బస్సులెక్కేందుకు ప్రయాణికులే వస్తలేరా..? ప్రభుత్వంపై హైకోర్ట్ ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు:

ఆర్టీసీ సమ్మె జరుగుతున్నా దాని ప్రభావం ఏమాత్రం రవాణాపై లేదని, ప్రయాణికులు రావడమే తరువాయి వారికి అవసరమైనన్ని బస్సుల్ని నడిపేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తెచ్చింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె చేస్తున్నందున అన్ని విధాలైన ముందస్తు ఏర్పాట్లు చేశామని, ఫలితంగానే సమ్మె ప్రభావం ఏమాత్రం కనిపించడం లేదని తెలిపింది. దీనిపై హైకోర్టు డివిజన్​ బెంచ్​స్పందిస్తూ.. ‘‘అయితే ప్రయాణికులే బస్సులు ఎక్కేందుకు రావడం లేదన్న మాట..” అని వ్యాఖ్యానించింది. బెంచ్‌‌ వ్యాఖ్యలతో కోర్టు హాల్లో నవ్వులు వెల్లివిరిశాయి. దీనిపై కూడా ప్రభుత్వం స్పందిస్తూ.. నిజమేనని, ప్రయాణికులు ఎప్పుడు వస్తే అప్పుడు బస్సులు నడిపేందుకు అన్ని డిపోల్లోనూ ఏర్పాట్లు జరిగాయని, డ్రైవర్లు, కండక్టర్లు కూడా సిద్ధంగా ఉన్నారని పేర్కొంది. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె విరమించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్‌‌ స్కాలర్‌‌ ఆర్‌‌.సుబేందర్‌‌సింగ్‌‌ దాఖలు చేసిన పిల్‌‌ను గురువారం హైకోర్టు జడ్జిలు జస్టిస్‌‌ ఎ.రాజశేఖర్‌‌రెడ్డి, జస్టిస్‌‌ ఎ.అభిషేక్‌‌రెడ్డితో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ ఎదుట రెండు గంటలకుపైగా వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరఫున, టీఎంయూ తరఫున, ఆర్టీసీ జేఏసీ తరఫున, పిటిషనర్​ తరఫున వాదనలు కొనసాగాయి.

మాకు బస్సులు కనిపించలేదే: హైకోర్టు

దసరా సెలవులకు జనం చాలా మంది సొంతూళ్లకు వెళ్లారని, అందుకే డిమాండ్‌‌ పెద్దగా కనిపించడం లేదని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్‌‌ జనరల్‌‌ జె.రామచందర్‌‌రావు పేర్కొన్నారు. దీనిపై డివిజన్‌‌ బెంచ్‌‌ కల్పించుకుని.. ‘‘మొన్నటితోనే దసరా పండుగ అయిపోయింది. ఇప్పుడు మేము హైకోర్టుకు వస్తున్నప్పుడు ఎక్కడా రోడ్లపై ఆర్టీసీ బస్సులు కనిపించలేదు” అని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ వాదనల తర్వాత డివిజన్‌‌ బెంచ్‌‌ కల్పించుకుని.. ప్రభుత్వం కౌంటర్‌‌ వేయలేదని, సమ్మె–ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సమర్పించిన నివేదికలో అరకొర వివరాలే ఉన్నాయని, పూర్తి వివరాలతో కౌంటర్‌‌ వేయాలని ఆదేశించింది.

