
హైదరాబాద్: పేదోళ్లు గొప్పగా బతకాలనే ఆశయంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లను కట్టిస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గొల్ల కొమురయ్య కాలనీలో డబుల్ బెడ్రూమ్ల లబ్ధిదారులకు డ్రా ద్వారా పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తలసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో వర్షం వస్తే ఇక్కడ తీవ్ర ఇబ్బందులు ఉండేవని, పది ఇళ్లు కట్టించామన్నారు. జాగా ఉన్న దగ్గర తప్పకుండా ఇళ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
‘గత నాయకుల తప్పిదాల వల్ల లబ్ధిదారుల దగ్గర పట్టాలు ఉన్నవి, వేరే వారు వారి ఇండ్లలో ఉన్నారు. కేసీఆర్ ఇండ్లు కట్టిస్తున్నారు, పెండ్లికి సాయం చేస్తున్నారు. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నది. అభివృద్ధి కార్యక్రమాలతో త్వరలోనే ఈ ప్రాంత రూపురేఖలు మారతాయి. హరితహారంలో అందరూ పాల్గొనాలి. ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది. చెట్ల పెంపకంతో ఆక్సిజన్ శాతం పెరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇల్లు ఉండటం అనేది గొప్ప ఆస్తి. గత ప్రభుత్వం 17 సంవత్సరాల కింద నిర్మించిన ఇండ్లకు ఇప్పటికీ బ్యాంకు అప్పు ఉంది. డబుల్ బెడ్రూంలను డిజైన్ చేసింది సీఎం కేసీఆరే. పేదవారికి ఉచితంగా ఇండ్లు కట్టిన వారు ప్రపంచంలో ఎవరూ లేరు’ అని తలసాని పేర్కొన్నారు.