, వెలుగు: దిశ నిందితుల మృతదేహాలకు మళ్లీ పోస్టుమార్టం చేయాలని, బూటక ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణకు ఆదేశించాలని దాఖలైన పిల్స్ పై శుక్రవారం విచారణ చేస్తామని హైకోర్టు ప్రకటించింది. దిశ కేసులో నిందితులు మహమ్మద్‌ ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవుల మృతదేహాలకు మరోసారి పోస్టుమార్టం చేశాకే కుటుంబసభ్యులకు అప్పగించాలని పిటిషనర్‌ తరపు లాయర్‌ హైకోర్టును కోరారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిపారు.

శుక్రవారం విచారణ చేస్తామని చీఫ్ జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ అభిషేక్‌రెడ్డిలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ వెల్లడించింది. దిశ నిందితులది నిజమైన ఎన్‌కౌంటర్‌ కాదని, ప్రజల భావోద్వేగాలకు తలొగ్గిన పోలీసులు ఎన్‌కౌంటర్‌ పేరుతో కాల్చి చంపేశారంటూ హైకోర్టులో పలు పిల్స్‌ దాఖలయ్యాయి. అయితే ఈ కేసులో సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో అప్పటికే హైకోర్టు మృతదేహాల్ని భద్రం చేయాలన్న ఆదేశాలు ఈ నెల 6 నుంచి అమల్లోనే ఉన్నాయి. పిటిషనర్లు సుప్రీంకోర్టుకు వెళితే, మృతదేహాల విషయంపై హైకోర్టుకు వెళ్లాలని సూచించింది.  దీంతో పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు.

Latest Updates