ఒకరిద్దరు ఆఫీసర్లను జైలుకు పంపితే కానీ మిగతావారు దారికి రారేమో!

హైదరాబాద్, వెలుగు: కోర్టు ధిక్కార కేసుల్లో అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి కేసుల్లో ఒకరిద్దరు ఆఫీసర్లను జైలుకు పంపితే కానీ మిగతా ఆఫీసర్లు దారికి రారేమోనని మండిపడింది. ఓ కేసు విషయంలో కోర్టు ఉత్తర్వుల్ని అమలు చేయకుండా దానిపై అప్పీల్‌కు ఏడాదిన్నర కాలం తర్వాత రాష్ట్ర సర్కార్ హైకోర్టుకు వచ్చింది. అప్పీల్‌కు 466 రోజుల ఆలస్యమైందని, క్షమించి అనుమతి ఇవ్వాలని హైకోర్టును ప్రభుత్వ స్పెషల్ లాయర్ శరత్ కోరారు. దీనిపై శుక్రవారం చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ అభిషేక్‌రెడ్డి డివిజన్ బెంచ్ స్పందిస్తూ.. అసలు ప్రభుత్వాధికారులకు కోర్టు ఆర్డర్లు అంటే ఏమాత్రం గౌరవం లేనట్లుందని, అప్పీల్ చేసేందుకు కూడా ఏడాదిన్నర సమయం ఆలస్యం చేశారంటే వాళ్లను ఏమనుకోవాలని నిలదీసింది. ఇంత దారుణమైన నిర్లక్ష్యం ఎక్కడా చూడలేదని, ఇదే హైకోర్టులో 2 వేల కోర్టు ధిక్కార కేసులు ఉన్నాయంటే అధికారుల నిర్లక్ష్యం ఎంత ఘోరంగా ఉందో కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ‘‘కోర్టు ఉత్తర్వులు అమలు చేయరు. కోర్టులను అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. అసలు కోర్టులంటే ఏమనుకుంటున్నారు? కోర్టు ఉత్తర్వులనే ఖాతరు చేయడం లేదంటే అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఒకరిద్దరు ఆఫీసర్లను కోర్టు ధిక్కార కేసుల్లో జైళ్లకు తరలిస్తేనేగానీ ఇతర అధికారులు దారికి రారేమో..’’ అని హైకోర్టు మండిపడింది. స్టేట్ కేసు లిటిగేషన్ పాలసీని అమలు చేయాలని, ప్రతి డిపార్ట్మెంట్లో ఒక కమిటీ వేసి వాటి ద్వారా వివాదాల్ని పరిశీలిస్తే లిటిగేషన్ తగ్గుతుందని ఏనాడో హైకోర్టు సూచన చేసిందని, అయినా పట్టించుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతీరాజ్, ట్రాన్స్‌పోర్టు లాంటి డిపార్టుమెంట్లలో ఆ కమిటీలు ఉండి ఉంటే కోర్టు ధిక్కార కేసులు ఉండేవి కావని అభిప్రాయపడింది.

Latest Updates