అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణపై హైకోర్టు సీరియస్

హైదరాబాద్‌‌, వెలుగు: ‘‘చట్ట ప్రకారం మాస్టర్‌‌ ప్లాన్‌‌ తయారైంది. జనం ఎంతమంది ఉన్నారు.. వారికి కావాల్సిన మౌలిక వసతులేంటో మాస్టర్‌‌ ప్లాన్‌‌ నిర్ణయిస్తుంది. దాని ప్రకారమే నిర్మాణాలుండాలి.  విరుద్ధంగా నిర్మాణాలు చేసినప్పుడు చూసీచూడనట్లుగా వ్యవహరించడం, తర్వాత వాటికి జరిమానాలు వసూలు చేసి క్రమబద్ధీకరించడంలో ఔచిత్యం ఏంటో అర్థం కావడంలేదు. అలా అయితే మాస్టర్‌‌ ప్లాన్‌‌కు అర్థమేముంది? ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు మాస్టర్​ప్లాన్​ మార్చుకుంటూ పోతారా?” అని హైకోర్టు ప్రశ్నించింది.

ఆదిలాబాద్‌‌ జిల్లాలోని బాగులవాడకు చెందిన ఎ.రాజన్న తాను నిర్మించిన అక్రమ నిర్మాణాన్ని నిర్మల్‌‌ మున్సిపల్‌‌ కమిషనర్‌‌ క్రమబద్ధీకరించకపోవడాన్ని హైకోర్టులో సవాల్‌‌ చేశారు. ఈ పిటిషన్​ ఇటీవల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌‌ చల్లా కోదండరామ్‌‌ ముందుకు వచ్చింది. మున్సిపల్‌‌ కమిషనర్‌‌ నిర్ణయంలో జోక్యం చేసుకోబోమని కోర్టు స్పష్టం చేసింది. అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ నిబంధనలను సమీక్షించాల్సి ఉందని, వీటిపై సింగిల్‌‌ జడ్జి 2012లో ఇచ్చిన ఆదేశాలు 1995లో ముగ్గురు జడ్జిలతో కూడిన ధర్మాసనం ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నందున కేసును తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ ఆర్‌‌ఎస్‌‌ చౌహాన్‌‌తో కూడిన డివిజన్​ బెంచ్​కు నివేదించాలని హైకోర్టు రిజీస్ట్రిని ఆదేశించింది. పిటిషనర్‌‌ రాజన్న మూడు అంతస్తులకు అనుమతి తీసుకుని నాలుగు అంతస్తులు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించింది.

‘‘చదరపు అడుగులు, చదరపు గజాలను లెక్కల్లోకి తీసుకుని అక్కడ ఉండే జనాభాను పరిగణనలోకి తీసుకుని ప్రజలకు అవసరమైన రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్‌‌ తదితర మౌలిక సౌకర్యాలు కల్పనలు ఉంటాయి. ఇలా ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు మాస్టర్‌‌ ప్లాన్​ను ఉల్లంఘించి నిర్మాణాలు చేశాక క్రమబద్ధీకరణ కోరడం సరి కాదు”అని కోర్టు తెలిపింది. డివిజన్‌‌ బెంచ్‌‌ నిర్ణయం వెలువడే వరకూ పిటిషనర్‌‌ అక్రమ నిర్మాణాన్ని కూల్చొద్దని ఆదేశించింది. అలాగే 2012లో సింగిల్‌‌ జడ్జి ఉత్తర్వుల మేరకు పిటిషనర్‌‌ ఇంటిని క్రమబద్ధీకరించేందుకు ఉత్తర్వులు ఇవ్వలేమంది. చట్టాన్ని ఉల్లంఘించి నిర్మాణాలు చేసి క్రమబద్ధీకరించాలనడం సరి కాదని అభిప్రాయపడింది. పిటిషన్‌‌లో ఈ అంశం లేకున్నా అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ చట్ట నిబంధనలకు సంబంధించిన ఏపీ పట్టణ ప్రాంత అభివృద్ధి చట్టాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని,  ఆ నిబంధనల ఫైళ్లను డివిజన్‌‌ బెంచ్‌‌కు నివేదించాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది.

Latest Updates