మున్సిపల్ ఎన్నికల్లో మంత్రులకు ఎదురుగాలి

మున్సిపల్ ఎన్నికల్లో మంత్రులకు ఎదురుగాలి

హైదరాబాద్, వెలుగు:  మొన్నటి మున్సిపోల్స్ లో ఆరుగురు మంత్రులకు ఎదురుగాలి వీచింది. రిజల్ట్ సరిగా రాకుంటే.. పదవులు ఊడుతాయని సీఎం కేసీఆర్ ​ముందే హెచ్చరించటంతో ఎలాగైనా గెలవాలని మినిస్టర్లు ఆరాటపడ్డారు. ప్రచారంతో హోరెత్తించారు. కానీ రాష్ట్రమంతా టీఆర్​ఎస్​ గాలివీచినా వీరికి మాత్రం అనుకూలించలేదు. కొందరు మంత్రులు చాలా తక్కువ ఆధిక్యంతో గట్టెక్కాల్సి వచ్చింది. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తోన్న 14 మున్సిపాల్టీలను సొంతం చేసుకునేందుకు ఎక్స్ అఫీషియో ఓటర్లను పంపాల్సి వచ్చింది. కొందరు ఇతర పార్టీల సభ్యులు, స్వతంత్రులతో గట్టెక్కారు. ఓట్లు దక్కించుకోవడంలో ఫెయిలయ్యారనే డిస్కషన్​కు ఛాన్సిచ్చారు. దీంతో కేసీఆర్ ​అన్నట్టే చేస్తే ఈ మంత్రులపై చర్యలుంటాయా అనే చర్చ జరుగుతోంది.

గంగులను కంగారెత్తించినకమలం

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్​ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం చూపించడంతో మంత్రి గంగుల కమలాకర్ ఇబ్బంది పడ్డారు.  గత పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి ఊపు మీదున్న బీజేపీ అదే స్పీడ్ తో కార్పొరేషన్​ లో దూసుకెళ్లే ప్లాన్​చేసింది. తమ దగ్గర బీజేపీ వ్యూహాలను అడ్డుకుంటామని, పూర్తి మెజారిటీ సాధించి విక్టరీ కొడతామని పార్టీ పెద్దలకు గంగుల మాటిచ్చారనే చర్చ పార్టీ వర్గాల్లో సాగింది. గత మున్సిపల్ ఎన్నికల్లో 2 డివిజన్లలోనే గెలిచిన బీజేపీ ఈ ఎన్నికల్లో మరో 11 స్థానాలు గెలుచుకుని13 సీట్లు సాధించింది. దీంతో మంత్రి గంగుల కమలాకర్​ బీజేపీని ఎదుర్కోలేకపోయారని, అందుకే ఆయన కోరుకున్న వ్యక్తికి కాకుండా, మరో వ్యక్తికి  మేయర్ పదవి కట్టబెట్టారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

సబితమ్మా.. ఎందుకిలా

మంత్రి సబితా ఇంద్రారెడ్డి సొంత జిల్లాలోని  రాజకీయ పరిస్థితులను అంచనా వేయలేకపోయారు. కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ లోకి రాగానే వెంట కేడర్ వస్తుందని అనుకున్నారు. కాని లెక్క తప్పింది. కాంగ్రెస్​ కేడర్​ ఫీల్డ్ ​లెవెల్​లో బాగా పని చేయడంతో ఆమె కావాల్సినన్ని స్థానాలను దక్కించుకోలేకపోయారు. జల్ పల్లి మున్సిపాల్టీలో మజ్లీస్ పాగా వేయగా, తుక్కుగూడలో 15 వార్డుల్లో 4 మాత్రమే టీఆర్ఎస్ గెలిచింది. బీజేపీ 9 స్థానాలను గెలుచుకుంది. ఇక్కడ చైర్మన్​ సీటు గల్లంతయ్యే ప్రమాదం ఉండడంతో రాష్ట్ర పార్టీ ఏకంగా ఐదుగురు ఎక్స్ ఆఫీషియో సభ్యులను పంపి కుర్చీ కాపాడుకుంది. రంగారెడ్డి జిల్లా బాధ్యతలు చూసిన సబిత.. నార్సింగి, ఆదిభట్ల, పెద్ద అంబర్ పేట మున్సిపాల్టీలో చైర్మన్ పదవికి సరిపడే మెజారిటీ సాధించుకోలేకపోయారు. ఈ మున్సిపాల్టీల్లో చైర్మన్​ గిరీ కోసం 8 మంది ఎక్స్ ఆఫీషియో మెంబర్లను ఉపయోగించుకున్నారు.

