విమర్శిస్తే తోలు తీస్తం: యువకుడిపై మంత్రి అనుచరులు దౌర్జన్యం

  • సోషల్​ మీడియాలో పోస్టుపెట్టిన యువకుడిపై దౌర్జన్యం
  • మంత్రి కొప్పుల అనుచరులు బెదిరించారన్న బాధితుడు
  • స్టేషన్​కు పిలిపించి పోలీసులు కొట్టారని ఆరోపణ
  • మళ్లీ పోస్టులు పెట్టనంటూ లెటర్​ రాయించుకున్నట్టు వెల్లడి

జగిత్యాల, వెలుగు: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై, ప్రజాప్రతినిధుల ఆగడాలు, అక్రమాలపై సోషల్​మీడియాలో నిలదీస్తున్న వారు బెదిరింపులకు గురవుతున్నారు. తప్పుడు కేసులు పెడతామంటూ పోలీసులతోనే వేధిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ఓ యువకుడిని పోలీస్​స్టేషన్​కు పిలిపించి కొట్టడం కలకలం రేపుతోంది. పోలీస్​స్టేషన్​లో మంత్రి కొప్పుల ఈశ్వర్​ అనుచరుల సమక్షంలోనే ఇదంతా జరగడం వివాదాస్పదంగా మారింది.

అట్రాసిటీ కేసు పెడ్తామంటూ..

ధర్మపురి మండల కేంద్రానికి చెందిన కాశెట్టి రాజేశ్​ ఈ నెల 12న ఒకరు సోషల్ మీడియాలో టీఆర్ఎస్​ సర్కారును, ప్రజాప్రతినిధుల తీరును తప్పుపడుతూ పోస్టులు చేశాడు. దీంతో కోపోద్రిక్తుడైన మంత్రి కొప్పుల సన్నిహిత అనుచరుడు రాజేశ్​కు ఫోన్​ చేశాడు. సోషల్​ మీడియాలో పెట్టిన పోస్టును తీసేయాలని, లేదంటే రౌడీ షీట్​ ఓపెన్​ చేయిస్తానని, జీవితాంతం కటకటాల వెనకే ఉండాల్సి వస్తుందని బెదిరించాడు. తనపై ఒక్క కేసు కూడా లేదని, రౌడీ షీట్​ ఎట్లా ఓపెన్​ చేస్తారంటూ రాజేశ్​ ఫోన్​ కట్​ చేశాడు.

అయితే టీఆర్ఎస్​ ప్రజాప్రతినిధి అనంతుల లక్ష్మణ్​ను కులం పేరుతో దూషించినట్టుగా కంప్లైంట్​ వచ్చిందంటూ సీఐ లక్ష్మిబాబు రాజేశ్​కు ఫోన్​ చేశారు. పోలీస్​స్టేషన్​కు రమ్మన్నారు. తీరా వెళ్లాక పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదుదారులు లేకపోగా.. టీఆర్ఎస్​ నాయకులు రాజేశ్, శేఖర్, లక్ష్మణ్, మహేశ్ తదితరుల సమక్షంలో సీఐ లక్ష్మిబాబు తనపై దాడి చేశారని బాధితుడు, ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. కాళ్లు, చేతులపై విపరీతంగా కొట్టారని, థర్డ్​ డిగ్రీ ప్రయోగించారన్నారు. గంజాయి రవాణా, అట్రాసిటీ కేసులు పెడుతామని బెదిరించారన్నారు.

బెదిరించి.. భయపెట్టి..

కేసు పెట్టకుండా వదిలేయాలంటే సోషల్​ మీడియాలో పెట్టిన పోస్టులను తీసేయాలని, మంత్రి కొప్పుల తనను క్షమించాలంటూ పోస్టులు చేయాలని హెచ్చరించారని బాధితుడు, ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. మరోసారి ఎలాంటి పోస్టులూ పెట్టబోనని రాతపూర్వకంగా రాయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొప్పుల అనుచరులకు పోలీసులు సహకరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. సోషల్​ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడితే.. చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. అయినా తప్పుడు కేసులు పెడతామంటూ బెదిరించడం, దాడులు చేయడంపై ధర్మపురి ప్రజల్లో భయాందోళన వ్యక్తమవుతోంది.

మరికొందరూ టార్గెట్!

సోషల్​ మీడియాలో యాక్టివ్​గా ఉన్న మరో 30 మందిని కూడా గుర్తించారని, వారిని కూడా బెదిరించేందుకు మంత్రి కొప్పుల అనుచరులు ప్రయత్నిస్తున్నారని సోషల్​ మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సోషల్​ మీడియాలో టీఆర్ఎస్​ సర్కారుకు, స్థానిక ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన మరో యువకుడు.. రాజేశ్​ను బెదిరించిన విషయం తెలిసి ఆందోళనకు గురయ్యాడు. తాను చేసిన పోస్టులు తీసేసి క్షమించాలంటూ పోస్టు చేశాడు.

ఇప్పటికే ఎన్నోసార్లు..

గతంలో కొప్పుల అనుచరులు ఓ యువకుడిని గన్ తో బెదిరించడం, బాధితులు పోలీస్​స్టేషన్​ ఎదుటే ఆందోళనకు దిగడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2018 ఏప్రిల్ లో ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మారంలో ఓ సీఐ తండ్రికి చెందిన మూడు గుంటల స్థలాన్ని కొందరు కబ్జా చేశారంటూ ఆ కుటుంబానికే చెందిన తిరుపతిరెడ్డి పోస్టు పెట్టాడు. దాంతో కొందరు ఆ యువకుడిని ఇంటి దగ్గరినుంచి కిడ్నాప్​ చేసి తీసుకెళ్లారు. కొప్పుల అనుచరులే తిరుపతిరెడ్డిని కిడ్నాప్​ చేశారని, తీవ్రంగా కొట్టి, గన్ తో బెదిరించారంటూ ఆ కుటుంబ సభ్యులు పోలీస్​స్టేషన్​ముందు ధర్నా చేశారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపడంతో ఆ రోజు రాత్రి తిరుపతిరెడ్డిని వదిలేశారు.

ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లిలో 75 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం దళితుల కోసం కేటాయించింది. దాన్ని నకిలీ డాక్యుమెంట్లతో కబ్జా చేశారంటూ దళిత సంఘాలు అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. కొప్పుల అనుచరులే ఈ కబ్జాకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి.

రూల్స్​ ప్రకారం పోలీసు కేసులుంటే గన్​ లైసెన్స్​ఇవ్వరు. కానీ కొప్పుల ముఖ్య అనుచరుడొకరిపై ఎన్నో కేసులు ఉన్నా గన్​ లైసెన్స్​ ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. దాన్ని చూపుతూ బెదిరింపులకు దిగుతున్నారని స్థానికులు అంటున్నారు.

Latest Updates