చట్ట ప్రకారం నోటిసులు ఇచ్చాకే..: ఉద్యోగ సంఘాలు

సమ్మె చట్ట విరుద్ధమని ప్రభుత్వం వాదించడంలో అర్థం లేదని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్‌‌ యూనియన్‌‌ తరఫున సీనియర్‌‌ లాయర్‌‌ డి.ప్రకాష్‌‌రెడ్డి వాదించారు. గత నెలలో వివిధ దశల్లో కార్మిక సంఘాలు నోటీసులు ఇచ్చాయని, వాటిపై చర్చలకు ఆహ్వానించిన ఆర్టీసీ యాజమాన్యం తదుపరి తేదీని కూడా తెలియజేయకుండా చర్చలు జరపకుండానే వాయిదా వేసేసిందని కోర్టు దృష్టికి తెచ్చారు. చట్ట ప్రకారం నోటీసు ఇచ్చిన తర్వాతే కార్మికులు సమ్మె మొదలుపెట్టారని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులను రాత్రికి రాత్రే తొలగించలేరని, ప్రభుత్వం ఒక్కసారిగా అలాంటి నిర్ణయం తీసుకుంటే చెల్లదని పేర్కొన్నారు. తమ వాదనలతో కౌంటర్‌‌ పిటిషన్‌‌ వేసేందుకు పది రోజుల సమయం కావాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగుల, కార్మిక సంఘాల జాయింట్‌‌ యాక్షన్‌‌ కమిటీ (జేఏసీ) తరఫున లాయర్​ రచనారెడ్డి వాదిస్తూ.. గత నెలలోనే ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పలుసార్లు ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇచ్చాయని, వాటిపై 23న చర్చలు ఉంటాయని చెప్పి ఏ కారణం లేకుండా చర్చలను ప్రభుత్వం వాయిదా వేసిందన్నారు. నిజంగానే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముగ్గురు సభ్యుల ఉన్నతాధికారుల కమిటీని అర్ధంతరంగా ఎందుకు రద్దు చేసిందో చెప్పాలని వాదించారు. ఆర్టీసీ నిధులు రూ. 545 కోట్లను ప్రభుత్వం తీసుకుందని, ఉద్యోగుల పీఎఫ్, కో ఆపరేటివ్‌‌ సొసైటీ నిధుల్ని కూడా తీసుకుందని అడ్వకేట్లు హైకోర్టు దృష్టికి తెచ్చారు.

సమ్మె విరమించేలా చూడాలి: పిటిషనర్​

ప్రభుత్వానికి గానీ, యూనియన్లకు గానీ ప్రయాణికుల గోడు పట్టడం లేదని పిటిషనర్‌‌ తరఫు లాయర్​ పీవీ కృష్ణయ్య వాదించారు. సమ్మె చట్ట విరుద్ధమో, కాదో తర్వాత తేల్చుకోవచ్చునని, తక్షణమే సమ్మె విరమించేలా హైకోర్టు మధ్యంతర ఆదేశాలివ్వాలని కోరారు. ఇప్పుడేమీ సమస్య కనిపించదని, దసరా సెలవులు అయిపోతే 14వ తేదీ నుంచి ఊళ్ల నుంచి సిటీలకు వచ్చే ప్రయాణికుల ఆగచాట్లు వర్ణనాతీతంగా ఉంటాయన్నారు.

సమ్మె చట్టవిరుద్ధం: ప్రభుత్వం

ఆర్టీసీ కార్మిక సంఘాలు ఏమాత్రం ప్రయాణికుల కోసం ఆలోచన చేయలేదని, పలు డిపోల్లో బస్సులు నడుపుతుంటే ఆర్టీసీ ఉద్యోగులు అడ్డుకున్నారని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్‌‌ జనరల్‌‌ జె.రామచందర్‌‌రావు వాదనలు వినిపించారు. వారి సమ్మె చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని, పోలీస్, రెవెన్యూ ఇతర సిబ్బంది సాయంతో బస్సుల్ని నడుపుతున్నామని తెలిపారు. ఈ పిల్​లో ప్రజాప్రయోజనాలు లేవని, కార్మిక సంఘాలకు చెందిన వారే దీన్ని వేయించారని ఆరోపించారు. అనంతరం అడ్వకేట్‌‌ జనరల్‌‌ బీఎస్‌‌ ప్రసాద్‌‌ వాదిస్తూ.. సమ్మె సమస్యపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే కార్మిక శాఖలోని సంబంధిత  అధికారి వద్ద తేల్చుకోవాలన్నారు.

ప్రైవేటు చార్జీల దోపిడీని అరికట్టాలని ఆదేశం

వాదనల అనంతరం

హైకోర్టు డివిజన్​ బెంచ్​..

ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని,  ప్రత్యామ్నాయ ఏర్పాట్లను రోజూ ఉన్నతాధికారులు సమీక్షించాలని, సమస్య జటిలం కాకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించింది.  ప్రైవేటు బస్సులు అధిక వసూళ్లకు పాల్పడుతున్నట్లుగాను, సీజన్‌‌ టికెట్లు ఉన్న వారి నుంచి డబ్బులు వసూలు చేయడమే కాకుండా అధికంగా వసూలు చేస్తున్నారని తమకు వాట్సాప్‌‌ ద్వారా మెసేజ్‌‌లు వస్తున్నాయని తెలిపారు. వీటి విషయంలోనూ తగిన చర్యలు తీసుకోవాలని మౌఖికంగా ఆదేశించింది. ప్రభుత్వం, యూనియన్, జేఏసీ ఇతర ప్రతివాదులు తమ వాదనలతో కౌంటర్‌‌ పిటిషన్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను 15వ తేదీకి వాయిదా వేసింది.

Latest Updates