ఈజీగా తీసుకున్న ఫలితం

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మంత్రిగా ఉన్న ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ కార్పొరేషన్​పై దృష్టి పెట్టలేదని, అందుకే రిజల్ట్స్​అనుకున్నట్టు రాలేదనే విమర్శలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ బలం పుంజుకుంటుందని నిఘా వర్గాలు హెచ్చరించినా మంత్రి సీరియస్ గా తీసుకోలేదని అంటున్నారు. మజ్లిస్, బీజేపీలు ఎక్కువ కాన్సంట్రేషన్​చేస్తే  మంత్రి తన నియోజకవర్గం పరిధిలోని భీంగల్ మున్సిపాల్టీలో ప్రచారం చేస్తూ గడిపారని ఆ జిల్లాకు చెందిన ఓ నేత కామెంట్​ చేశారు.

ముందే చేతులెత్తేసిన ఇంద్రకరణ్ 

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎన్నికల బాధ్యతలు తీసుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నామినేషన్ల సమయంలోనే చేతులు ఎత్తేశారని టాక్ ఉంది. భైంసాలో  క్యాండిడేట్లను నిలపడంలో విఫలమయ్యారని ఆ జిల్లా నాయకులు చెప్పారు. చాలా చోట్ల అభ్యర్థులు లేకపోవడంతో ఎంఐఎంతో కుమ్మక్మయ్యారనే విమర్శలు వచ్చాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కూడా బైంసాలోని ఎన్నికలు బీజేపీ, మజ్లీస్ పార్టీ మధ్యే జరిగాయని, ఇది పార్టీ భవిష్యత్​కు నష్టమని ఓ నాయకుడు అన్నారు.

మంత్రిపై గెలిచిన మాజీ మంత్రి

నాగర్ కర్నూల్ జిల్లాలో మంత్రి నిరంజన్ రెడ్డిపై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పైచేయి సాధించారని అంటున్నారు. క్యాండిడేట్లను గెలిపించుకోడానికి కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్​రెడ్డికి నిరంజన్​ సపోర్టు ఇచ్చారు. కాని ఫలితాలు మారాయి. జూపల్లి బలపరిచిన రెబల్స్ విజయం సాధించారు. తన అనుచరులను అందర్నీ గెలిపించుకున్నా జూపల్లిని పార్టీ దగ్గరికి రానివ్వలేదు. ముగ్గురు ఎక్స్ఆఫీషియో మెంబర్లతో కొల్లాపూర్ లో టీఆర్​ఎస్​ జెండా ఎగరవేసింది.

జగదీశ్..అనుకున్నదొక్కటిఅయ్యిందొక్కటి

ఉమ్మడి నల్గొండ జిల్లాలో తనకు మంచి పట్టుందని అనుకున్న మంత్రి జగదీశ్ రెడ్డికి మున్సిపోల్స్ పెద్ద సవాలు విసిరాయి. సూర్యాపేటలో రెబల్స్ ను బుజ్జగించడంలో విఫలమయ్యారు. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులు చిట్యాలలో రెబల్స్ గా పోటీకి దిగితే వారిని బుజ్జగించలేదనే ప్రచారం ఉంది. వేముల అనుచరుల వెనుక మంత్రి ప్రోత్సాహం ఉందని నకిరేకల్ ఎమ్మెల్యే వర్గం అనుమానిస్తోంది. యాదగిరిగట్ట చైర్మన్ సీటుపై కాంగ్రెస్ నజర్​ వేసినా మంత్రి గుర్తించడంలో విఫలం అయ్యారని అంటున్నారు. ఇక నేరేడుచర్ల మున్సిపాల్టీపైనా మంత్రి దృష్టి పెట్టకపోవడంతోనే కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలిచిందని జిల్లాకు చెందిన ఓ టీఆర్​ఎస్​ నాయకుడు కామెంట్ చేశారు. చండూర్ మున్సిపాల్టీలో పార్టీ విజయం కోసం సహకరించలేదని, అందుకే అక్కడ కాంగ్రెస్ గెలిచిందని మాజీ ఎమ్మెల్యే అనుచరులు ఆరోపిస్తున్నారు.