సప్లిమెంటరీ ఉత్తీర్ణులను రెగ్యులర్‌గానే పరిగణించాలి

హైదరాబాద్: పదో తరగతి పరీక్షల నిర్వహణపై హైకోర్టులో శనివారం విచారణ జ‌రిగింది. తెలంగాణ ప్రభుత్వం పదో తరగతి సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులను రెగ్యులర్‌గా గుర్తించాలని నిర్ణయించింది. దీనిపై ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ నిర్ణయాన్ని అడ్వకేట్ జనరల్ ప్రసాద్ హైకోర్టుకు నివేదించారు. ఎస్ఎస్‌సీ బోర్డు డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం పరీక్షల మీద దృష్టి పెడుతోందని, అయితే, రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదని పిటిషనర్ వాదించారు. పంజాబ్‌ తరహాలో పరీక్షలు లేకుండానే విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వాలని పిటిషనర్ వాదించారు.

పరీక్షలు లేకుండా గ్రేడింగ్ ఇస్తే ఇబ్బందేంటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అలాగే, ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి మినహా మిగతా జిల్లాల్లో మాత్రమే పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు సూచించింది. దీనిపై అడ్వకేట్ జనరల్ అభ్యంతరం తెలిపారు. రాష్ట్రంలో వేర్వేరుగా పరీక్షలు నిర్వహించడం కష్టమని పేర్కొన్నారు. ప్రశ్నపత్రం మళ్లీ మళ్లీ తయారుచేయడం ఇబ్బంది అవుతుందన్నారు. అయితే, విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమా.. సాంకేతిక అంశాలు ముఖ్యమా అని కోర్టు ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వాన్ని సంప్రదించి నిర్ణయం చెబుతామని హైకోర్టుకు ఏజీ తెపడంతో విచారణ 4 గంటలకు వాయిదా పడింది.

Latest Updates