పసుపు, మిర్చి ఉత్ప్తత్తిలో తెలంగాణ దేశంలోనే టాప్

  • సాగు, ఉత్పత్తిలో మనమే టాప్
  • లోకల్​గా వినియోగం తక్కువ
  • ఇతర రాష్ట్రాలు,విదేశాలకు ఎగుమతి
  • విదేశాలకు ఎక్స్​పోర్ట్​ అయ్యేది 15 శాతమే
  • ప్రాసెస్​ చేసి విదేశాలకు పంపితే వేల కోట్ల ఆదాయం
  • రైతులకు అవగాహన కల్పించాలంటున్న నిపుణులు

పసుపు, మిర్చి ఉత్ప్తత్తిలో తెలంగాణ దేశంలోనే టాప్​లో నిలుస్తోంది. పసుపు ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ ప్లేస్​లో ఉంటే.. మిర్చి ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న పసుపు, మిర్చిలో 85% రాష్ట్ర, దేశ అవసరాలకు వాడుతుంటే.. 15% విదేశాలకు ఎగుమతి అవుతోంది. విదేశాలకు చిల్లీ, టర్మరిక్‌ ఎగుమతికి ఆస్కారం ఎక్కువగా ఉంది. మనం పండించిన పంటలను ఇక్కడే ప్రాసెస్​ చేసుకుని 150 రకాలుగా 180 దేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఉందని వాణిజ్య నిఫుణులు చెబుతున్నారు. రైతులకు అవగాహన లేకపోవడంతో అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్‌ ఉన్నా ఎక్స్​పోర్ట్​ చేయలేక పోతున్నామని అంటున్నారు. రాష్ట్ర రైతులను ప్రోత్సహించి.. ప్రాసెసింగ్‌‌ అవకాశాలు కల్పిస్తే వేల కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుందని సూచిస్తున్నారు.

పసుపు సాగులో స్పీడు

రాష్ట్రంలో 68 వేల మంది రైతులు 1,33,912 ఎకరాల్లో పసుపు సాగు చేస్తున్నారు. నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, వరంగల్ రూరల్, మహబూబాబాద్ జిల్లాల్లో ఎక్కువగా పసుపు సాగు జరుగుతోంది.  ఏటా 2,67,882 మెట్రిక్‌‌ టన్నుల పసుపు ఉత్పత్తి అవుతోంది. దేశంలో పసుపు సాగు, ఉత్పత్తిలో తెలంగాణ అగ్రభాగంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ, కర్నాటక, గుజరాత్‌‌ ఉన్నాయి. రాష్ట్రంలో రోజువారీగా తలసరి పసుపు వినియోగం 56.25 మెట్రిక్‌‌ టన్నులు. ఏటా రాష్ట్ర అవసరాలకు వాడుకునేది 20,250 మెట్రిక్‌‌ టన్నులే. మిగతా 2,47,632 మెట్రిక్‌‌ టన్నుల పసుపు ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు ఎగుమతి అవుతోంది.

మిర్చి ఘాటు ఎక్కువే

రాష్ట్రంలో లక్షా 40 వేల మంది రైతులు 1,98,975 ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నారు. ఖమ్మం, భూపాలపల్లి, మహబూబాబాద్, సూర్యాపేట, గద్వాలలో మిర్చి సాగు జరుగుతోంది. ఏటా 3,97,950 మెట్రిక్‌‌ టన్నుల ఎండు మిర్చి ఉత్పత్తి అవుతోంది. దేశంలో మిర్చి ఉత్పత్తిలో ఏపీ తర్వాత తెలంగాణ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్‌‌, కర్నాటక, వెస్ట్‌‌బెంగాల్‌‌ ఉన్నాయి. రాష్ట్రంలో రోజువారీగా కారం వినియోగం 93 మెట్రిక్‌‌ టన్నులు ఉంటోంది. ఏటా రాష్ట్ర అవసరాలకు వాడేది 33,950 మెట్రిక్‌‌ టన్నులే. మిగతా 3,63,990 మెట్రిక్‌‌ టన్నుల మిర్చిని ఇతర రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

అవగాహన పెరగాలె

పసుపు పంట దిగుబడి ఎక్కువగా ఉన్నా పాత పద్ధతిలోనే సాగు జరుగుతుంది. మార్కెట్‌‌ కూడా అదే తరహాలో ఉండడంతో దళారులు బాగు పడుతున్నారు. పసుపును ఏ రూపంలో అమ్మాలి.. ఏ దేశంలో డిమాండ్‌‌ ఉందనేది అధికారులు గుర్తించి రైతులకు సహకరించాలి. మన దగ్గర పండిస్తున్న మిర్చి, పసుపు పంటలు ఏ రూపంలో ఉన్నాయి.. ఏ దేశంలో ఏ రకానికి డిమాండ్‌‌ ఉంది.. ప్రాసెసింగ్​ ఎలా చేయాలి.. అనే దానిపై రైతులకు అధికార యంత్రాంగం అవగాహన కల్పించాల్సి ఉంది. పసుపును ఔషధాలు, తినుబండరాలు, ఫ్లేక్‌‌ల రూపంలో తీసుకువచ్చి ఎగుమతి చేసుకోవచ్చని నిపుణలు చెబుతున్నారు. వరంగల్‌‌లో ఎక్కువగా పండే చప్టామిర్చికి ఇంటర్నేషనల్‌‌ మార్కెట్‌‌లో మంచి డిమాండ్‌‌ ఉంది. ఎక్కువ కలర్‌‌, తక్కువ కారం ఉండే ఈ మిర్చిని లిక్విడ్​ రూపంలో, కేవలం రంగును, కారం ఘాటు, ఇలా రకాలుగా ప్రాసెస్‌‌ చేసి ఎక్కడ డిమాండ్‌‌ ఉందో అక్కడికి ఎగుమతి చేస్తే రైతుకు మంచి లాభాలు వస్తాయి. ఎఫ్‌‌పీవోలు, రైతులకు అవగాహన పెంచడం ద్వారా ఎంత ఎక్కువ ఎగుమతి అయితే అంత గిట్టుబాటు ధర దక్కుతుందని నిపుణులు చెబుతున్నారు.

Telangana is the top country In the production of turmeric and mirchi crop

Latest Updates